
తప్పుడు కేసులతో ఎవరినీ వేధించడం లేదు
● మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వానికి తప్పుడు కేసులు పెట్టి ఎవరినీ వేధించాల్సిన అవసరం లేదని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. నగరంలోని ఆయన నివాసంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వానికి సంపూర్ణ మెజార్టీతో ప్రజలు అధికారం ఇచ్చారన్నారు. గడిచిన ఐదేళ్లు నాస్తికులు రాష్ట్రాన్ని పరిపాలించారని, వారి కారణంగా ఆలయ వ్యవస్థ భ్రష్టుపట్టిందన్నారు. దేవుడు ముందు ఎవరూ తప్పించుకోలేరన్నారు.
16 లోపు అభ్యంతరాలు తెలపాలి
నెల్లూరు (టౌన్): జోన్–3 పరిధిలోని ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని స్కూల్ అసిస్టెంట్ (ప్రభుత్వ), నుంచి గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు తాత్కాలిక సీనియార్టీ జాబితాను జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈఓ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ జాబితాపై అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో ఈ నెల 16వ తేదీలోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు.
బీసీ హాస్టల్ విద్యార్థులు
83 శాతం ఉత్తీర్ణత
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లా బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులు 83.21 శాతం ఉత్తీర్ణత సాధించారని జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పి. వెంకటలక్ష్మమ్మ శనివారం తెలిపారు. ప్రభుత్వ బీసీ హాస్టళ్లలో ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థులు 250 మంది పరీక్షలకు హాజరు కాగా 233 మంది ఉత్తీర్ణులై 83.21 ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షకు 358 మంది హాజరు కాగా 195 మంది ఉత్తీర్ణులై 54.47 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.
అత్యుత్తమ మార్కులు
ఇంటర్మీడియట్ సెకండియర్ ఫలితాల్లో బీసీ హాస్టల్స్‌లో వింజమూరు హాస్టల్ విద్యార్థి జి.వెంకటసుశాంక్ 962 మార్కులు సాధించి ప్రథమ స్థానం సాధించారన్నారు. ఫస్టియర్ ఫలితాల్లో కావలి బీసీ హాస్టల్‌కు చెందిన పి.సుష్మిత 468 మార్కులు సాధించి జిల్లా బీసీ హాస్టళ్ల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆమె అభినందించారు.