
మన టైగర్ రిజర్వ్‌లలో ఫ్రంట్‌లైన్ స్టాఫ్ వేకెన్సీ 41.62 శాతం
దేశవ్యాప్తంగా పులులు, ఇతర వన్యప్రాణుల వేటకు ముమ్మర ప్రయత్నాలతో అటవీశాఖ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ‘టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్’ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో పెద్దపులుల సంరక్షణకు మరిన్ని చర్యలు చేపట్టేందుకు ఇది దోహదపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో పులుల సంఖ్య సమృద్ధిగా ఉండగా, కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లో పులులు స్థిరనివాసం ఏర్పరచుకోవడం లేదు. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకొని ఉన్న మహారాష్ట్ర సరిహద్దు, తిప్పేశ్వర్, తడోబా పులుల అభయారణ్యాల నుంచి ఆదిలాబాద్ మీదుగా టైగర్ కారిడార్ ఉన్న విషయం తెలిసిందే.
ఈ కారిడార్‌లో ఐదారు పులులు తరుచుగా సంచరిస్తూ చుట్టుపక్కల గ్రామస్తులకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు పులుల అభయారణ్యాలతోపాటు మిగతా ప్రాంతాల్లో కూడా పులుల ఆవాసాల పెంపుదలకు ‘టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్’ఏర్పాటు దోహదపడుతుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. ఇటీవల నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) జరిపిన పరిశీలన ప్రకారం చూస్తే... మన రాష్ట్రంలో ఫ్రంట్‌లైన్ స్టాఫ్ వెకెన్సీ 41.62 శాతంగా ఉన్నట్టుగా వెల్లడైంది.
యాక్టివ్‌గా వేటగాళ్ల సిండికేట్
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పులులను లక్ష్యంగా చేసుకొని వేటగాళ్లు ఓ గ్యాంగ్‌గా ఏర్పడినట్టు మహారాష్ట్రలో నమోదైన ఓ కేసు ద్వారా వెలుగులోకి వచి్చన విషయం తెలిసిందే. గ్యాంగ్‌లోని వేటగాళ్లలో ఒకరు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి వచ్చారని, కొంతకాలం ఇక్కడే ఉన్నట్టుగా బయటపడింది. ఈ వేటగాడి అనుచురులు కేటీఆర్‌కు వెళ్లినట్టు, పులుల శరీర భాగాలకు సంబంధించిన డీల్‌కు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలు కాకినాడలో చోటుచేసుకున్నట్టుగా తేలింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల వారీగా పులుల సంరక్షణ, అటవీ పరిరక్షణ చర్యలు చేపడుతున్న అటవీ సిబ్బంది ఎంతమంది అవసరమైతే... ఎంతమంది ఉన్నారనే దానిపై ఎన్‌టీసీఏ పరిశీలించింది.
ఏటీఆర్, కేటీఆర్‌లను కలిపితే 41.61 శాతం ఫ్రంట్‌లైన్ స్టాఫ్ వెకెన్సీ ఉన్నట్టుగా తేల్చారు. ఏపీలో అయితే 62.17 శాతంగా ఉన్నట్టుగా తెలిసింది. మరోవైపు ఫారెస్ట్ బీట్‌ఆఫీసర్లు, ఇతర ఫ్రంట్‌లైన్ స్టాఫ్‌కు సంబంధించిన పోస్టుల భర్తీ అనేది అటవీశాఖకు సవాల్‌గా మారుతోంది. అధిక శ్రమతో పాటు తక్కువ వేతనం, ఎక్కువ పనిగంటలు ఉండడంతో ఎఫ్‌బీవోలుగా చేరినవారు ఎక్కువకాలం కొనసాగడం లేదని అధికారులు చెబుతున్నారు. అందువల్ల ఈ పోస్టులకు పెట్టే పరీక్షల విధానాన్ని మార్చి టెన్త్/ఇంటర్ వంటి విద్యార్హతలతో సంబంధం లేకుండా అడవుల పట్ల అవగాహన, జంతువుల గురించి తెలిసిన వారిని, స్థానిక ఆదివాసీ, గిరిజనులను నియమిస్తే ఉపయోగకరంగా ఉంటుందనే అంచనాకు వచ్చారు.