
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య మధ్యప్రదేశ్ సమీప ప్రాంతం నుంచి ఈశాన్య తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
కాగా, రాష్ట్రంలో రెండు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వివరించారు. శనివారం ఖమ్మంలో గరిష్టంగా 41.8 డిగ్రీల సెల్సియస్, మెదక్‌లో కనిష్టంగా 22.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రానున్న రెండు రోజులు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.