
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్లు కొట్టివేతపై హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 7 వరకు చెట్లు కొట్టొద్దని హైకోర్టు స్టే ఇచ్చింది. కోర్టు ఆదేశాలున్నప్పటికీ చెట్ల కొట్టివేత కొనసాగుతోందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు ఈనెల 7కు హైకోర్టు వాయిదా వేసింది.
కాగా, చెట్లు నరకడాన్ని వెంటనే ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే వరకు అక్కడ ఎలాంటి పనులు చేయొద్దని ఏసీజే జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం తేల్చిచెప్పింది. సుదీర్ఘ వాదప్రతివాదనల వల్ల సమయం ముగియడంతో తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. ఇవాళ(గురువారం) విచారణ జరిపిన న్యాయస్థానం.. చెట్లు కొట్టివేతపై స్టే విధించింది.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీఐఐసీ)కి బదిలీ చేసి చదును చేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ హైకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్) దాఖలయ్యాయి. ‘ఐటీ, ఇతర అవసరాల కోసం ఎకరం రూ. 75 కోట్ల మేర సంస్థలకు కేటాయించేలా కంచ గచ్చిబౌలి సర్వే నంబర్ 25లోని 400 ఎకరాల అటవీ భూమిని టీజీఐఐసీకి సర్కార్ కేటాయించింది. ఈ మేరకు గతేడాది జూన్ 26న రెవెన్యూ శాఖ తీసుకొచ్చిన జీవో 54ను కొట్టేయాలి. అక్కడ 40 జేసీబీ తవ్వకాలతో సర్కార్ చెట్లను తొలగిస్తూ వృక్ష, జంతుజాలాన్ని నాశనం చేస్తోంది’ అని పిటిషనర్లు ఆరోపించారు.