IPL 2024: నీకు ‘బడిత పూజ’ తప్పదు.. యువీ ‘ఫైర్‌’! | Sakshi
Sakshi News home page

IPL 2024: నీకు ‘బడిత పూజ’ తప్పదు.. యువీ ‘ఫైర్‌’!

Published Sat, Apr 6 2024 3:19 PM

Yuvraj Singh Again Scolds Abhishek Sharma To Get Out On Bad Shot Viral - Sakshi

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ స్టార్‌ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మపై టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ మరోసారి ‘కోపం’ ప్రదర్శించాడు. గతంలో అభిషేక్‌కు చెప్పు చూపి బెదిరించిన యువీ.. ఈసారి నీకు బడిత పూజ తప్పదన్నట్లుగా ఓ మీమ్‌ షేర్‌ చేశాడు.

కాగా ఐపీఎల్‌-2024లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్‌ అదరగొట్టిన విషయం తెలిసిందే. 166 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌కు ఈ లెఫ్టాండ్‌ ఓపెనర్‌ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు.

సీఎస్‌కే బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ కేవలం 12 బంతుల్లో 37 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లతో పాటు ఏకంగా నాలుగు సిక్సర్లు ఉండటం విశేషం. స్ట్రైక్‌ రేటు ఏకంగా 308.33. అయితే,  అతడి అభిషేక్‌ బ్యాటింగ్‌ మెరుపులు ఇంకాసేపు చూడాలని భావించిన అభిమానుల ఆశలపై దీపక్‌ చహర్‌- రవీంద్ర జడేజా నీళ్లు చల్లారు.

రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో మూడో ఓవర్లో చహర్‌ వేసిన నాలుగో బంతి అవుట్‌ ఆఫ్‌ దిశగా వైడ్‌ వెళ్తుండగా.. అభిషేక్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు. డీప్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ మీదుగా బంతిని కొట్టగా.. ఫీల్డర్‌ జడ్డూ అద్భుత రీతిలో క్యాచ్‌ అందుకున్నాడు. ఫలితంగా అభిషేక్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది.

ఏదేమైనా ఈ మ్యాచ్‌లో జట్టును గెలిపించిన అభిషేక్‌ శర్మను ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వరించింది. ఈ క్రమంలో అతడిపై ప్రశంసలు కురిపిస్తూనే చిరుకోపం ప్రదర్శించాడు యువీ. ‘‘నేను ఎల్లప్పుడూ నీకు మద్దతుగానే ఉంటాను బాబూ.. మరోసారి మంచి ఇన్నింగ్స్‌ ఆడావు.

అయితే, ఈసారి కూడా చెత్త షాట్‌ సెలక్షన్‌కు అవుటయ్యావు’’ అంటూ ఓ వ్యక్తి కర్ర లాంటి వస్తువుతో మరో వ్యక్తిని తరుముతున్నట్లుగా ఉన్న హిలేరియస్‌ మీమ్‌ ఒకటి షేర్‌ చేశాడు. యువీ చేసిన ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా పంజాబ్‌కు చెందిన అభిషేక్‌ శర్మ యువీకి వీరాభిమాని. ఇక అభిషేక్‌కు యువరాజ్‌ మెంటార్‌గా వ్యవహరిస్తూ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం అభిషేక్‌ మాట్లాడుతూ.. ‘‘యువీ పాజీ.. ధన్యవాదాలు’’ అంటూ కృతజ్ఞత చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో యువరాజ్‌ సింగ్‌ ఈ మేరకు స్పందించడం గమనార్హం.

ఐపీఎల్‌-2024 ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్‌ సీఎస్‌కే
►టాస్‌- ఎస్‌ఆర్‌హెచ్‌- బౌలింగ్‌
►సీఎస్‌కే స్కోరు: 165/5 (20)
►ఎస్‌ఆర్‌హెచ్‌: 166/4 (18.1).
►ఫలితం: ఆరు వికెట్ల తేడాతో చెన్నైపై సన్‌రైజర్స్‌ విజయం.

చదవండి: జడ్డూ అవుట్‌ కావాలి కదా? కమిన్స్‌ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement