
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ పేసర్, యువ సంచలనం మయాంక్ యాదవ్ పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. గాయం నుంచి కోలుకున్న మయాంక్.. మంగళవారం(ఏప్రిల్ 15) లక్నో జట్టులోకి చేరనున్నట్లు తెలుస్తోంది.
బెంగుళూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (CoE) వైద్య బృందం మయాంక్‌కు ఆదివారం ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించింది. అందులో యాదవ్ ఉత్తీరణత సాధించాడు. దీంతో అతడికి ఐపీఎల్‌లో ఆడేందుకు క్లియరెన్స్ సర్టిఫికేట్‌ను సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ మంజారు చేసింది.
ఈ ఏడాది సీజన్‌లో లక్నో విజయాలు సాధిస్తున్నప్పటికి బౌలింగ్ మాత్రం అంతంత మాత్రమేగా ఉంది. ఇప్పుడు మయాంక్ తిరిగి రావడంతో లక్నో బౌలింగ్ విభాగం పటిష్టంగా మారనుంది. ఇక గతేడాది సీజన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్.. తన అద్భుతమైన ప్రదర్శనతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. అయితే తరుచుగా గాయాల బారిన పడడంతో మయాంక్ ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యాడు.
ఇప్పటివరకు ఐపీఎల్‌లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన యాదవ్.. 7 వికెట్లు పడగొట్టాడు. గాయాలతో సతమతవుతున్నప్పటికి లక్నో మాత్రం అతడిపై నమ్మకం ఉంచింది. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు రూ.11 కోట్లకు అతడిని లక్నో రిటైన్ చేసుకుంది. లక్నో తమ తదుపరి మ్యాచ్‌లో సోమవారం ఎక్నా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా మయాంక్ దూరం కానున్నాడు. ఏప్రిల్ 19న రాజస్తాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు.