
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా నిన్న (మార్చి 31) కేకేఆర్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది తొలి విజయం. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ అద్భుత ప్రదర్శన చేశాడు. 3 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు పడగొట్టాడు.
అశ్వనీ విజృంభణకు తోడు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) కూడా రాణించడంతో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై కేకేఆర్‌ను 116 పరుగులకే కుప్పకూల్చింది. కేకేఆర్ బ్యాటర్లు అశ్వనీ కుమార్ సహా మిగతా ముంబై బౌలర్లను ఎదుర్కొనేందుకు ఆపసోపాలు పడ్డారు. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేకపోయారు. రఘువంశీ చేసిన 26 పరుగులే (16 బంతుల్లో) అత్యధికం.
ఆఖర్లో రమణ్‌దీప్ (12 బంతుల్లో 22) బ్యాట్ ఝులిపించడంతో కేకేఆర్ అతి కష్టం మీద 100 పరుగుల మార్కును దాటింది. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ, రమణ్‌దీప్‌తో పాటు మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్‌లో (రాజస్థాన్) సత్తా చాటిన డికాక్ ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు. సునీల్ నరైన్ డకౌటయ్యాడు. కోట్టు పెట్టి కొన్న వెంకటేశ్ అయ్యర్ (3) తుస్సుమనిపించాడు. విధ్వంసకర వీరుడు రసెల్ (11 బంతుల్లో 5) విఫలమయ్యాడు.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. ఆడుతూపాడుతూ విజయం సాధించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో సత్తా చాటాడు. సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) తన సహజ శైలిలో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ (12 బంతుల్లో 13) పేలవ ప్రదర్శన కొనసాగగా.. విల్ జాక్స్ (17 బంతుల్లో 16) నిరాశపరిచాడు. ముంబై 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.
కాగా, ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన కేకేఆర్ బ్యాటర్లపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రూ. 23.75 కోట్ల భారీ మొత్తం పెట్టి కొన్న వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ అభిమానులే టార్గెట్ చేస్తున్నారు. ఫ్రాంచైజీ నమ్మకాన్ని వమ్ము చేశాడని కామెంట్లు చేస్తున్నారు. భారీ మొత్తం పెట్టి కొనుగోలు చేయడంతో వైస్ కెప్టెన్సీ అప్పగిస్తే ఇదేనా నువ్వు చేసేదంటూ మండిపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో9 బంతులు ఎదుర్కొన్న అయ్యర్ కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లోనూ అయ్యర్ విఫలమయ్యాడు. ఆర్సీబీపై కేవలం 6 పరుగులు (7 బంతుల్లో) మాత్రమే చేశాడు. ఆల్‌రౌండర్‌గా పని కొనస్తాడనుకుంటే అస్సలు బౌలింగే చేయడం లేదు. పైగా ఈ సీజన్‌కు ముందు కెప్టెన్సీ కూడా కావాలని మారాని చేశాడు. చెత్త ప్రదర్శనలతో అయ్యర్ ప్రస్తుతం కేకేఆర్ అభిమానులకు టార్గెట్‌గా మారాడు. నీ కంటే కొత్తగా వచ్చిన కుర్రాళ్లు అనికేత్ వర్మ (సన్‌రైజర్స్), విప్రాజ్ నిగమ్ (ఢిల్లీ) చాలా మేలని కామెంట్లు చేస్తున్నారు. నీపై పెట్టిన పెట్టుబడి దండగ అని అంటున్నారు. ఇంత దానికి కెప్టెన్సీ కూడా కావాలా అని ప్రశ్నిస్తున్నారు.
పనిలో పనిగా రింకూ సింగ్, ఆండ్రీ రసెల్‌ను కూడా ఏకి పారేస్తున్నారు. వీరిపై పెట్టిన పెట్టుబడి కూడా బూడిదలో పోసిన పన్నీరే అని అంటున్నారు. ఈ సీజన్‌కు ముందు రింకూను 13 కోట్లకు, రసెల్‌ను 12 కోట్లకు కేకేఆర్ రీటైన్ చేసుకున్న విషయం తెలిసిందే. అయ్యర్ ఐపీఎల్ చరిత్రలోనే నాలుగో కాస్ట్లీ ప్లేయర్ అన్న విషయం కూడా తెలిసిందే. మొత్తంగా తొలి 3 మ్యాచ్‌ల్లో రెండింట పరాజయాలు ఎదుర్కోవడంతో కేకేఆర్ అభిమానులు డిఫెండింగ్ ఛాంపియన్స్ అని చెప్పుకునేందుకు కూడా సిగ్గు పడుతున్నారు.