Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP files petition in supreme court over Waqf Amendment Bill1
‘వక్ఫ్‌’ చట్టంపై సుప్రీంకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్‌

తాడేపల్లి,సాక్షి: వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వైఎస్సార్‌సీపీ పిటిషన్‌ దాఖలు చేసింది. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు పార్ల‌మెంట్‌లో వ్య‌తిరేకంగా వైఎస్సార్‌సీపీ ఓటు వేసిన విష‌యం తెలిసిందే. మైనారిటీ సమాజానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంద‌ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.ఇందులో భాగంగా వక్ఫ్‌ సవరణ బిల్లును ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో వైఎస్సార్‌సీపీ వ్య‌తిరేకించింది. గ‌తంలోనే వక్ఫ్‌ సవరణ బిల్లుపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేసింది. మళ్లీ పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశ పెట్ట‌డంతో లోక్‌స‌భ‌, రాజ్యసభలో వ‌క్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఓటేశారు. ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిచ్చి మరోసారి ముస్లింలను మోసం చేశారు. అన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలి, వారి ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం’ అని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో వైఎస్సార్‌సీపీ పేర్కొంది.కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో వక్ఫ్‌ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఉభయ సభల్లో ఈ బిల్లు పాస్‌ కావడంతో పాటు ఆపై రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఈ సవరణ బిల్లు చట్టు రూపం దాల్చింది. దీనిని సవాల్ చేస్తూ ఇప్పటికే పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అవ్వగా, తాజాగా వైఎస్సార్ సీపీ కూడా పిటిషన్ దాఖలు చేసింది. అందుకే వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టులో సవాల్ వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుంది. ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోకుండా చట్టం చేశారు. అందుకే వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ వక్ఫ్ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 13,14,25,26లను ఉల్లంఘిస్తోంది. ప్రాథమిక హక్కులు, సమానత్వం, మత స్వేచ్చలకు వ్యతిరేకంగా ఉంది. కొన్ని మతాల స్వయం ప్రతిపత్తికి భంగం కలిగించేలా ఉంది. ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చటం వక్ఫ్ బోర్డు అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవటమే. ఈ నిర్ణయం వక్ఫ్ బోర్డు పరిపాలన స్వాతంత్య్రాన్ని దెబ్బ తీస్తోందని వైఎస్సార్‌సీపీ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది. YSRCP has filed a petition in the Supreme Court challenging the Waqf Bill, citing serious constitutional violations and failure to address the concerns of the Muslim community.The Bill violates Articles 13, 14, 25, and 26 of the Constitution—provisions that guarantee…— YSR Congress Party (@YSRCParty) April 14, 2025

CM Revanth Reddy at launch of Bhu bharati portal2
ఆధార్‌లా 'భూధార్‌'

