
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్ల కిందట తీవ్ర చర్చనీయాంశమైన అప్సర కేసు(Apsara Case)లో సంచలన తీర్పు వెలువడింది. సాయికృష్ణను దోషిగా నిర్ధారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతేకాదు.. సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో ఏడు సంవత్సరాల అదనపు జైలు శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు వెల్లడించింది.
2023 జూన్‌లో శంషాబాద్‌లో జరిగిన అప్సర హత్య కేసు సంచలనం సృష్టించింది. సరూర్ నగర్‌లో స్థానికంగా ఓ ఆలయంలో పూజారి అయిన సాయికృష్ణ(Sai Krishna)కు.. అప్సరతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. నాలుగేళ్లుగా వాళ్ల బంధం కొనసాగింది. చివరకు పెళ్లి చేసుకోవాలంటూ ఆమె అతడిపై ఒత్తిడి తెచ్చింది. అయితే..
విషయం బయటపడితే తన పరువు పోతుందనే భయంతో ఆమెను పక్కా ప్రణాళిక వేసి సాయికృష్ణ హతమార్చాడు. ఆపై శంషాబాద్ నుంచి మృతదేహాన్ని కారులో తీసుకొచ్చి.. మ్యాన్‌హోల్‌లో వేసి పూడ్చేశాడు. ఆపై ఏమీ తెలియనట్టు ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతడే నిందితుడని గుర్తించిన విషయం తెలిసిందే.
సినిమా అవకాశాల పేరుతో..
చెన్నైకి చెందిన అప్సర కుటుంబం.. హైదారాబాద్‌కు వలస వచ్చింది. అప్పటికే అప్సర డైవోర్సీ. ఆమె తండ్రి కాశీలో స్థిరపడిపోగా.. తల్లితో కలిసి సరూర్‌నగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు దిగింది. ఈ క్రమంలో ఇంటి దగ్గర గుడిలో పెద్దపూజారిగా పని చేస్తున్న సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. శంషాబాద్‌లో తాను నిర్వహించే గోశాలకు తరచూ ఆమెను తీసుకెళ్తూ ఉండేవాడు సాయి. ఈ క్రమంలో సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ తరచూ ఆమెను కలిసే వంకతో వాళ్ల ఇంటికి సైతం వెళ్తూ వచ్చాడు.
అప్సర తల్లి(Apsara Mother)ని అక్కా.. అని పిలుస్తూ ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉండేవాడు. వివాహితుడు అని తెలిసి కూడా అప్సర అతనితో చనువుగా ఉంటూ వచ్చింది. ఆ పరిచయం కాస్త ప్రేమ, ఆపై శారీరక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా.. అబార్షన్ సైతం చేయించాడు. చివరకు పెళ్లి కోసం ఒత్తిడి చేయడాన్ని టార్చర్‌గా భావించి అప్సరను శంషాబాద్ వైపు తీసుకెళ్లి హత్య చేశాడు.