
ఆ 40 మీటర్లు అత్యంత ప్రమాదకరం అందుకే రోబోల వినియోగం : మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్ /సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్‌ఎల్ బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన కార్మికుల జాడ గుర్తించడానికి రోబో రెస్క్యూ కార్యక్రమాలకు రూ. 4 కోట్ల వ్యయం కానుంది. దానికి సంబంధించిన ఫైల్‌పై మంత్రి ఉత్తమ్ గురువారం సంతకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఈ దురదృష్టకర సంఘటన జరగని పక్షంలో రెండేళ్లలో సొరంగం పూర్తయ్యే దన్నారు. ప్రమాదం జరిగిన దగ్గరనున్న 40 మీటర్లు అత్యంత ప్రమాదకరమని, అందుకే రోబోల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపారు.
టీబీఎం లోపల తవ్వకాలు..
టన్నెల్‌లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఏఐ ఆధారిత స్లడ్జ్ రిమూవల్ రోబో మిషనరీ ఇప్పటికే సొరంగంలో పనిచేస్తుండగా, శుక్రవారం మరో రెండు రోబోలు సొరంగం వద్దకు చేరుకోనున్నాయి. ప్రమాదస్థలంలో కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 పాయింట్ల మధ్య 12 మీటర్ల దూరం ఉంది. ఈ ప్రాంతంలోనే ఉన్న టీబీఎం పైకప్పుగా మెటల్ ప్లాట్‌ఫాం ఉంది. దాని కింద హోలో స్పేస్‌గా ఉన్న ఖాళీ ప్రదేశంలో కార్మికులు ఉండి ఉంటారని భావిస్తున్నారు.
టీబీఎం లోపల ఖాళీ ప్రదేశమంతా మట్టి, బురద, శిథిలాలతో కూరుకొని ఉంది. వాటిని పూర్తిగా తొలగిస్తేనే కార్మికుల జాడ తెలిసే అవకాశముంది. డీ2, డీ1 మధ్య కార్మికులు నడిచేందుకు అవకాశమున్నట్టు భావిస్తున్న చోట ట్రెంచ్‌గా తవ్వకాలు జరుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం కడావర్ డాగ్స్‌ను మరోసారి టన్నెల్‌లోకి తీసుకెళ్లారు.
మట్టి, బురద తొలగించిన ప్రదేశాల్లో మరోసారి అన్వేషణ చేపట్టారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్, కలెక్టర్ బదావత్ సంతోష్ సొరంగం వద్దే ఉండి క్షేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
మేడిగడ్డ బరాజ్‌పై ఎన్‌డీఎస్‌ఏ నివేదిక వారంలోగా
మేడిగడ్డ బరాజ్ 7వ బ్లాక్‌లో పగుళ్లు రావడానికి సంబంధించి వారం పది రోజుల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక వస్తుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బరాజ్‌లో నీరు నిల్వ చేసి వినియోగించుకోవడం లేదంటూ బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఓ విలేకరి మంత్రి దృష్టికి తీసుకుని రాగా..నీరు నిల్వ చేస్తే.. డ్యామ్ కొట్టుకొని పోయి దిగువన ఉన్న సీతారామ ప్రాజెక్టుతో సహా 44 వేల గ్రామాలు, భద్రాచలం కొట్టుకొనిపోవాలని వారు కోరుకుంటున్నారా అని ప్రశ్నించారు.
డ్యామ్‌ల రక్షణపై నివేదికలు ఇవ్వడంలో ఎన్‌డీఎస్‌ఏ సుప్రీం అని.. దాని సూచనలు పాటిస్తామన్నారు. తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాజెక్టును నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్‌కు నీళ్లు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నామని మంత్రి చెప్పారు.