
Photo Courtesy: BCCI
భారత టీ20 జట్టు కెప్టెన్, ముంబై ఇండియన్స్ విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర పుటల్లోకెక్కాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, సురేశ్ రైనా తర్వాత టీ20ల్లో 8000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (మార్చి 31) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన అనంతరం స్కై ఈ ఘనత సాధించాడు. నిన్నటి మ్యాచ్‌తో కలుపుకుని సూర్య ఇప్పటివరకు టీ20ల్లో (అంతర్జాతీయ మ్యాచ్‌లు, దేశవాలీ, ఐపీఎల్) 8007 పరుగులు చేశాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా చలామణి అవుతున్న విరాట్ ఖాతాలో 12976 పరుగులు ఉన్నాయి.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు
విరాట్ కోహ్లి- 12976
రోహిత్ శర్మ- 11851
శిఖర్ ధవన్- 9797
సురేశ్ రైనా- 8654
సూర్యకుమార్ యాదవ్- 8007
మ్యాచ్ విషయానికొస్తే.. కేకేఆర్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సూర్య 9 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 27 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కేకేఆర్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో రెండు వరుస పరాజయాల తర్వాత ముంబై సాధించిన తొలి విజయం ఇది. ముంబై గెలుపులో సూర్య తనవంతు పాత్ర పోషించాడు.
కేకేఆర్ నిర్దేశించిన 117 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో స్కై తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులిపించాడు. ఈ సీజన్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి కేకేఆర్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.
అంతకుముందు అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ (3-0-24-4) చెలరేగడంతో కేకేఆర్ 116 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా రాణించారు.
కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ చేసిన 26 పరుగులే (16 బంతుల్లో) అత్యధికం. ఆఖర్లో రమణ్‌దీప్ (12 బంతుల్లో 22) బ్యాట్ ఝులిపించడంతో కేకేఆర్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది.
కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ, రమణ్‌దీప్‌తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్‌లో (రాజస్థాన్) ఒంటిచేత్తో కేకేఆర్‌ను గెలిపించిన డికాక్ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. సునీల్ నరైన్ డకౌటయ్యాడు. కోట్టు పెట్టి కొన్న వెంకటేశ్ అయ్యర్ (3) తుస్సుమనిపించాడు. విధ్వంసకర వీరుడు రసెల్ (11 బంతుల్లో 5) విఫలమయ్యాడు.