జట్టుకు భారం!.. ధోని ఎప్పుడో రిటైర్‌ కావాల్సింది: పాక్‌ మాజీ క్రికెటర్‌ | He Should: Dhoni Sent Harsh Message By Pakistan Great Amid IPL 2025 Struggle | Sakshi
Sakshi News home page

జట్టుకు భారం!.. ధోని ఎప్పుడో రిటైర్‌ కావాల్సింది: పాక్‌ మాజీ క్రికెటర్‌

Published Mon, Apr 7 2025 12:48 PM | Last Updated on Mon, Apr 7 2025 1:35 PM

He Should: Dhoni Sent Harsh Message By Pakistan Great Amid IPL 2025 Struggle

మహేంద్ర సింగ్‌ ధోని (Photo Courtesy: BCCI/IPL)

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (MS Dhoni) ఆకట్టుకోలేకపోతున్నాడు. వికెట్‌ కీపర్‌గా తనదైన మెరుపు విన్యాసాలతో అలరిస్తున్నా.. బ్యాటర్‌గా మాత్రం విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరొందిన ‘తలా’.. ఇప్పుడు జట్టుకు భారంగా మారాడనే విమర్శలు వస్తున్నాయి.

క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి 76 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్‌రేటు 138.18. ఇక ఈ సీజన్‌లో తమ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచిన సీఎస్‌కే (CSK).. ఆ తర్వాత హ్యాట్రిక్‌ పరాజయాలు నమోదు చేసింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్తాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓడిపోయింది.

ఉన్న పేరు చెడగొట్టుకోవద్దు
ఈ నేపథ్యంలో ధోని ఇక రిటైర్‌ అయి.. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇందులో భాగంగా చెన్నై ఆటతీరును విమర్శించే క్రమంలో ధోని బ్యాటింగ్‌ వైఫల్యాన్ని హైలైట్‌ చేస్తూ పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ రషీద్‌ లతీఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోని చాన్నాళ్ల క్రితమే రిటైర్‌ కావాల్సిందని.. జిడ్డు బ్యాటింగ్‌ కారణంగా తన కీర్తికి తానే మచ్చ తెచ్చుకునే ప్రయత్నాలు మానివేయాలని సూచించాడు.

ఈ మేరకు IANSతో మాట్లాడుతూ.. ‘‘ధోని చాలా ఏళ్ల క్రితమే ఆటగాడిగా వీడ్కోలు తీసుకోవాల్సింది. సాధారణంగా వికెట్‌ కీపర్లు 35 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆటను కొనసాగించలేరు. అందుకు నేనే ఓ ఉదాహరణ.

సీఎస్‌కే ఇకనైనా గుర్తించాలి
వయసు మీద పడుతున్నా... ఇంకా టీవీల్లో కనిపిస్తూ.. నా ప్రదర్శన బాగా లేదనేలా విమర్శలు వస్తూ ఉంటే.. నా గత కీర్తి మసకబారిపోతుంద కదా! పదిహేనేళ్ల పాటు గొప్ప ఆటగాడిగా నీరాజనాలు అందుకున్నా .. ఇప్పుడిలా పేలవ ప్రదర్శన కనబరిస్తే యువ తరానికి అంతగా రుచించదు.

నిజానికి 2019 వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో అతడి ఆట జట్టుకు ఏమాత్రం మేలు చేకూర్చలేదు. అప్పుడే వాళ్లు (టీమిండియా యాజమాన్యం అన్న అర్థంలో), అతడు పరిస్థితిని అంచనా వేసుకున్నారు. తర్వాత అతడు తప్పుకొన్నాడు.

ఏదేమైనా జట్టు కంటే ఆటగాడికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే మాత్రం ఆటకు మీరు అన్యాయం చేసినట్లే. అందుకే సీఎస్‌కేను అందరూ ట్రోల్‌ చేస్తున్నారు. గత 2-3 మ్యాచ్‌లలో ధోని రాగానే ప్రేక్షకుల నుంచి పెద్దగా అరుపులు వినిపించాయి.

 

కానీ సీఎస్‌కేకు ఇప్పుడు విజయాలు, పాయింట్లు కావాలి. ప్రస్తుతం వారు పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానం కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికైనా జట్టు ప్రయోజనాల గురించి ఆలోచించి.. సరైన నిర్ణయం తీసుకోవాలి’’ అని రషీత్‌ లతీఫ్‌ చెన్నై జట్టు యాజమాన్యానికి సూచించాడు.

ఆడుతూనే ఉంటాడు..
కాగా ఢిల్లీ చేతిలో ఓటమి తర్వాత ధోని రిటైర్మెంట్‌ గురించి ప్రశ్న ఎదురుకాగా... ‘‘అతడితో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదిస్తున్నా.. ఈ విషయంలో నాకు ఎలాంటి సమాచారం లేదు.

ఇప్పటికీ అతడు ఫిట్‌గానే ఉన్నాడు’’ అని సీఎస్‌కే హెడ్‌కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ అన్నాడు. మరోవైపు.. ధోని కూడా తన శరీరమే తన రిటైర్మెంట్‌ అంశాన్ని నిర్ణయిస్తుందంటూ.. ఇప్పట్లో వీడ్కోలు పలికే అవకాశం లేదని స్పష్టం చేశాడు.

చదవండి: ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. అసలేం చేస్తున్నారు? కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement