
సాక్షి, హైదరాబాద్: ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఈ క్రమంలోనే తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన చార్టెర్డ్ ఫ్లైట్‌ను ఈడీ అధికారులు సీజ్ చేశారు. దీంతో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. అనంతరం, ఫ్లైట్‌లో ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఫాల్కన్ కేసులో ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్‌కు చెందిన ప్రైవేట్ జెట్ విమానాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. పెట్టుబడుల పేరిటి రూ.850 కోట్లు స్కామ్ ఫాల్కన్ కంపెనీలో వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రూ.14 కోట్లతో కంపెనీ చైర్మన్ అమర్‌దీప్ చార్టెర్డ్ ఫ్లైట్‌ను కొనుగోలు చేశారు. ఇక, తాజాగా చార్టెడ్ ఫ్లైట్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది. మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో సదరు చార్టెడ్ ఫ్లైట్‌ను శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ పర్మిషన్ ఇచ్చారు. ఈ క్రమంలో ఎమర్జెన్సీ ఏమీ లేకపోవడంతో ఎయిర్‌పోర్టు అధికారులు.. ఈడీకి సమాచారం ఇచ్చారు.
దీంతో, రంగంలోకి దిగిన ఈడీ అధికారులు.. చార్టెడ్ ఫ్లైట్‌ను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దాదాపు 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. అనంతరం, చార్టెడ్ ఫ్లైట్‌లో ఉన్న వారిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. ఇదే కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఇక, ఈ కేసులో ఫాల్కన్ కంపెనీ చైర్మన్ అమర్‌దీప్ సహా మరికొందరు కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు. వీరందరికీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

స్కామ్ ఇదే..
ఫాల్కన్ సంస్థ అధిక లాభాల ఆశ చూపించి అమాయకుల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లను సేకరించింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఫ్లాట్‌ఫామ్ పేరుతో మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్‌లతో ఏకంగా రూ.1,700 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.850 కోట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించగా, మిగిలిన రూ.850 కోట్లు తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. తెలుగు రాష్ట్రాల్లో 6,979 మందిని మోసం చేసింది. ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ కంపెనీ డైరెక్టర్ కావ్య నల్లూరి, బిజినెస్ హెడ్ పవన్ కుమార్ ఓదెలను సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.