
సాక్షి, విజయవాడ: సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డితో పాటు మరో ఆరుగురు జర్నలిస్టులపై కేసు నమోదు చేయడాన్ని జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. వెంటనే కేసును ఎత్తివేయాలని ఎన్టీఆర్ జిల్లా డీఆర్వోకు జర్నలిస్ట్ సంఘాల నాయకులు వినతిపత్రం సమర్పించారు. సామ్నా రాష్ట్ర అధ్యక్షులు నల్లి ధర్మారావు మాట్లాడుతూ, వార్త రాయడం సమాజంలో జర్నలిస్టు ప్రాథమిక ధర్మం. కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసులు పెట్టినట్లు భావిస్తున్నాం.
..రాజ్యాంగానికి ఏ వ్యవస్థా అతీతం కాదు. విలేకరి వార్త రాస్తే ఎడిటర్లపై కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామిక విలువలను గౌరవించడం లేదని దీన్ని బట్టి తెలుస్తోంది. ఇలా కేసులు పెట్టడం మంచి పద్దతి కాదు. తక్షణమే కేసును నమోదు ఉపసంహరించుకోవాలి. జర్నలిస్టులకు మా యూనియన్లు అండగా ఉంటాయి. మా పోరాటం కొనసాగిస్తాం’’ అని ధర్మారావు హెచ్చరించారు.
కక్ష సాధింపు రాజకీయాలకు సంకేతం..
ఐజేయూ నేషనల్ కౌన్సిల్ సభ్యులు ఎస్‌కే బాబు మాట్లాడుతూ.. సాక్షి ఎడిటర్‌తో పాటు ఇతర జర్నలిస్టులపై పెట్టిన కేసులు అక్రమం అని.. తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు రాజకీయాలకు సంకేతం. రాజకీయ పార్టీలు కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదు. ఇలా కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే
భావ్యం కాదు..
సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛను అణగదొక్కాలని చూడటం ప్రభుత్వానికి భావ్యం కాదు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ప్రభుత్వం కోరుతున్నాం. పత్రికల పై దాడులు చేయకుండా ప్రభుత్వం సంయమనం పాటించాలి. సాక్షి ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలి