24వ తేదీ వరకు వార్డుల వారీగా సభలు
జాబితాలో పేరు లేని కుటుంబానికి వెసులుబాటు
విచారణ పూర్తయినవారికి 26 నుంచి కార్డుల జారీ
మరి ప్రజాపాలన దరఖాస్తుల విషయమేమిటో?
సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కలిగింది. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా రూపొందించిన జాబితాలో పేర్లు లేని కుటుంబాలు ఈ నెల 24 వరకు జరిగే స్థానిక వార్డు సభల్లో దరఖాస్తులు సమరి్పంచవచ్చని మంత్రులు ప్రకటించారు. దీంతో మంగళవారం నుంచే వార్డు ఆఫీసులకు పేదలు క్యూ కట్టారు. పౌరసరఫరాల శాఖ కొత్త రేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్‌లో ఈపీడీఎస్ ఎఫ్‌ఎస్‌సీ లాగిన్‌లో దరఖాస్తు చేసుకునే వి«ధానం ఉండగా.. తాజాగా ఆఫ్‌లైన్‌లో జీహెచ్‌ఎంసీ వార్డు ఆఫీస్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇటీవల ఇంటింటికీ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డు లేని కుటుంబాలను గుర్తించి తాజాగా ఆ కుటుంబాలపై క్షేత్రస్థాయి విచారణ నిర్వహించారు. విచారణలో సుమారు 70 శాతం వరకు కుటుంబాలు అర్హత సాధించాయి. వీరికి ఈ నెల 26 నుంచి రేషన్ కార్డులు జారీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది.
సర్వేలో గుర్తింపు అంతంతే..
సమగ్ర కుటుంబ సర్వేలో రేషన్ కార్డు లేని కుటుంబాల గుర్తింపు అంతంత మాత్రంగానే కొనసాగింది. సర్వే సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో, కొన్ని కుటుంబాలను వదిలివేశారనే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా ప్రజాపాలనలో కొత్త రేషన్‌ల కార్డు కోసం సుమారు 5,73,069 కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ.. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా సమగ్ర కుటుంబ సర్వే పేరిట కేవలం 83,285 కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డులు లేనట్లు గుర్తించడం విస్మయానికి గురి చేస్తోంది. మిగతా కుటుంబాల పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రజాపాలనలో సైతం రేషన్ కార్డులు లేని ఎన్నో పేద కుటుంబాలు పాత అడ్రస్‌లతో కూడిన ఆధార్, ఇతరత్రా పత్రాలు లేని కారణంగా దరఖాస్తులు సమరి్పంచలేకపోయాయి.
ఆఫ్‌లైన్ దరఖాస్తులపై అనుమానమే..
కొత్త రేషన్ కార్డుల కోసం ఆఫ్‌లైన్ దరఖాస్తుల స్వీకరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత పదేళ్లుగా పౌర సరఫరాల శాఖ ఆన్‌లైన్ ద్వారానే సేవలందిస్తోంది. గత నాలుగేళ్లుగా కొత్త రేషన్ కార్డుల లాగిన్ నిలిచిపోవడంతో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేకుండాపోయింది. ప్రజాపాలనాలో కేవలం ఆరు గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించగా రేషన్ కార్డులు లేని వారు సైతం దరఖాస్తులు సమర్పించారు. దీంతో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా వాటిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో పేదలు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా కూడా వార్డు ఆఫీసుల్లో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు మౌఖికంగా పేర్కొంటున్నప్పటికీ పౌరసరఫరాల శాఖా పరంగా కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం ప్రకటన విడుదల చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజాపాలన దరఖాస్తులు ప్రశ్నార్థకమే..
ప్రజాపాలనలో గంపెడు ఆశలతో కొత్త రేషన్ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తుల పరిస్థితి ప్రశ్నార్థకంగా తయారైంది. మరోవైపు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లలో జరిగే ప్రజావాణి కార్యక్రమాల్లో సైతం కొత్త రేషన్ కార్డుల కోసం అందిన ఆఫ్‌లైన్ దరఖాస్తుల పరిస్థితి కూడా అదే తరహాగా మారింది. ఇటీవల కుల గణనలో భాగంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో కొత్త రేషన్ కార్డుల కోసం గుర్తించిన కుటుంబాలపైనే తాజాగా క్షేత్రస్థాయి విచారణ జరిగింది. దీంతో కొత్త రేషన్ కార్డుల వ్యవహారం దుమారం రేపుతోంది. ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిరుపేద దరఖాస్తు దారులకు నిరాశే కలిగిస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాదిరిగానే రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అంటూ పాత పాడుతున్న కాంగ్రెస్ ప్రభ్వుత్వం ఆచరణలో మాత్రం కనీసం పెండింగ్ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకపోవడం విస్మయపరుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment