
కోల్‌కతా జట్టుపై 8 వికెట్లతో ఘనవిజయం
అరంగేట్రంలో అదరగొట్టిన అశ్వని కుమార్
4 వికెట్లతో మెరిసిన ముంబై పేసర్ రికెల్టన్ అజేయ అర్ధసెంచరీ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ జట్టు 18వ సీజన్‌లో గెలుపు బోణీ కొట్టింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో సోమవారం వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఎడంచేతి వాటం యువ పేస్ బౌలర్ అశ్వని కుమార్ ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లో చిరస్మరణీయ ప్రదర్శనతో అదరగొట్టాడు.
పంజాబ్‌కు చెందిన అశ్వని తన ప్రతిభతో ముంబై జట్టుకు ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందించాడు. ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 16.2 ఓవర్లలో కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. 23 ఏళ్ల అశ్వని 3 ఓవర్లలో 24 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. కోల్‌కతాను తక్కువ స్కోరుకే కట్టడి చేశాడు. అనంతరం ముంబై ఇండియన్స్ జట్టు ఆద్యంతం దూకుడుగా ఆడింది.
కేవలం 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసి నెగ్గింది. ఓపెనర్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్ ఆటతీరుతో అజేయ అర్ధ సెంచరీ సాధించాడు. ముంబై గెలుపుతో ప్రస్తుత సీజన్‌లో మొత్తం 10 జట్లూ పాయింట్ల ఖాతా తెరిచినట్టయింది. ఐపీఎల్ అరంగేట్రం మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి భారతీయ బౌలర్‌గా ఘనత వహించిన అశ్వని కుమార్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
తడబడుతూనే...
కోల్‌కతాకు శుభారంభం లభించలేదు. తొలి ఓవర్లో నరైన్ (0)ను బౌల్ట్ డకౌట్ చేయగా... రెండో ఓవర్లో డికాక్ (1)ను దీపక్ చహర్ పెవిలియన్‌కు పంపించాడు. మూడో ఓవర్లో అశ్వని తాను వేసిన తొలి బంతికే కెప్టెన్ రహానేను అవుట్ చేశాడు. అశ్వని వేసిన వైడ్ బంతిని రహానే వేటాడి భారీ షాట్ ఆడగా... డీప్ మిడ్‌వికెట్ వద్ద తిలక్ వర్మ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దాంతో కోల్‌కతా 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కోల్‌కతాను ఆదుకుంటాడని భావించి వెంకటేశ్ అయ్యర్ (3) మళ్లీ నిరాశపరచగా... క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడిన రఘువంశీ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) పాండ్యా బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
దాంతో 7 ఓవర్లు ముగిసేసరికి కోల్‌కతా సగంజట్టు పెవిలియన్ చేరింది. ఈ దశలో ఆరో వికెట్‌కు 29 పరుగులు జోడించి... క్రీజులో నిలదొక్కుకున్నట్లు కనిపించిన రింకూ సింగ్ (14 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్), మనీశ్ పాండే (14 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్)లను అశ్వని ఒకే ఓవర్లో అవుట్ చేయడంతో కోల్‌కతా కోలుకోలేకపోయింది. చివరి ఆశాకిరణం రసెల్ (5)ను అశ్వని 13వ ఓవర్లో బౌల్డ్ చేయడంతో కోల్‌కతా స్కోరు 100 దాటుతుందా లేదా అనుమానం కలిగింది. అయితే రమణ్‌దీప్ సింగ్ (12 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) పుణ్యమాని కోల్‌కతా స్కోరు వంద దాటింది. 17వ ఓవర్లో చివరి వికెట్‌గా రమణ్‌దీప్ వెనుదిరగడంతో కోల్‌కతా ఇన్నింగ్స్ ముగిసింది.
రోహిత్ విఫలం
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు ఓపెనర్లు రికెల్టన్, రోహిత్ శర్మ (12 బంతుల్లో 13; 1 సిక్స్) తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించి శుభారంభం అందించారు. అయితే ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. రోహిత్ అవుటైనా మరోవైపు రికెల్టన్ తన ధాటిని కొనసాగించడంతో ముంబైకు ఏ దశలోనూ ఇబ్బంది కాలేదు. విల్ జాక్స్ (17 బంతుల్లో 16; 1 సిక్స్)తో రికెల్టన్ రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించాడు. జాక్స్ అవుటయ్యాక వచ్చిన సూర్యకుమార్ (9 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో 13వ ఓవర్లోనే ముంబైను లక్ష్యానికి చేర్చాడు.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: క్వింటన్ డికాక్ (సి) అశ్వని కుమార్ (బి) దీపక్ చహర్ 1; సునీల్ నరైన్ (బి) బౌల్ట్ 0; అజింక్య రహానే (సి) తిలక్ వర్మ (బి) అశ్వని కుమార్ 11; అంగ్‌క్రిష్ రఘువంశీ (సి) నమన్ ధీర్ (బి) హార్దిక్ పాండ్యా 26; వెంకటేశ్ అయ్యర్ (సి) రికెల్టన్ (బి) దీపక్ చహర్ 3; రింకూ సింగ్ (సి) నమన్ ధీర్ (బి) అశ్వని కుమార్ 17; మనీశ్ పాండే (బి) అశ్వని కుమార్ 19; ఆండ్రీ రసెల్ (బి) అశ్వని కుమార్ 5; రమణ్‌దీప్ సింగ్ (సి) హార్దిక్ పాండ్యా (బి) సాంట్నెర్ 22; హర్షిత్ రాణా (సి) నమన్ ధీర్ (బి) విఘ్నేశ్ 4; స్పెన్సర్ జాన్సన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (16.2 ఓవర్లలో ఆలౌట్) 116.
వికెట్ల పతనం: 1–1, 2–2, 3–25, 4–41, 5–45, 6–74, 7–80, 8–88, 9–99, 10–116.
బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–0–23–1, దీపక్ చహర్ 2–0–19–2, అశ్వని కుమార్ 3–0–24–4, హార్దిక్ పాండ్యా 2–0–10–1, విఘ్నేశ్ పుథుర్ 2–0–21–1, మిచెల్ సాంట్నెర్ 3.2–0–17–1.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) హర్షిత్ రాణా (బి) రసెల్ 13; రికెల్టన్ (నాటౌట్) 62; విల్ జాక్స్ (సి) రహానే (బి) రసెల్ 16; సూర్యకుమార్ యాదవ్ (నాటౌట్) 27; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (12.5 ఓవర్లలో 2 వికెట్లకు) 121.
వికెట్ల పతనం: 1–46, 2–91.
బౌలింగ్: స్పెన్సర్ జాన్సన్ 2–0–14–0, హర్షిత్ రాణా 2–0–28–0, వరుణ్ చక్రవర్తి 3–0–12–0, రసెల్ 2.5–0–35–2, సునీల్ నరైన్ 3–0–32–0.