
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లో టీమిండియా ఎదురులేని విజయాలతో ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్ దశలో టాపర్‌గా నిలవడంతో పాటు సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
దుబాయ్ వేదికగా ఆదివారం న్యూజిలాండ్(India vs New Zealand)తో మ్యాచ్‌లో రోహిత్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఇక ఈ మెగా వన్డే టోర్నమెంట్ తర్వాత టీమిండియాలో కీలక మార్పు చోటుచేసుకోనున్నట్లు సమాచారం.
రోహిత్ శర్మ(Rohit Sharma) భారత వన్డే, టెస్టు జట్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలికి కేవలం ఆటగాడిగా కొనసాగనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ అంశం గురించి ఇప్పటికే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం.
అది రోహిత్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది
ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర పరాజయం తర్వాత జరిగిన ఈ సమీక్షలో రోహిత్ భవిష్యత్తు గురించి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సన్నిహిత వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా మిగిలే ఉందని రోహిత్ విశ్వసిస్తున్నాడు.
అయితే, తన భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్న అంశం గురించి యాజమాన్యం అతడిని అడిగింది. రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేదా అన్నది పూర్తిగా అతడి నిర్ణయమే.
అయితే, కెప్టెన్సీ విషయంలో మాత్రం మేనేజ్‌మెంట్ మార్పు వైపు మొగ్గుచూపుతున్నట్లు అనిపిస్తోంది. వచ్చే వరల్డ్‌కప్ నాటికి జట్టును సిద్ధం చేసుకోవాలని దిగ్గజ కెప్టెన్ రోహిత్‌కూ తెలుసు. ఇదే విషయం గురించి కోచ్, చీఫ్ సెలక్టర్ అతడితో మాట్లాడారు.
కోహ్లి గురించి కూడా చర్చ.. కానీ
ఇక విరాట్ కోహ్లి గురించి చర్చకురాగా.. మేనేజ్‌మెంట్ కూడా అతడితో మాట్లాడినట్లు తెలిసింది. అయితే, అతడి భవిష్యత్తుకు ఇప్పట్లో ఢోకా లేనట్లే అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాయి. కాగా ద్వైపాక్షిక సిరీస్‌లలో టీమిండియాకు తిరుగులేని విజయాలు అందించడంతో పాటు ఐసీసీ టోర్నీల్లోనూ గొప్పగా రాణించిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరొందాడు.
ఏకైక సారథిగా అరుదైన ఘనత
గతేడాది అతడి కెప్టెన్సీలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024లో చాంపియన్‌గా నిలిచింది. అనంతరం అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రోహిత్ వీడ్కోలు పలకగా.. విరాట్ కోహ్లి కూడా అతడి బాటలో నడిచాడు. ప్రస్తుతం ఈ దిగ్గజ బ్యాటర్లు వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్నారు. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్‌లో శతకం బాది రోహిత్.. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌పై సెంచరీ కొట్టి కోహ్లి వన్డేల్లో ఫామ్‌లోకి వచ్చారు.
అయితే, టెస్టుల్లో మాత్రం వారి వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఫైనల్‌కు చేర్చడం ద్వారా ఇంత వరకు ఏ కెప్టెన్‌కూ సాధ్యం కాని ఘనతను రోహిత్ శర్మ సాధించాడు. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ టోర్నీల్లో తమ జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.
ఇక ఇటీవల ఆసీస్‌తో సెమీస్ మ్యాచ్‌లో విజయానంతరం గంభీర్‌కు రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ప్రశ్నలు ఎదురుకాగా.. తమ కెప్టెన్ అద్భుతమైన టెంపోతో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇలాంటి విషయాలపై తానేమీ మాట్లాడలేనన్నాడు.