
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ తమ జోరును కొనసాగిస్తోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఎక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్(44) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆయూష్ బదోని(41), అబ్దుల్ సమద్(27), మార్క్రామ్(28) పరుగులతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, మాక్స్‌వెల్, చాహల్ తలా వికెట్ సాధించారు.
ఫ్రబ్‌సిమ్రాన్ విధ్వంసం..
అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ జట్టు కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 16.2 ఓవర్లలో చేధించింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభుసిమ్రాన్ సింగ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ వదేరా(25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 43 నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(52 నాటౌట్) దుమ్ములేపారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లందరూ దారుణంగా విఫలమయ్యారు.
రిషబ్ పంత్ ఫెయిల్..
ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గా పంత్ నిరాశపరిచాడు. తొలుత బ్యాటింగ్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్‌గా వ్యూహత్మకంగా వ్యవహరించలేకపోయాడు.