
వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జయకేతనం
పుంగనూరు/పాడేరు/పార్వతీపురం టౌన్: చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యేగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపొందారు. పెద్దిరెడ్డికి 99,774 ఓట్లు రాగా.. 6,619 ఓట్ల మెజార్టీ లభించింది. టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి 93,155 ఓట్లు లభించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు 19,338 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయనకు 68,170 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరికి 48,832 ఓట్లు వచ్చాయి.
అరకు అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రేగం మత్స్యలింగం బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావుపై 31,877 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మత్స్యలింగంకు 65,658 ఓట్లు రాగా.. బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావుకు 33,781 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్ జిల్లా బద్వేలులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ సుధ బీజేపీ అభ్యర్థి బొజ్జా రోశన్నపై 18,567 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రాజంపేట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంపై 7,016 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
నాలుగోసారి బాలనాగిరెడ్డి విజయబావుటా కర్నూలు జిల్లా మంత్రాలయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి యల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి నాలుగోసారి విజయబావుటా ఎగురవేశారు. బాలనాగిరెడ్డి 87,662 ఓట్లు, టీడీపీ అభ్యర్థి ఎన్.రాఘవేంద్రరెడ్డి 74,857 ఓట్లు దక్కించుకున్నారు. బాలనాగిరెడ్డికి 12,805 ఓట్ల మెజార్టీ లభించింది. ఆలూరు నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బూసినె విరుపాక్షి విజయం సాధించారు.
టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్‌పై 2,831 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే, రీకౌంటింగ్ చేయాలని టీడీపీ ఏజెంట్లు పట్టుబట్టారు. ప్రతీ రౌండ్‌లోనూ ఏజెంట్లు సంతకాలు చేశాకే.. ఆ తర్వాతి రౌండు లెక్కించారు. దీంతో ఎన్నికల అధికారి సృజన రీకౌంటింగ్‌ను తిరస్కరించారు. తంబళ్లపల్లెలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి టీడీపీ నుంచి అభ్యర్థి జయచంద్రారెడ్డిపై 10,103 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.