
గుంటూరు, సాక్షి: అన్ని కరెక్ట్‌గా జరిగి ఉంటే ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌పీనే గెలిచి మళ్లీ అధికారంలోకి వచ్చి ఉండేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. ఆయన పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఆయన మీడియాతో స్పందించారు.
నేను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒత్తిళ్ళు ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడాలి. విజయసాయి రెడ్డి ఎందుకు వెళ్ళిపోయారో ఆయనే చెప్పాడు. ఆయన మంచి వ్యక్తి. విజయసాయి ఒత్తిళ్లకు తలొగ్గే వ్యక్తి కాదు. ఆయన రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారో ఆయన వ్యక్తిగతం.
అలాగే ప్రతీ రాజకీయ పార్టీకి ఎత్తు పల్లాలు ఉంటాయి. అలాగే రాజకీయపరమైన ఒత్తిళ్లు ఉంటాయి. ఈ క్రమంలో ఎమ్మెల్సీలపై కూడా ఒత్తిళ్లు ఉన్నాయి. ఓటమిలో కూడా తట్టుకొని నిలబడాలి. కష్టాలు వచ్చినప్పుడే పోరాటాలు చేయాలి.. నిలబడాలి. అప్పుడే పార్టీ మనుగడ కొనసాగుతుంది’’ అని అయోధ్య రామిరెడ్డి అన్నారాయన.
