
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఈరోజు(ఆదివారం) ‘మన్ కీ బాత్’(Mann Ki Baat) 120వ ఎపిసోడ్‌లో ప్రజలతో వివిధ అంశాలపై సంభాషించారు.‘ఈ రోజు నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. భారతీయ నూతన సంవత్సరం కూడా ఈ రోజే మొదలువుతుంది. ఈ రోజు మొదలుకొని రాబోయే కొద్ది రోజుల్లో మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పలు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ పండుగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
వేసవి సెలవులు సద్వినియోగం చేసుకోండి
‘పరీక్షల సమయంలో వాటి గురించి చర్చించాను. త్వరలో వేసవి సెలవులు రాబోతున్నాయి. పిల్లలు వాటి కోసం వేచి చూస్తున్నారు. కొత్త అభిరుచులను మెరుగుపరుచుకునేందుకు తగిన సమయం ఇది. వేసవి సెలవుల కోసం రూపొందించిన ‘మై క్యాలెండర్’చిన్నారులకు ఎంతగానో ఉపకరిస్తుంది. అంబేద్కర్ జయంతి నాడు జరిగే పాదయాత్రలో పాల్గొనడం ద్వారా, మీరంతా రాజ్యాంగ విలువల గురించిన సమాచారాన్ని అందరికీ తెలియజేయగలుగుతారు’ అని మోదీ పేర్కొన్నారు
నీటిని పొదుపుగా వాడండి
‘నీటి పొదుపు ప్రచారం వేసవి కాలంలోనే ముమ్మరంగా జరుగుతుంది. మనకు లభించిన సహజ వనరులను తదుపరి తరానికి అందించడం మన బాధ్యత. దేశంలో గత ఏడెనిమిదేళ్లలో కొత్తగా నిర్మించిన ట్యాంకులు, చెరువులు, ఇతర నీటి నిల్వల నిర్మాణాల ద్వారా నీటిని సంరక్షించారు. ఈ విషయంలో అందరూ ఇప్పటి నుండే ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. మీ ఇంటి ముందు ఒక కుండలో చల్లటి నీటిని అందరికీ అందుబాటులో ఉంచండి’ అని ప్రధాని మోదీ అభ్యర్థించారు.
ప్రతిభచాటిన పారా గేమ్స్ ఆటగాళ్లు
ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా పారా గేమ్స్(Khelo India Para Games)లో ఆటగాళ్లు తమ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈసారి ఎక్కువ మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. వారిని అభినందిస్తున్నాను. దివ్యాంగ క్రీడాకారులు 18 జాతీయ రికార్డులను కూడా సృష్టించారు. మన దేశీయ ఆటలు ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఫిట్ ఇండియా కార్నివాల్‌లో వివిధ ప్రాంతాల నుండి సుమారు 25 వేల మంది పాల్గొన్నారు. వారందరి లక్ష్యం ఒక్కటే ‘ఫిట్‌గా ఉండటం.. ఫిట్‌నెస్ గురించి అందరికీ అవగాహన కల్పించడం’ అని ప్రధాని పేర్కొన్నారు.
సవాల్‌గా మారిన వస్త్ర వ్యర్థాలు
దేశంలో వస్త్ర వ్యర్థాలు కొత్త సవాలుగా మారాయి. మనం పాత దుస్తులను పారవేసినప్పుడు వాటిలో ఒక శాతం మాత్రమే రీసైకిల్ అవుతుంది. ప్రపంచంలో అత్యధిక వస్త్ర వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే మూడవ దేశం భారత్.ఈ సవాలును ఎదుర్కొనేందుకు పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ స్టార్టప్‌లు పాత బట్టలు, బూట్లు, చెప్పులను రీసైక్లింగ్ చేసి ఉపయోగకరంగా మారుస్తున్నాయని ప్రధాని తెలిపారు.
యోగా దినోత్సవానికి ఏర్పాట్లు
యోగా దినోత్సవానికి ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంది. యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలి. ప్రపంచ మానవాళికి భారత్ ఇచ్చిన బహుమతి యోగా. ఇది భవిష్యత్ తరానికి ఉపయోగపడుతుంది. యోగా సాయంతో ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిద్దాం. నేడు పెద్ద సంఖ్యలో యువత యోగాను అభ్యసిస్తున్నారు. అలాగే ఆయుర్వేదాన్ని కూడా ఆశ్రయిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: పుతిన్ కారులో భారీ పేలుడు.. జెలెన్స్కీ భవిష్యవాణి నిజమేనా?