
బీజేపీ నేతలు, కార్యకర్తల్లో స్తబ్ధత
ఎమ్మెల్సీ గెలుపు తర్వాతా మారని తీరు
ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ముప్పేట దాడి
ప్రకటనలకే పరిమితమైన బీజేపీ నాయకత్వం
ఎటూ తేలని కొత్త అధ్యక్షుడి నియామకం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించి ఘనవిజయం సాధించిన బీజేపీలో ఆ జోష్ అంతలోనే మాయమైంది. నాయకులు, కార్యకర్తల్లో స్తబ్ధత ఏర్పడింది. నిరుద్యోగ యువత, మహిళలు, రైతులు ఇతర వర్గాల సమస్యలపై అడపాదడపా నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి ప్రభావం చూపేలా కార్యక్రమాలు జరగడం లేదని కొందరు నేతలు పెదవి విరుస్తున్నారు.
బీఆర్‌ఎస్ దూకుడు.. బీజేపీ పాకుడు
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని సాధిస్తామనే స్థాయిలో పార్టీకి హైప్ వచ్చినా 8 సీట్లతోనే సంతృప్తి పడాల్సి వచ్చింది. అయితే, ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లకుగాను 8 సీట్లు గెలిచి బీజేపీ సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా ఎంపీ సీట్లు గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అసలైన ప్రత్యామ్నాయమనే స్థాయి తెచ్చుకుంది. దీంతో 2028 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే స్థాయిలో రాజకీయవర్గాల్లో అంచనాలు ఏర్పడ్డాయి. బీఆర్‌ఎస్ స్థానాన్ని బీజేపీ భర్తీ చేస్తుందనే అభిప్రాయం ప్రజల్లోనూ నెలకొంది.
కానీ, బీఆర్‌ఎస్ అంతలోనే కోలుకుని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊపిరి సలపనివ్వకుండా పోరాటం చేస్తోంది. బీజేపీ మాత్రం ఆ స్థాయిలో పోరాడలేకపోతోంది. బీజేపీలో ముఖ్యనేతల నుంచి కిందిస్థాయి వరకు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్య నాయకుల మధ్య సమన్వయలేమి మరింత పెరిగిందని అంటున్నారు.
8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఎవరికి వారు సొంత ఇమేజ్‌ను పెంచుకోవడంపైనే దృష్టి పెట్టడం, ముఖ్యనేతలు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో కేడర్‌లో గందరగోళం నెలకొంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 42% బీసీ రిజర్వేషన్లపై తీర్మానం, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, బడ్జెట్‌పై చర్చలో ఎమ్మెల్యేలు పార్టీ వాదనను బలంగా వినిపించలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమైంది.
వరుస గెలుపుల తర్వాత కూడా నిర్లిప్తతే
శాసనసభ, లోక్‌సభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుస విజయాల తర్వాత కూడా బీజేపీలో పెద్దగా జోష్ కనిపించటంలేదు. ప్రజా క్షేత్రంలో ప్రభుత్వంపై కొట్లాడే విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. వరుస గెలుపులను పదిలం చేసుకొనే కార్యకలాపాలేవీ ఇప్పటివరకు రాష్ట్ర నాయకత్వం చేపట్టకపోవటం గమనార్హం.
మరోవైపు పార్టీలో పాత, కొత్త నేతల మధ్య వైరుధ్యాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర పార్టీ కొత్త అధ్యక్షుడి నియామకం ఆలస్యం కావటం కూడా నేతల్లో నిర్లిప్తతను పెంచుతోందనే వాదన వినిపిస్తోంది. ఢిల్లీ అధిష్టానం కూడా రాష్ట్ర బీజేపీని ముందుకు కదిలించే ప్రయత్నం చేయటం లేదు. కొత్త అధ్యక్షుడి నియామకం ఆలస్యం అవుతున్నకొద్దీ నాయకులు, కార్యకర్తల్లో నిస్తేజం, నిర్లిప్తత పెరు గుతుందని కొందరు నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.