
పార్లమెంట్ ఆవరణలో రాహుల్‌గాంధీని కలిసిన కొండా సురేఖ, రాజ్‌ఠాకూర్, ప్రకాశ్‌గౌడ్, మహేశ్‌కుమార్ గౌడ్, బీర్ల అయిలయ్య, పొన్నం, వీర్లపల్లి శంకర్, ఆది శ్రీనివాస్, సంజీవ్‌రెడ్డి, బలరాంనాయక్
పార్లమెంటులో తీర్మానం కోసం పోరాటం చేస్తాం
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీ హామీ
పార్లమెంటు వద్ద వారిని కలిసిన పీసీసీ చీఫ్, రాష్ట్ర మంత్రులు
బీసీలపై కేంద్రం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి
పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్
సాక్షి, న్యూఢిల్లీ: బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేయటంద్వారా సామాజిక న్యాయ సాధనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దారి చూపిందని కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాం«దీ, రాహుల్‌గాంధీ అన్నారు. కులగణనను పూర్తి చేయడంతో పాటు దానికి అసెంబ్లీ ఆమోదం పొందిన తీరు అభినందనీయమని ప్రభుత్వాన్ని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవ వల్ల విద్య, ఉద్యోగాల్లో బీసీలకు న్యాయం జరుగుతుందని ఆకాంక్షించారు.
బీసీ రిజర్వేషన్ల పెంపునకు తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ వెలుపలా, లోపలా ఈ తీర్మానం కోసం పోరాటం చేస్తామని తెలిపారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, వాకిటి శ్రీహరి, బీర్ల అయిలయ్య, రాజ్‌ఠాకూర్, వీర్లపల్లి శంకర్, సంజీవ్‌రెడ్డి తదితరులు సోనియా, రాహుల్‌లను పార్లమెంట్ ప్రాంగణంలో విడివిడిగా కలిశారు.
జనగణన, బీసీ బిల్లుపై తీర్మానం, జంతర్‌మంతర్‌లో ధర్నా గురించి వారికి వివరించారు. పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్లుపై కీలక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ధర్నాకు హాజరు కాలేకపోయానని రాహుల్‌గాంధీ ఈ సందర్భంగా చెప్పారు. బీసీలకు సామాజిక న్యా యం జరిగేవరకు అన్ని రకాలుగా మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు.
కేంద్రం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల పెంపు తీర్మానాన్ని పార్లమెంట్‌లో ఆమోదించి బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని కోరారు.
రాహుల్, సోనియాతో భేటీ అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై చర్చించేందుకు ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ తీసుకోవాలని తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారు. రిజర్వేషన్ల అమలుకై ఎక్కడికైనా వచ్చేందుకు సీఎం రేవంత్‌తో సహా కేబినెట్ మంత్రులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హెచ్‌సీఏ భూములు వాస్తవంగా ప్రభుత్వానికి చెందినవని చెప్పారు. ఈ భూముల విషయంలో బీఆర్‌ఎస్, బీజేపీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని
విమర్శించారు.
కాంగ్రెస్ ప్రతినిధి బృందం కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి వీరేంద్రకుమార్‌ను కలిసి బీసీ రిజర్వేషన్ల బిల్లుపై చర్చించింది.