
చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy) విజేతగా నిలవడంతో టీమిండియా ఐసీసీ టైటిళ్ల సంఖ్య ఏడుకు చేరింది. భారత్ తొలిసారి 1983లో ప్రపంచకప్‌ను ముద్దాడింది. నాటి వన్డే వరల్డ్‌కప్ టోర్నమెంట్లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన కపిల్ సేన ఏకంగా చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. పటిష్ట వెస్టిండీస్ జట్టును ఓడించి వరల్డ్‌కప్ విజేతగా నిలిచింది.
ఫలితంగా టీమిండియాకు మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ అందించిన సారథిగా కపిల్ దేవ్(Kapil Dev).. భారత క్రికెట్ చరిత్రలో తన పేరును అజరామరం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత దాదాపు రెండు దశాబ్దాలకు పైగా భారత జట్టుకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా దక్కలేదు. అయితే, మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) ఆ లోటును తీర్చేశాడు.
ధోని ఖాతాలో ముచ్చటగా మూడు
అంతర్జాతీయ క్రికెట్ మండలి 2007లో తొలిసారిగా ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ను టీమిండియాకు అందించాడు. అనంతరం 2011లో వన్డే వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌గానూ ధోని నిలిచాడు. అంతేనా.. 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ను విజేతగా నిలిపి.. అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన భారత కెప్టెన్‌గా ఇప్పటికీ కొనసాగుతున్నాడు.
రోహిత్ ‘డబుల్’ హ్యాపీ
ఇక తాజాగా రోహిత్ శర్మ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచి రెండో ఐసీసీ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన హిట్‌మ్యాన్.. తాజా ఈ వన్డే టోర్నమెంట్లోనూ జట్టును అజేయంగా ముందుకు నడిపి ట్రోఫీని ముద్దాడాడు. తద్వారా ధోని తర్వాత అత్యధిక సార్లు టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌గా నిలిచాడు ఈ వన్డే ‘ట్రిపుల్’ డబుల్ సెంచరీల వీరుడు.
మరి కపిల్ దేవ్, ధోని, రోహిత్ శర్మ.. కెప్టెన్లుగా ఈ ఘనతలు సాధించారంటే అందుకు అప్పటి జట్లలో ఉన్న ఆటగాళ్లది కూడా కీలక పాత్ర. 1983లో ఆల్‌రౌండర్ మొహిందర్ అమర్నాథ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి జట్టును ఫైనల్‌కు చేర్చాడు.
ఇక 2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లిలు కూడా అద్భుతంగా ఆడారు. హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ తమ వంతు పాత్ర పోషించగా.. తాజా చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్, కోహ్లిలతో పాటు రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ కూడా రాణించారు.
బుమ్రాకు దక్కని చోటు
ఈ నేపథ్యంలో తన ఆల్‌టైమ్ వన్డే తుదిజట్లులో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ వీరందరికి చోటివ్వడం గమనార్హం. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత చిన్నపిల్లాడిలా గంతులేసిన ఈ మాజీ సారథి... తాజాగా తన వన్డే బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ను పంచుకున్నాడు.
ఈ జట్టులో క్రికెట్ దేవుడ్, వంద శతకాల వీరుడు సచిన్ టెండుల్కర్‌కు ఓపెనర్‌గా గావస్కర్ చోటిచ్చాడు. అయితే, ఈ జట్టుకు టీమిండియా ప్రధాన పేసర్, ప్రపంచస్థాయి ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మాత్రం గావ స్కర్ ఎంపిక చేయలేదు.
సునిల్ గావస్కర్ ఆల్‌టైమ్ వన్డే ఎలెవన్:
సచిన్ టెండుల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మొహిందర్ అమర్నాథ్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), కపిల్ దేవ్, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, మహ్మద్ షమీ, జహీర్ ఖాన్.
భారత్ గెలిచిన ఐసీసీ టైటిళ్లు ఇవే
1983- వన్డే వరల్డ్‌కప్
2002- చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా
2007- టీ20 ప్రపంచకప్
2011- వన్డే వరల్డ్‌కప్
2013- చాంపియన్స్ ట్రోఫీ
2024- టీ20 ప్రపంచకప్
2025- చాంపియన్స్ ట్రోఫీ.
చదవండి: Team of the Tourney 2025: జట్టును ప్రకటించిన ఐసీసీ.. రోహిత్‌కు దక్కని చోటు