
టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ(Mohammed Shami) పూర్తి ఫిట్‌నెస్‌తోనే ఉన్నాడని భారత బ్యాటింగ్ కొత్త కోచ్ సితాన్షు కొటక్(Sitanshu Kotak) వెల్లడించాడు. అయితే, ఇంగ్లండ్‌తో మూడో టీ20లో అతడు ఆడతాడా? లేదా? అన్న అంశంపై మాత్రం స్పష్టతనివ్వలేదు.
కాగా ఏడాది తర్వాత.. ఇంగ్లండ్‌తో స్వదేశంలో పరిమిత ఓవర్ల సిరీస్ సందర్భంగా షమీ తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. అయితే, బట్లర్ బృందంతో తొలి రెండు టీ20లో మాత్రం అతడికి భారత తుదిజట్టులో చోటు దక్కలేదు.
ఈ నేపథ్యంలో షమీ ఫిట్‌నెస్‌పై మరోసారి ఊహాగానాలు వచ్చాయి. జట్టు ప్రయోజనాల దృష్ట్యా మేనేజ్‌మెంట్ అతడిని పక్కనపెడుతోందని కొంతమంది భావిస్తుండగా.. చాంపియన్స్ ట్రోఫీకి ముందు షమీపై అదనపు భారం పడకుండా చూస్తున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
తుది నిర్ణయం వాళ్లదే
ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందిస్తూ.. షమీకి ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలు లేవన్నాడు. అతడు వందశాతం మ్యాచ్ ఫిట్‌నెస్‌తో ఉన్నాడని అయితే తుదిజట్టులో ఆడించే అంశంపై కెప్టెన్ సూర్యకుమార్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లే నిర్ణయం తీసుకుంటారని చెప్పాడు.
కాగా.. 2023 నవంబర్‌లో సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత షమీ మళ్లీ టీమిండియా తరఫున ఆడలేకపోయాడు. కొన్నాళ్లు విశ్రాంతి, ఇంకొన్నాళ్లు గాయాలతో సతమతమైన 34 ఏళ్ల వెటరన్ బెంగాల్ సీమర్‌ను తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌కు ఎంపికచేశారు.
దీంతో 15 నెలల తర్వాత జట్టులో చోటు దక్కింది కానీ ఆడేందుకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో కోల్‌కతా టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందిన టీమిండియా.. చెన్నై మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇరుజట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా మంగళవారం మూడో టీ20 జరుగుతుంది.
రోహిత్, కోహ్లిలకోసం ప్రత్యేకంగా ఏమైనా..?
ఇటీవలి కాలంలో టెస్టుల్లో వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లి(Virat Kohli) గురించి విలేకరులు సితాన్షు కొటక్ వద్ద ప్రస్తావన తీసుకువచ్చారు. బ్యాటింగ్ కోచ్‌గా వారికోసం ఏవైనా ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నారా అని అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘రోహిత్, విరాట్ చాలా సీనియర్ ఆటగాళ్లు.
అయినా.. ఈరోజుల్లో ప్రతి ఒక్క ఆటగాడు తన ఆట గురించి తానే అంచనా వేసుకోగలుగుతున్నాడు. ఇతరులతో తన ప్రణాళికల గురించి పంచుకుంటూ ..లోపాల్ని సరిచేసుకుంటున్నారు. అలాంటి వారికి మనవంతుగా ఏమైనా సలహాలు, సూచనలు ఇవ్వగలగడం గొప్ప విషయమే.
సలహాలిస్తే తీసుకోవాలి కదా!
నిజంగా నా సలహాల వల్ల రోహిత్, కోహ్లిల ఆట కనీసం రెండు నుంచి ఐదు శాతం మెరుగుపడినా అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అయినా వాళ్లిద్దరు ఇప్పటికే ఎన్నో గొప్ప ప్రదర్శనలు ఇచ్చారు. అయినా సరే నా నుంచి కొత్తగా ఏదైనా నేర్చుకోవాలంటే.. అందుకు వారు సిద్ధంగా ఉండాలి. తద్వారా ఎప్పటికపుడు ఆటను మెరుగుపరచుకోవచ్చు’’ అని సితాన్షు కొటక్ వెల్లడించాడు.
కాగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ పూర్తిగా విఫలం కాగా.. విరాట్ కోహ్లి కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రోహిత్ ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి 31 పరుగులే చేశాడు.
ఇక కోహ్లి పదకొండు ఇన్నింగ్స్ ఆడి 191 పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కంగారూ జట్టుకు కోల్పోయింది. ఇందుకు ప్రధాన కారణం ‘విరాహిత్’ ద్వయం వైఫల్యమేనని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఇద్దరూ రంజీ బరిలోకి వచ్చారు.
చదవండి: U19 T20 WC 2025: భారత్‌తో పాటు సెమీస్ చేరిన జట్లు ఇవే.. షెడ్యూల్ వివరాలు