ఐపీఎల్ ఫ్రాంచైజీలు అక్టోబర్ 31న తాము రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఈ జాబితాలో చాలామంది స్టార్ ఆటగాళ్ల పేర్లు మిస్ అయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ రింకూ సింగ్ (రూ. 13 కోట్లు), వరుణ్ చక్రవర్తి (రూ. 12 కోట్లు), సునీల్ నరైన్ (రూ. 12 కోట్లు), ఆండ్రీ రసెల్ (రూ. 12 కోట్లు), హర్షిత్ రాణా (రూ. 4 కోట్లు), రమన్‌దీప్ సింగ్‌ను (రూ. 4 కోట్లు) అట్టిపెట్టుకుని.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సహా మిగతా ఆటగాళ్లనంతా వేలానికి వదిలేసింది.
కేకేఆర్ రిటైన్ చేసుకున్న జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మిచెల్ స్టార్క్, వెంకటేశ్ అయ్యర్ లాంటి ఆటగాళ్లు మనసు నొచ్చుకున్నారు. వెంకటేశ్ అయ్యర్ తన మనసులోని మాటను సోషల్‌మీడియాలో షేర్ చేసుకున్నాడు. కేకేఆర్ వదిలిపెట్టిన తర్వాత జరుగుతున్న తొలి రంజీ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ తన ప్రతాపాన్ని చూపాడు. రంజీల్లో మధ్యప్రదేశ్‌కు ఆడే వెంకటేశ్ అయ్యర్.. బీహార్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 113 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
కేకేఆర్ తనను వదిలేసిందన్న కోపమో ఏమో కానీ ఈ మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ చాలా పట్టుదలగా ఆడి సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు కూడా సవాలు విసిరాడు. తానెంత విలువైన ఆటగాడినో అన్న విషయాన్ని వెంకటేశ్ అయ్యర్ ఫ్రాంచైజీలకు తెలియజేశాడు.
మరోవైపు కేకేఆర్ వదిలేసిన మరో అయ్యర్ కూడా ఇవాళ శతకొట్టాడు. కేకేఆర్ మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో 164 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 152 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో శ్రేయస్‌కు ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. తాజా ప్రదర్శనల నేపథ్యంలో ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రేయస్‌కు మాంచి గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment