
నరేందర్‌రెడ్డిపై కేసులో పోలీసులకు హైకోర్టు ఆదేశం
తహసీల్దార్, డీఎస్పీ ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లు కొట్టివేత
కుట్ర అన్న ఆరోపణే తప్ప.. ఎఫ్‌ఐఆర్‌లలో అతని పేరు లేదు
సాక్షి, హైదరాబాద్: లగచర్ల ఘటనకు సంబంధించి బొంరాస్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై ఒకే ఎఫ్‌ఐఆర్(153/2024)తో దర్యాప్తు జరపాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అయితే ఫిర్యాదు చేసిన దుద్యాల తహసీల్దార్ కర్ర కిషన్, వికారాబాద్ డీఎస్పీ బి.జానయ్యల స్టేట్‌మెంట్ రికార్డు చేయొచ్చని దర్యాప్తు అధికారికి స్వేచ్ఛనిచి్చంది. ఒకవేళ ఇప్పటికే రికార్డు చేస్తే వాటిని కూడా 153 ఎఫ్‌ఐఆర్ కింద తీసుకున్నట్టే పరిగణించాలని స్పష్టం చేసింది. నరేందర్‌రెడ్డి పిటిషన్‌ను అనుమతించింది.
ఈ నెల 11న లగచర్లలో కలెక్టర్ సహా పలువురు అధికారులపై జరిగిన దాడి వెనుక నరేందర్‌రెడ్డి ఉన్నారని ఎఫ్‌ఐఆర్ 153 నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత తహసీల్దార్ ఫిర్యాదు మేరకు 154, డీఎస్పీ ఫిర్యాదు మేరకు 155 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. వేర్వేరు వ్యక్తుల ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద 3 వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఇది టీటీ ఆంటోని వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పునకు విరుద్ధమంటూ నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి కె.లక్ష్మణ్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ‘మూడు ఎఫ్‌ఐఆర్‌లలో పిటిషనర్ పేరు లేదు. అతనిపై వచి్చన ఏకైక ఆరోపణ కుట్ర.
మూడు ఘటనల్లోనూ భౌతికంగా ఉన్నాడని, దాడిలో పాల్గొన్నాడని అతనిపై ఎలాంటి ఆరోపణ లేదు. వాస్తవాలను పరిశీలిస్తే.. 3 నేరాల్లో పిటిషనర్‌ను ఇరికించడానికి ప్రతివాదులు ప్రయతి్నస్తున్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఒకే ఘటనలో బహుళ ఎఫ్‌ఐఆర్‌ల నమోదు అనుమతించబడదు. మూడింటిలో కారణాలు, నేరాలు, వాహనాలకు నష్ట, ఫిర్యాదుదారుల మధ్య సారూప్యత ఉంది. అందువల్ల, పిటిషనర్‌పై ఒకే ఘటనకు సంబంధించి బొంరాస్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లోని 154, 155 ఎఫ్‌ఐఆర్‌లు అనుమతించలేం. రద్దు చేస్తున్నాం’అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
లంచ్‌మోషన్ రూపంలో మరో పిటిషన్
ఇదే కేసులో తనపై ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ నిందితుడు(ఏ–33) కావలి శేఖర్ పిటిషన్ దాఖలు చేశారు.సెక్షన్ 307 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం తగదన్నారు. లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ నేరుగా దాడిలో పాల్గొన్న ఫొటోలను పీపీ పల్లె నాగేశ్వర్‌రావు న్యాయమూర్తికి అందజేశారు. దీంతో పిటిషనర్ అభ్యర్థనను న్యాయమూర్తి తిరస్కరించారు.