
ఇది మాటలకందని విషాదం.. ఊహించని ఘటన ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్ జిల్లాలో రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రెండు గూడ్స్ ట్రైన్ల డ్రైవర్లు మృతిచెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో మృతి చెందిన లోకో పైలట్ గంగేశ్వర్ ఏప్రిల్ 1న పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. అదే రోజే ఆయన అనంత లోకాలకు పయనమయ్యారు.
ఇక తమ కుటుంబంతో ఆనందంగా గడపొచ్చనే ఆయన కలలు ఆవిరైపోవడంతో పాటు కుటుంబ సభ్యులకు ఊహించని విషాదమే మిగిలింది. రిటైర్‌మెంట్ రోజు ఆయనతో కలిసి విందు చేసుకోవాలని ఎదురు చూస్తున్న కుటుంబానికి కన్నీరే మిగిలింది.
విధి నిర్వహణలో చివరి రోజున తోటి ఉద్యోగులతో సరదాగా గడిపి.. ఎన్నో జ్ఞాపకాలతో తిరిగి వస్తాడనుకున్న తన తండ్రి ఇంకెప్పటికీ రాడనే విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ ఆయన కూతురు విలపించింది. రేపటి నుంచి ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటానని ఆనందంగా చెప్పి వెళ్లిన తండ్రి.. ప్రమాదంలో మృతి చెందడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.