సాక్షి, హైదరాబాద్‌: ఆధార్‌ తరహాలో భూధార్‌ పేరిట రాష్ట్రంలోని ప్రతి భూ కమతానికి ఓ ప్రత్యేకమైన నంబర్‌ కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రతి వ్యవసాయ భూమికి పక్కా కొలతలతో సరిహద్దులు నిర్ణయించి భూధార్‌ నంబర్‌ ఇవ్వడం వల్ల రైతుల భూములకు పూర్తి భరోసా లభిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులు నిర్ణయించి సొంత రాష్ట్రం సాధించుకున్న రెవెన్యూ ఉద్యోగులకు రైతుల భూములకు సరిహద్దులు నిర్ణయించి భూధార్‌ కార్డులు ఇవ్వడం కష్టమేమీ కాదని అన్నారు. ‘ధరణి’ స్థానంలో రూపొందించిన కొత్త ఆర్‌ఓఆర్‌ (రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌) చట్టం ‘భూ భారతి’ పోర్టల్‌ను సోమవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. భూ రికార్డులు ‘రెవెన్యూ’ ఘనతే..: ‘తెలంగాణ ప్రాంతంలో పోరాటాలన్నీ భూమితోనే ముడిపడి ఉన్నాయి. కొమురం భీమ్‌ జల్‌ జమీన్‌ జంగిల్‌ పోరాటం నుంచి చాకలి అయిలమ్మ, దొడ్డి కొమురయ్య వరకు సాగించిన పోరాటాలు, సాయుధ రైతాంగ పోరాటం, కమ్యూనిస్టు సోదరుల పోరాటాలన్నీ భూమి కోసమే జరిగాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బూర్గుల రామకృష్ణారావు నుంచి పీవీ నరసింహారావు వరకు ఎందరో భూసంస్కరణలు తెచ్చారు. ఇందిరాగాంధీ నేతృత్వంలో దేశంలో వచ్చిన భూ సంస్కరణల ద్వారా వివిధ మార్గాల్లో ప్రజలు సొంతం చేసుకున్న భూములకు సంబంధించిన రికార్డులన్నింటినీ రెవెన్యూ శాఖనే రూపొందించింది. పటా్వరీ వ్యవస్థ పోయిన తర్వాత వీఆర్‌ఓ, వీఆర్‌ఏలే రైతుల భూముల వివరాలు సేకరించి భద్రపరిచారు. 95 శాతం భూముల వివరాలను ప్రక్షాళన చేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు..’ అని సీఎం తెలిపారు. ధరణి ప్రజల పాలిట భూతంగా మారింది ‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉన్న ఫళంగా అప్పటి ప్రభుత్వం చట్టాలను మార్చింది. గత పాలకులు రెవెన్యూ చట్టాలను మార్చి తెచ్చిన ధరణి పోర్టల్‌ ప్రజల పాలిట భూతంగా మారింది. ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్‌ పైనే పెట్రోల్‌ పోసి తగలబెడితే, సిరిసిల్లలో ఓ మహిళ తన భూమి కోసం తహసీల్దార్‌కు తన తాళిబొట్టును లంచంగా ఇవ్వజూపింది. ఈ విధంగా ప్రజల బాధలకు కారణమైన ధరణిని బంగాళాఖాతంలో విసిరేసి, కొత్త ఆర్‌ఓఆర్‌ చట్టం తెస్తామని ఎన్నికలకు ముందు పాదయాత్రల్లో నేను, భట్టి విక్రమార్క ప్రజలకు హామీ ఇచ్చాం. కొత్త చట్టం పేదలకు చుట్టంగా ఉండాలని ఎంతో శ్రమించి ‘భూ భారతి’ని తీసుకొచ్చాం. తెలంగాణలో వివాద రహిత భూ విధానం తేవాలన్న మా లక్ష్యానికి అనుగుణంగా ఈ చట్టం తెచ్చాం. ప్రజలకు అనుకూలమైనదిగా దీన్ని తీర్చిదిద్దాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే భూ భారతిని ప్రారంభిస్తున్నాం. ఈ చట్టాన్ని ఖమ్మంలో లక్ష మంది ప్రజల సమక్షంలో ప్రజలకు అంకితం చేద్దామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెబితే, నేను రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమక్షంలోనే చట్టం అమలు ప్రక్రియను ప్రారంభిద్దామని చెప్పా. ఈ ప్రభుత్వం రెవెన్యూ అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని గౌరవిస్తుంది..’ అని రేవంత్‌ చెప్పారు. గత ప్రభుత్వం తమ స్వార్ధం కోసం చట్టాన్ని మార్చింది.. ‘గతంలో ధరణిని తీసుకువచ్చిన పాలకులు రెవెన్యూ సిబ్బందిని దోషులుగా, దోపిడీదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. 70 ఏళ్లుగా ప్రజల భూములను కాపాడిన రెవెన్యూ సిబ్బంది ధరణి వచ్చిన తర్వాత మీకు దోపిడీదారులుగా కనిపించారా? చట్టాలను చుట్టాలుగా మార్చుకుని వేలాది ఎకరాలు కొల్లగొట్టిన మాట వాస్తవం కాదా? సమాజంలోని ప్రతి వ్యవస్థలో రెవెన్యూ నుంచి రాజకీయ నాయకుల వరకు 5 నుంచి 10 శాతం వరకు చెడ్డవారు ఉంటారు. చెడ్డవాళ్లను శిక్షించుకుంటూ ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు పోవాలి. కానీ గత ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందిని దోషులుగా చూపించి తమ స్వార్థం కోసం చట్టాన్ని మార్చింది. ఆనాటి ముఖ్యమంత్రి రెవెన్యూ అధికారులపై అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడారో మీకు తెలుసు. మేం అవినీతికి పాల్పడే వ్యక్తుల విషయంలో కఠినంగా ఉంటాం.. కానీ వ్యవస్థపై కాదు. గత పాలకుల్లా..మేం చేసే తప్పులకు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే విధానానికి నేను వ్యతిరేకం..’ అని సీఎం అన్నారు. కలెక్టర్లు గ్రామ గ్రామానికి వెళ్లాలి ‘రెవెన్యూ అధికారులపై దురుద్దేశంతో కొందరు కల్పించిన అపోహలను తొలగిద్దాం. మేం తెచ్చిన చట్టాలను మీరు అమలు చేస్తారు. 69 లక్షల మంది రైతులకు ప్రభుత్వం, రెవెన్యూ విభాగం రెండు కళ్లు లాంటివి. కలెక్టర్ల నుంచి సిబ్బంది వరకు గ్రామ గ్రామానికి వెళ్లండి. దోషులుగా చిత్రీకరించిన విధానానికి వ్యతిరేకంగా ఎవరి భూమి వారికి లెక్క కొద్దీ ఇద్దాం. కలెక్టర్లు ప్రతి మండలంలో పర్యటించాలని ఈ వేదిక నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నా. అందరి సహకారంతో చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయండి. భూభారతిని పైలెట్‌ ప్రాజెక్టుగా నాలుగు మండలాల్లో చేపడుతున్నాం . నాలుగు మండలాల్లో వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ తీసుకుని లోపాలు ఏమైనా ఉంటే సవరించుకున్న తర్వాత అన్ని జిల్లాల్లోని అన్ని మండలాల్లో భూ సమస్యలు పరిష్కరించుకుందాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

