
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందారు.
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందారు. హోరాహోరీగా సాగిన కౌంటింగ్‌లో 5,500 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి విజయం దక్కించుకున్నారు. కౌంటింగ్ కేంద్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి కన్నీటి పర్యంతమై వెళ్లిపోయారు. నరేందర్ రెడ్డి రెండో స్థానం, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ హవా కొనసాగింది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ సిట్టింగ్ ఎమ్మెల్సీని కాంగ్రెస్ కోల్పోయింది. ఎన్నికలు జరిగిన 3 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ రెండింటిని కైవసం చేసుకుంది. రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఒకటి బీజేపీ కైవసం చేసుకోగా, మరొకటి పీఆర్‌టీయూ సొంతం చేసుకుంది. కరీంనగర్–మెదక్–నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, వరంగల్–ఖమ్మం–నల్లగొండ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు.
వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి అయిన సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,848 ఓట్లు వచ్చాయి.
కాగా, కరీంనగర్-మెదక్-నిజామాబాద్–ఆదిలాబాద్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని ముందు నుంచీ ఊహించినట్టుగానే బీజేపీ కైవసం చేసుకుంది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 27,088 ఓట్లకుగాను.. 25,041 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో 24,144 ఓట్లు చెల్లుబాలు అయ్యాయి. 897 ఓట్లు చెల్లలేదని అధికారులు ప్రకటించారు. గెలుపు కోటాగా 12,073 ఓట్లను నిర్ధారించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు, వంగ మహేందర్‌రెడ్డికి 7,182, అశోక్‌కుమార్‌కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. తొలిరౌండ్‌లోనే బీజేపీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు.