
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమి తులైన కలకత్తా హైకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇతర న్యాయమూర్తుల సమక్షంలో సుప్రీంకోర్టు ఆవరణలో ఈ కార్యక్రమం జరిగింది. జస్టిస్ బాగ్చీ అత్యున్నత న్యాయస్థానంలో ఆరేళ్లకు పైగా ఉంటారు. బాగ్చీ ప్రమాణ స్వీకారంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరింది. మరో పోస్టు ఖాళీగా ఉంది. బాగ్చీ 2031 మే 25న సీజేఐగా బాధ్యతలు చేపడతారు.
అక్టోబర్ 2న ఆయన పదవీ విరమణ వరకూ కొనసాగుతారు. 1966 అక్టోబర్ 3న జన్మించిన జస్టిస్ బాగ్చీ.. 2011 జూన్27న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 జనవరి 4న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అప్పటినుంచి అక్కడే విధులు నిర్వహించారు. 13 ఏళ్లకు పైగా హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన ఆయన ప్రధాన న్యాయమూర్తుల తో సహా హైకోర్టు న్యాయమూర్తుల ఉమ్మడి అఖిల భారత సీనియారిటీలో 11వ స్థానంలో ఉన్నారు. సీజేఐ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం మార్చి 6న జస్టిస్ బాగ్చీ పేరును సిఫారసు చేసింది.