
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) గురించి భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీ.. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) బాటలో నడుస్తున్నాడా? లేదా? అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నాడు. ద్రవిడ్ మాదిరి గౌతీకి పెద్ద మనసు ఉందో లేదో తెలియడం లేదంటూ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఇంతకీ విషయం ఏమిటంటే....
భారత జట్టు ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)గెలుచుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా వన్డే టోర్నీలో రోహిత్ సేన.. తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడింది.
రూ. 58 కోట్ల క్యాష్ రికార్డు
గ్రూప్ దశలో మూడింటికి మూడు గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా.. కీలక పోరులో ఆస్ట్రేలియాను ఓడించింది. అనంతరం టైటిల్ పోరులో న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ట్రోఫీని ముద్దాడింది.
తద్వారా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో రెండో ఐసీసీ టైటిల్ చేరగా.. భారత్‌కు పుష్కర కాలం తర్వాత చాంపియన్స్ ట్రోఫీ దక్కింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) టీమిండియాకు భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. రూ. 58 కోట్ల క్యాష్ రికార్డు ఇవ్వనున్నట్లు మార్చి 20న పత్రికా ప్రకటన విడుదల చేసింది.
గంభీర్‌కు రూ. 3 కోట్లు
ఈ మొత్తంలో చాంపియన్స్ ట్రోఫీ జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 3 కోట్ల చొప్పున.. అదే విధంగా హెడ్‌కోచ్ గంభీర్‌కు రూ. 3 కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. సహాయక కోచ్‌లు, మిగతా సిబ్బందికి రూ. 50 లక్షల నగదు బహుమానం అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ విషయంపై సునిల్ గావస్కర్ తాజాగా తనదైన శైలిలో స్పందించాడు. ద్రవిడ్‌తో గంభీర్‌ను పోలుస్తూ స్పోర్ట్స్‌స్టార్‌కు రాసిన కాలమ్‌లో వింత వ్యాఖ్యలు చేశాడు. ‘‘టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత బీసీసీఐ భారీ స్థాయిలో ప్రైజ్‌మనీ ప్రకటించింది. అప్పటి హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఆటగాళ్లతో సమానంగా బహుమతి ఇవ్వాలని భావించింది.
ద్రవిడ్ గొప్పోడు.. గంభీర్ మాత్రం స్పందించడం లేదు
కానీ అతడు అందుకు అంగీకరించలేదు. సహాయక కోచ్‌లతో పాటూ తానూ సమానమేనని.. వారికి ఇచ్చినంతే తనకూ ఇవ్వాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాడు. లేదంటే.. తనకు దక్కిన మొత్తాన్ని సహచర కోచ్‌లతో పంచుకుంటానని చెప్పాడు. చెప్పిందే చేశాడు కూడా!
ఇక చాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలిచిన నేపథ్యంలో బీసీసీఐ క్యాష్ రివార్డు ప్రకటించి.. రోజులు గడుస్తున్నాయి. అయినా.. ఇప్పటి వరకు ప్రస్తుత హెడ్‌కోచ్ నుంచి ప్రైజ్‌మనీ తీసుకునే విషయంలో ఎలాంటి ప్రకటనా రాలేదు.
అతడు ద్రవిడ్ మాదిరి కోచ్‌లందరితో సమానంగా నగదు తీసుకుంటాడా? లేదా? లేదంటే.. ద్రవిడ్ ఓ మంచి రోల్ మోడల్ కాదంటారా?!’’ అని గావస్కర్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
శుభపరిణామం
అదే విధంగా.. బీసీసీఐ జట్టుకు ఈ మేర భారీ ప్రోత్సాహకాలు అందించడం గొప్ప విషమమని గావస్కర్ బోర్డును ప్రశంసించాడు. ‘‘ఐసీసీ టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు బీసీసీఐ రూ. 125 కోట్ల మేర భారీ రివార్డు ప్రకటించింది. సెలక్టర్లు, సహాయక సిబ్బందికి కూడా తగిన రీతిలో బహుమానం అందజేసింది.
ఇక ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ గెలిచినందుకు రూ. 58 కోట్లు ఇవ్వడం శుభపరిణామం. ఈసారి కూడా సెలక్షన్ కమిటీ, సహాయక సిబ్బందిని దృష్టిలో పెట్టుకుంది. నిజంగా ఇది గొప్ప విషయం. అంతేకాదు.. ఐసీసీ ప్రకటించిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని కూడా ఆటగాళ్లకే పంచడం.. వారికి తగిన రీతిలో ప్రోత్సాహకాలు అందించడం సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది’’ అని గావస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: 4 ఓవర్లలో 76 రన్స్ ఇచ్చాడు.. జట్టులో అవసరమా?: భారత మాజీ క్రికెటర్