
జైపూర్: దేశం కంటే వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారిని చంపేయాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ వ్యాఖ్యానించారు. దేశ ప్రయోజనాలను పరమోన్నతంగా భావించని వారు వెల్లడించే అభిప్రాయం దేశ వ్యతిరేకంగానే ఉంటుందని పేర్కొన్నారు. దేశం ముందుకు సాగాలంటే ఇటువంటి వారిని అడ్డుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
అయినా వారు జాతి అభివృద్ధికి హానికరమైన తమ చర్యలను కొనసాగిస్తున్న పక్షంలో చంపేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నానన్నారు. విభిన్న అభిప్రాయాలను కలిగి ఉండటం ప్రజాస్వామ్యమనే పుష్పగుచ్ఛంలో పరిమళాలన్న ఉపరాష్ట్రపతి.. వ్యక్తిగత, రాజకీయ లాభం కంటే జాతి ప్రయోజనాలను మిన్నగా చూసుకునే వారికే ఇది వర్తిస్తుందన్నారు. మన గుర్తింపు భారతీయత, మన జాతీయ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడరాదన్నారు. ఆదివారం జైపూర్‌లో అవయవదాతలతో ఏర్పాటైన సమావేశంలో ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ మాట్లాడారు.