
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో శనివారం(ఏప్రిల్ 12) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. తొలి ఐదు మ్యాచ్‌ల్లో విఫలమైన అభిషేక్.. పంజాబ్ కింగ్స్‌పై మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
ఉప్పల్ మైదానంలో అభిషేక్ తన బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 40 బంతుల్లోనే తొలి ఐపీఎల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న అభిషేక్.. 14 ఫోర్లు, 10 సిక్స్‌లతో 141 పరుగులు చేశాడు.
అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా ఎస్‌ఆర్‌హెచ్ 246 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఛేదించింది. అయితే అభిషేక్ శర్మ జ్వరంతో బాధపడుతూనే ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడంట. ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం శర్మనే స్వయంగా వెల్లడించాడు. అదేవిధంగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్, భారత టీ20 కెప్టెన్ సుర్యకుమార్ యాదవ్ తనకు ఎంతో సపోర్ట్‌గా ఉన్నారని అభిషేక్ తెలిపాడు.
"నేను నాలుగైదు రోజుల నుంచి జ్వరంతో బాధపడతున్నాను. ఈ సమయంలో యువరాజ్ సింగ్, సూర్యకుమార్ యాదవ్ నాకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. నా ఆరోగ్యం గురుంచి తెలుసుకున్నారు.
ఇటువంటి వ్యక్తులు నాతో ఉండడం చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ఏడాది సీజన్‌లో అంత మంచి ఆరంభాన్ని అందుకోలేకపోయాను. నాపై నాకే కాస్త చిరాకు అన్పించింది. అప్పుడు కూడా నాకు వారు మద్దతుగా నిలిచారు.
ఒక్క మంచి ఇన్నింగ్స్ వస్తే చాలు తిరిగి ఫామ్‌ను అందుకోవచ్చని ధైర్యం చెప్పారు. నేను కూడా అందుకోసం ఎదురు చూశాను. ఈ రోజు అది నేరవేరింది. ఎట్టకేలకు ఓ భారీ ఇన్నింగ్స్ ఆడగాలను" అని అభిషేక్ పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో పేర్కొన్నాడు.