
సాక్షి, తాడేపల్లి: అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత వైఎస్ జగన్ అని.. ఇంటెలిజెన్స్ సంస్థల రిపోర్టుల ప్రకారం అత్యధిక థ్రెట్ ఉన్న నేత కూడా ఆయనేనని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. గురువారం ఆయన వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌కు మూడంచెల భద్రత అవసరం. రాష్ట్రంలో జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా వేలాదిగా అభిమానులు వస్తున్నారు. వారిని అదుపు చేయాల్సిన బాధ్యత పోలీసులదే’’ అని మాధవ్ అన్నారు.
‘‘రామగిరి జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం క్లియర్‌గా కనిపించింది. హోంమంత్రి అనిత మాత్రం జగన్ పర్యటనలో 1100 మంది పోలీసులను పెట్టామని చెప్తున్నారు. ఆ 1100 పోలీసుల్లో ఎక్కువ మందిని పరిటాల సునీత ఇంటి దగ్గరే పెట్టారు. హెలికాఫ్టర్‌ను ఇబ్బందులకు గురిచేసి మార్గమధ్యలో ఆయనపై దాడి చేయాలని కుట్ర పన్నారు. మంత్రి నారా లోకేష్‌కు జెడ్ ప్లస్ రక్షణ కల్పిస్తున్నారు. వైఎస్ జగన్‌కు మాత్రం రక్షణ తగ్గిస్తున్నారు. జగన్‌కు పూర్తిస్థాయి రక్షణ బాధ్యత పోలీసులదే’’ అని గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు.
‘‘రామగిరిలో ముత్యాలు అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఇంటిపై రాళ్ల దాడి జరిగిన సమయంలో నేనే పోలీసులకు సమాచారం ఇచ్చా. ఘటన సమయంలో అక్కడకు వచ్చిన పోలీసులు కింద పడ్డ రాళ్లను తమ వాహనంలో వేసుకుని వెళ్లారు. రామగిరి ఎస్‌ఐ.. బాధితుల వాహనాల్లో కత్తులు పెట్టి తిరిగి అక్రమ కేసులు పెట్టారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేసినా పోలీసులు పట్టించుకోకపోవటం వల్లే హత్యల వరకు పరిస్థితి వెళ్లింది. రామగిరి ఎస్‌ఐ పనులకు పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టడం హాస్యాస్పదం’’ అని గోరంట్ల మాధవ్ మండిపడ్డారు.