
Photo Courtesy: BCCI
బాలీవుడ్ గాయని, 'ముంజ్య' ఫేమ్ జాస్మిన్ సాండ్లాస్ పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ మార్కో జన్సెన్‌పై ఆగ్రహంతో ఊగిపోయింది. నిన్న (ఏప్రిల్ 5) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రాయల్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. రియాన్ పరాగ్ అందించిన ఈజీ క్యాచ్‌ను జన్సెన్ నేలపాలు చేశాడు.
— THAT RCB GUY (@RcbWale34631) April 5, 2025
దీంతో కోపం పట్టలేకపోయిన జాస్మిన్ జన్సెన్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటికీ ఆమె భావోద్వేగాలను నియంత్రించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఇదే సీజన్‌లో ఓ సీఎస్‌కే ఫ్యాన్ గర్ల్ కూడా ఇదే తరహాలో (ధోని క్యాచ్ పట్టినందుకు) హెట్‌మైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
మ్యాచ్ విషయానికొస్తే.. జన్సెన్ పరాగ్ క్యాచ్ నేలపాలు చేసినందుకు పంజాబ్ కింగ్స్ భారీ మూల్యమే చెల్లించుకుంది. లైఫ్ లభించాక పరాగ్ చెలరేగి ఆడాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ భారీ స్కోర్ (205/4) చేసింది. ఛేదనలో తడబడిన పంజాబ్ రెండు వరుస విజయాల తర్వాత సీజన్‌లో తొలి ఓటమిని చవిచూసింది.
ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ సొంత మైదానమైన ముల్లన్‌పూర్ స్టేడియంలో జరిగింది. నూతనంగా ప్రారంభించబడిన ఈ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌కు ఈ సీజన్‌లో ఇదే తొలి మ్యాచ్. దీంతో స్టేడియంలో బీసీసీఐ గ్రాండ్‌గా ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించింది. ఈ వేడుకల్లో ప్రముఖ బాలీవుడ్ మరియు పంజాబీ గాయని జాస్మిన్ సాండ్లాస్ అద్భుతమైన ప్రదర్శనలతో అలరించింది. ఈ మ్యాచ్ కోసం వేలాదిగా తరలివచ్చిన అభిమానులు జాస్మిన్ పాటలకు ఉర్రూతలూగిపోయారు.
ఓపెనింగ్ సెర్మనీ తర్వాత జాస్మిన్ పంజాబ్‌కు మద్దతు ఇస్తూ.. ఆ జట్టు జెర్సీ ధరించి స్టాండ్స్‌లో కనిపించింది. ఈ క్రమంలో జన్సెన్ రియాన్ పరాగ్ క్యాచ్ వదిలేయడంతో ఆమె ఆగ్రహానికి గురైంది. జాస్మిన్ జన్సెన్‌పై కేకలు వేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. జాస్మిన్ గతేడాది బాలీవుడ్‌లో రిలీజ్ అయిన హరర్ సినిమా ముంజ్యలో పాటలు పాడింది. ఈ పాటలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. ముంజ్య సినిమా అతి తక్కువ పెట్టుబడితో భారీ వసూళ్లు చేసింది.