నేడు స్ట్రీట్‌ చిల్డ్రన్‌ డే: వీధి నుంచి ఇంటికి | Rainbow Homes is a non-profit organization working for street children | Sakshi
Sakshi News home page

నేడు స్ట్రీట్‌ చిల్డ్రన్‌ డే: వీధి నుంచి ఇంటికి

Published Sat, Apr 12 2025 3:53 AM | Last Updated on Sat, Apr 12 2025 3:53 AM

Rainbow Homes is a non-profit organization working for street children

మన ఉరుకుల పరుగుల జీవనంలో ఒక్క కుదుపుతో ఆపే రెడ్‌ సిగ్నల్‌లా  బాల్యం కూడలిలో భిక్షం ఎత్తుతూ కనిపిస్తుంది. జాతరలా తోసుకువెళుతున్న సమూహంలో 
నిలువెల్లా రంగు పూసుకుని చేతి కర్రతో  గాంధీ తాతలా బాల్యం నిగ్గదీస్తుంది. చిన్న బొజ్జను నింపుకోలేని చిట్టి చేతులతో  జీవితంతో పోరాడలేక దొంగ అవుతుంది, దోపిడీకి గురవుతుంది. బాలనేరస్తులుగా ముద్ర వేయించుకొని భవిష్యత్తును బందిఖానాలా మార్చుకుంటుంది. దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది వీధి బాలలు ఉన్నట్టు యునిసెఫ్‌ అంచనా. హైదరాబాద్‌లో 28,000కు పైగా వీధి బాలలు ఉన్నట్టు అంచనా. పాట్నా పట్టణంలో వీధి బాలల సంఖ్య ఎక్కువ.

వీధి బాల్యం ఎందుకు పెరుగుతోందంటే..
గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు బతుకుదెరువు కోసం వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. పనులు దొరక్క, నిలువనీడ లేక, కనీస అవసరాలు తీరక తల్లిదండ్రులు గొడవలు పడటం, విడిపోవడం, కుటుంబాలు విచ్ఛిన్నమవడంతో దిక్కుతోచని స్థితిలో పిల్లలు రోడ్ల మీదకు వస్తున్నారు. మన దేశంలో గుర్తించినవే కాదు గుర్తింపునకు నోచుకోని స్లమ్స్‌ చాలా ఉన్నాయి. వీటిల్లో నివాసం, ఆహార భద్రత లేమి, చదువు నూ దూరం చేస్తుంది. ఇప్పటికే వీధి బాలల్లో 82 శాతం మంది చదువును ఆపేశారని నివేదికలు చూపుతున్నాయి. 

వీరంతా జీవనోపాధి కోసం చిత్తు కాగితాలు ఏరుకోవడం, కూలి పనులు, భిక్షాటన, షూ పాలిష్, పూలు అమ్మడం.. వంటి వాటిని ఎంచుకుంటుంటే కొంతమంది దొంగతనం, చైన్‌ స్నాచింగ్, పిక్‌ పాకెటింగ్, మాదక ద్రవ్యాల వ్యాపారం.. మొదలైన చట్ట వ్యతిరేక పనుల్లో పాల్గొంటున్నారు. హెచ్‌ఐవి/ఎయిడ్స్‌ బారిన పడటం, ఆడపిల్లలు చిన్నవయసులోనే గర్భం దాల్చడం, గర్భస్రావాలు.. వంటి సమస్యలనూ ఎదుర్కొంటున్నారు.  

సమాజంలో వీధి బాలల పట్ల ఉన్న వ్యతిరేకతను దూరం చేయడానికి అవగాహన శిబిరాలను ఏర్పాటు చేయడం, మహిళలకు, యువతకు జీవన నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం తప్పనిసరిగా చేయాల్సిన పనులుగా వివరించారు. ఇందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలి. 
 

ఆత్మీయ ఆహ్వానం
వీధి బాలల కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థల్లో రెయిన్‌ బో హోమ్స్‌ ఒకటి. ఈ హోమ్స్‌ హైదరాబాద్‌లో 14 ఉంటే, దేశ వ్యాప్తంగా 50 వరకు ఉన్నాయి. ఒక్కో హోమ్‌లో 70 నుంచి 80 మంది పిల్లలు సంరక్షణను పొందుతున్నారు. రోడ్డు మీద నుంచి హోమ్‌లోకి వచ్చే పిల్లలకు సంరక్షణ పొందుతున్న పిల్లలు ఆత్మీయ ఆహ్వానం పలుకుతారు. ‘తమ కుటుంబంలో చేరిన కొత్తవారిని తోబుట్టువుల్లా దగ్గరకు తీసుకుంటారు’ అని తెలిపారు నిర్వాహకులు.

మూలాన్ని సమీక్షించాలి...
సుమతి చదువుకోలేదు. గ్రామీణ నేపథ్యం. తన ఈడు వయసున్న అతన్ని ప్రేమించి, కుటుంబాన్ని వదిలేసి అతనితో పాటు పట్టణం వచ్చేసింది. కొంతకాలం బాగానే ఉన్నా చెడు అలవాట్లకు బానిసైన అతను ఆమెను, పుట్టిన బిడ్డనూ వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. దీంతో సుమతిది మానసిక కుంగుబాటు, ఎలా బతకాలో తెలియని నిస్సహాయ స్థితి. బిడ్డను కాపాడుకోవడానికి ఎక్కడెక్కడో తిరిగి, సెక్స్‌వర్కర్‌గా మారింది. ‘ఇలాంటి వారిని గుర్తించి తల్లికి, బిడ్డకు సంరక్షణను అందించే బాధ్యతను తీసుకున్నామ’ని తెలిపారు రెయిన్‌ బో హోమ్స్‌ డైరెక్టర్‌ అనూరాధ. ఇలాంటి వేదనాభరితమైన జీవన కథనాలెన్నో సమాజంలో ఉన్నాయని, స్ట్రీట్‌ చిల్డ్రన్స్‌ సంరక్షణ విధానాల గురించి అనూరాధ వివరించారు.

చిన్న భరోసా!
దేశవ్యాప్తంగా వివిధ సమస్యలను ఎదుర్కొంటున్న 18 లక్షల మంది పిల్లలను గుర్తించాం. 6 నుంచి 18 ఏళ్ల వరకు ఉన్న వీధి బాలలను సంరక్షించి ఆ తర్వాత వదిలేయకుండా 23 ఏళ్ల వరకు స్కిల్స్‌ అందించి, భవిష్యత్తు బాగుండేలా  చూస్తున్నాం. కొన్ని వేల మంది పిల్లలు చదువుకొని, వివిధ నైపుణ్యాలు పెంచుకొని తమ జీవితం తాము ఆనందం గడుపుతున్నారు. నర్సులుగా, వివిధ రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నవారూ, ఉన్నవారు,, పెళ్లి్ల చేసుకొని తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందిస్తున్న వారున్నారు. మా చేయూతతో తమ బాల్యంలోని చేదును దూరం చేసుకొని, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. 
– అనూరాధ, ఎగ్జిక్యుటివ్‌ డైరెక్టర్, రెయిన్‌ బో హోమ్స్‌ 
 

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement