
హైదరాబాద్: పదేళ్ల నిరీక్షణ అనంతరం సికింద్రాబాద్ నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం రేషనింగ్ అధికారులు తొలి జాబితాకు తుది కసరత్తు చేస్తున్నారు. వేల సంఖ్యలోని దరఖాస్తుల్లోంచి పలు వడపోతల అనంతరం వందల సంఖ్యలో లబ్దిదారులను అర్హులుగా ఎంపిక చేశారు. ఫిబ్రవరిలో కేవలం 1497 మందికి మాత్రమే కార్డులు అందించేందుకు పౌరసరఫరాల విభాగం అధికారులు తుది జాబితాను సిద్ధం చేశారు. దీంతో వేలాది మంది దరఖాస్తు దారులకు నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
పెండింగ్‌లో 11 వేల దరఖాస్తులు
సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి రేషన్ కార్డుల కోసం ఇప్పటిరకు 11 వేల పైచిలుకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు సికింద్రాబాద్ సహాయ పౌరసరఫరాల అధికారులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నేరుగా, మీ సేవా కేంద్రాల ద్వారా 4,100 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని ఐదు డివిజన్ల నుంచి 6,900 వేల దరఖాస్తులు వచ్చాయి.
పరిశీలనలో 3400
ప్రజాపాలనలో అందిన 6,900 వేల దరఖాస్తులను జతపరిచిన ధృవీకరణ పత్రాల ఆధారంగా పరిశీలనలు చేసిన అనంతరం ప్రాధమికంగా సర్వే కోసం జాబితాను రూపొందించారు. ఇందులోంచి 3449 దరఖాస్తుదారుల వాస్తవ పరిస్థితులను సేకరించేందుకు నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ, రేషనింగ్ విభాగాల అధికారుల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, కార్ల తరహా వాహనాలు, 100 గజాలకు పైబడిన స్థలంలో సొంత ఇల్లు, వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు పైబడి ఉన్నవారి దరఖాస్తులను తిరస్కరించారు. పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఇంటి కరెంటుబిల్లుల ప్రాతిపదికన వివరాలను నమోదు చేసుకున్న సర్వే సిబ్బంది అర్హులను ఎంపిక చేశారు.
పారదర్శకంగా ఎంపిక
ఐదు డివిజన్లలో కొత్త రేషన్‌కార్డుల జారీ కోసం పారదర్శకంగా సర్వే నిర్వహించి అర్హుల జాబితా ఎంపిక చేశామని సికింద్రాబాద్ జీహెచ్‌ఎంసీ, రేషనింగ్ కార్యాలయ అధికారులు చెబుతున్నారు. ఈనెల 16న సర్వే ప్రారంభించి వారం రోజుల పాటు కొనసాగించిన అనంతరం 3449 దరఖాస్తుల్లోంచి 1497 మందికి కొత్త కార్డులు జారీ చేసేందుకు తుది కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా స్వంత ఇల్లు లేనివారికి తొలిప్రాధాన్యత ఇచి్చనట్టు, ఆ మీదట పక్కాగా 100 గజాల లోపు స్థలంలో గ్రౌండ్‌ఫ్లోర్ నిర్మాణం మాత్రమే కలిగి ఉన్న గృహాలకు చెందిన కుటుంబాలను రేషన్ కార్డులు అందించడం కోసం పరిగణలోకి తీసుకున్నట్టు సమాచారం.