
బంగ్లాదేశ్ క్రికెట్ దిగ్గజం మహ్మదుల్లా పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ మహ్మదుల్లా కెరీర్‌లో చివరి టీ20 సిరీస్ అయ్యే అవకాశం ఉంది. స్పోర్ట్స్‌కీడా కథనం మేరకు భారత్‌తో మూడో టీ20 అనంతరం మహ్మదుల్లా పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాడు. వాస్తవానికి మహ్మదుల్లా టీ20 వరల్డ్‌కప్ 2024 అనంతరమే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు.
అయితే బంగ్లా సెలెక్టర్లు అతన్ని భారత్‌తో సిరీస్‌కు ఎంపిక చేశారు. 39 ఏళ్ల మహ్మదుల్లా 2021లో టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించి.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. భారత్‌తో జరిగిన తొలి టీ20లో మహ్మదుల్లా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మయాంక్‌కు టీ20 కెరీర్‌లో మహ్మదుల్లానే తొలి వికెట్.
మహ్మదుల్లా కెరీర్ కొనసాగిందిలా..
బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన మహ్మదుల్లా బంగ్లాదేశ్ తరఫున తన కెరీర్‌ను 2007లో టీ20 ఫార్మాట్‌తో ప్రారంభించాడు. నాటి నుంచి బంగ్లా తరఫున 50 టెస్ట్‌లు, 232 వన్డేలు, 138 టీ20లు ఆడాడు. మహ్మదుల్లా టెస్ట్‌ల్లో 2914 పరుగులు (5 సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు) చేసి 43 వికెట్లు (ఓ ఐదు వికెట్ల ఘనత) తీశాడు.
వన్డేల్లో మహ్మదుల్లా 5386 పరుగులు (4 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలు) చేసి 82 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 2394 పరుగులు (8 హాఫ్ సెంచరీలు) చేసి 40 వికెట్లు తీశాడు. మహ్మదుల్లా (2395 రన్స్).. షకీబ్ అల్ హసన్ (2551 పరుగులు) తర్వాత టీ20ల్లో బంగ్లా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. బంగ్లా తరఫున అత్యధిక టీ20లు ఆడింది కూడా మహ్మదుల్లానే.