
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్ 6) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి సీజన్‌లో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. తద్వారా పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైన సన్‌రైజర్స్ వరుసగా నాలుగో ఓటమిని మూటగట్టుకుని పాయింట్ల పట్టికలో చిట్ట చివరి స్థానానికి పడిపోయింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. లోకల్ బాయ్ సిరాజ్ (4-0-17-4) చెలరేగడంతో అతి కష్టం మీద 152 పరుగులు చేయగలిగింది. సిరాజ్‌తో పాటు ప్రసిద్ద్ కృష్ణ (4-0-25-2), సాయి కిషోర్ (4-0-24-2) కూడా సత్తా చాటడంతో సన్‌రైజర్స్ ఒక్కో పరుగు చేసేందుకు కూడా చాలా ఇబ్బంది పడింది.
సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ శర్మ 18, ట్రవిస్ హెడ్ 8, ఇషాన్ కిషన్ 17, నితీశ్ రెడ్డి 31, క్లాసెన్ 27, అనికేత్ వర్మ 18, కమిందు 1, సిమర్‌జీత్ డకౌటయ్యారు. ఆఖర్లో కమిన్స్ (9 బంతుల్లో 22 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో సన్‌రైజర్స్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ కూడా ఆదిలో తడబడింది. పవర్ ప్లేలోనే ఆ జట్టు ఇన్ ఫామ్ బ్యాటర్లు సాయి సుదర్శన్ (5), జోస్ బట్లర్ (0) వికెట్లు కోల్పోయింది. అయితే శుభ్‌మన్ గిల్ (43 బంతుల్లో 61 నాటౌట్; 9 ఫోర్లు).. వాషింగ్టన్ సుందర్ (29 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (16 బంతుల్లో 35 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) సహకారంతో గుజరాత్‌ను మరో 20 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేర్చాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో షమీ 2, కమిన్స్ ఓ వికెట్ తీశారు.
మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. టీ20 ఫార్మాట్‌లో బౌలర్లే గేమ్ ఛేంజర్లు. చాలా మంది భారీ హిట్టర్ల గురించి మాట్లాడుకుంటారు కానీ, బౌలర్లే మ్యాచ్‌లు గెలిపిస్తారు. నేటి మ్యాచ్‌లో మేము మైదానం అంతటా షాట్లు ఆడాలనుకున్నాము. అదే నేను, సుందర్ డిస్కస్ చేసుకున్నాము.
సుందర్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే బరిలోకి దిగి ఉండాల్సింది. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ నియమం వల్ల ప్రణాళికలు మార్చుకోవాల్సి వచ్చింది. ఈ రోజు అతను బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది. మేము మంచి క్రికెటింగ్ షాట్లు ఆడాలనుకున్నాము.
ఓసారి 30-40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పితే, అదే మనల్ని ఆటలోకి తీసుకెళ్తుంది. బౌలింగ్, ఫీల్డింగ్ సమయంలో సిరాజ్ ఇచ్చే ఊపు అంటువ్యాధి లాంటిది. అది జట్టు మొత్తానికి పాకుతుంది. ఫీల్డ్‌లో అతనిలోని ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ రోజు అతను బౌలింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉంది.