
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్న ఈ–కేటుగాళ్లు
కాల్స్‌తో ఆడియో, వీడియో రికార్డు చేసి అసభ్య క్లిప్స్ తయారీ
వాటిని బాధితులకు పంపి భారీ మొత్తం చెల్లించాలని డిమాండ్
ఉత్తరాదిలో ఎక్కువగా జరుగుతున్న ఇలాంటి నేరాలు
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న సైబర్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: టార్గెట్ చేసిన వ్యక్తులకు కనిపించకుండా ఆన్‌లైన్‌లోనే అందినకాడికి దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నారు. ఏళ్లుగా జరుగుతున్న సెక్స్‌టార్షన్ క్రైమ్‌కు తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను జోడిస్తున్నారు. ఫలితంగా తప్పు చేయకున్నా చేసినట్లు ఆడియోలు, వీడియోలు సృష్టిస్తూ.. బెదిరింపులకు దిగుతున్నారు. వాటిని సోషల్‌మీడియాలో పోస్టు చేస్తామంటూ బాధితులనుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ప్రస్తుతం ఈ తరహా సైబర్ నేరాలు ఉత్తరాదిలో ఎక్కువగా జరుగుతున్నాయని, అపరిచిత కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు, సైబర్ పోలీసులు సూచిస్తున్నారు.
ఈ నేరాలు ఒకప్పుడు ఇలా..
వాస్తవానికి సెక్స్‌టార్షన్ నేరం చాలాకాలంగా జరుగుతోంది. 2022–23లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదైనా.. ఆ తర్వాత కొంత వరకు తగ్గాయి. అందమైన యువతుల ఫొటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టుకునే సైబర్ నేరగాళ్లు.. ఎంపిక చేసిన నంబర్లకు సందేశాలు పంపేవాళ్లు. వాటికి స్పందించిన యువకులు, పురుషులతో చాటింగ్ చేస్తూ సన్నిహితంగా మెలిగేవారు. ఆపై విషయాన్ని వీడియో కాల్స్ వరకు తీసుకువెళ్లే వాళ్లు.
ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా సదరు యువతే నగ్నంగా ఉండి కాల్ మాట్లాడుతున్నట్లు చేసేవారు. ఆ తర్వాత అసలు కథ మొదలుపెట్టే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసిన వ్యక్తి సైతం నగ్నంగా కాల్ చేసేలా ప్రేరేపించేవారు. ఆ కాల్‌ను రికార్డు చేసి, అతడికే షేర్ చేసి బెదిరించి, తాము అడిగినంత ఇవ్వకుంటే సోషల్‌మీడియాలో పోస్టు చేస్తామంటూ దండుకునేవారు.
ఇప్పుడు ఏఐ వాడుతూ..
తాజాగా ‘ఈ–కేటుగాళ్లు’సైతం ఏఐని గణనీయంగా వినియోగిస్తున్నారు. ఎంపిక చేసుకున్న ఫోన్ నంబర్లకు వాయిస్, వీడియో కాల్స్ చేస్తున్నారు. ఆ వ్యక్తి వాటికి ఆన్సర్ చేస్తూ ‘హలో’, ‘ఎవరు’వంటి పదాలు వాడితే చాలు.. ఆ వాయిస్, వీడియోలను రికార్డు చేసుకుంటున్నారు. వీటిని ప్రత్యేక ఏఐ సాఫ్ట్‌వేర్స్‌లో పొందుపరిచి.. సదరు వ్యక్తి యువతితో అశ్లీలంగా, అసభ్యంగా సంభాషిస్తున్నట్లు, ఏకాంతంగా గడుపుతున్నట్లు ఆడియో, వీడియోలు సృష్టిస్తున్నారు.
వీటిని టార్గెట్ చేసిన వ్యక్తికి పంపి బెదిరింపులకు దిగుతున్నారు. ఆ యువతితో ఫిర్యాదు చేయిస్తామని, సోషల్‌మీడియాలో పోస్టు చేస్తామని, కుటుంబీకులకు పంపిస్తామని చెప్పి బెదిరిస్తున్నారు. ఆ ఆడియో, వీడియోలతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిసినప్పటికీ.. తీవ్ర ఆందోళన చెందే బాధితులు ప్రత్యామ్నాయాలు ఆలోచించట్లేదు. సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేసిన మొత్తం చెల్లించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
అపరిచిత కాల్స్‌కు స్పందించొద్దు..
ఇలాంటి నేరాల్లో బాధితులు తమ పరువు పోతుందనే ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లు అడిగిన మొత్తం చెల్లించడానికే మొగ్గు చూపుతున్నారు. అయితే ఆ కేటుగాళ్లు ఒకసారి డబ్బు తీసుకుని వదిలిపెడతారనే గ్యారంటీ లేదు. అనేక ఉదంతాల్లో పదేపదే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. బాధితులు నగదు చెల్లించకుండా, ధైర్యం చేసి ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తేనే ఫలితాలు ఉంటాయి. వీలున్నంత వరకు అపరిచిత నంబర్ల నుంచి వచ్చే ఫోన్, వీడియో కాల్స్‌కు స్పందించకపోవడం ఉత్తమం.
– ఎన్.ఆర్.ప్రభాకర్‌రెడ్డి, సైబర్ క్రైమ్ నిపుణుడు