Sakshi Guest Column On Donald Trump Tarrifs3
వన్‌ వే రూటు

రుణపత్రాల విపణిలో ఉత్పన్నమైన అనూహ్య పరిణామాలు అమెరికా అధ్యక్షుడికి గుబులు పుట్టించాయి. అమెరికా బాండ్స్‌కు గిరాకీ పెరిగినట్లే పెరిగి వెంటనే తగ్గిపోయింది. డాలర్‌ ఇండెక్స్‌ విలువ కూడా క్షీణిస్తోంది. దీంతో కొత్త సుంకాల విధింపు అమలును 90 రోజుల పాటు నిలిపివేశారు. ఇతర ప్రపంచ దేశాల విషయంలో తాత్కాలికంగానే అయినా ఒక మెట్టు దిగిన ట్రంప్‌ చైనా విషయంలో మాత్రం చాలావరకు బెట్టుగానే ఉన్నారు. ఏమైనా, అమెరికా సృష్టించిన ఈ అల్లకల్లోలం రోడ్డు మ్యాపు లేని వన్‌ వే రూటు! ట్రంప్‌ సుంకాల సంక్షోభం మధ్యకాలిక అనిశ్చితిని పెంచుతుంది. ఆర్థిక కార్యకలాపాలు అంచనాల మీద ఆధారపడి ఉంటాయి. అనిశ్చితి అనేది అంచ నాలను మార్చేస్తుంది. వ్యాపార సంస్థలు, కుటుంబాలు నిర్ణయాలు తీసుకోవడంలో అప్రమత్తంగా వ్యవహరిస్తాయి. ట్రంప్‌ 90 రోజుల ఊరట నిజానికి ఈ అనిశ్చితి వ్యవధిని పెంచుతుందే తప్ప, అనిశ్చితికి ముగింపు పలకదు. ఆర్థిక కార్యకాలపాల్లో తెగింపు, నిర్ణయ శక్తి కొరవడతాయి. ప్రభుత్వాలు ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ, ప్రపంచ వ్యాప్త ఆర్థిక మందగమనం తప్పదు. సుంకాల వెనుక రెండు లక్ష్యాలువిచ్ఛిన్నకర సుంకాల ద్వారా రెండు లక్ష్యాలు సాధించాలని ట్రంప్‌ అనుకుంటున్నారు. అమెరికా వస్తూత్పత్తుల తయారీ వ్యవస్థ ఏనాడో కుప్పకూలింది. దీన్ని పునరుద్ధరించడం మొదటిది. తద్వారా దిగువ స్థాయి ఫ్యాక్టరీ ఉద్యోగాలు విశేషంగా సృష్టి అవుతాయి. ఇక రెండోది, చైనాను శిక్షించడం. ప్రపంచ వాణిజ్య విధానాన్ని అడ్డు పెట్టుకుని అది అనుచిత ప్రయోజనం పొందుతోంది. పాతికేళ్ల క్రితమే అమెరికాలో పాగా వేయ గలిగింది. ఈ రెండో లక్ష్యం కంటే, మొదటిదే ట్రంప్‌ రాజకీయ మద్దతుదారులకు మరింత ముఖ్య విషయం. దేశీయంగా పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగాలు కల్పించలేనప్పుడు, ధరలు పెరిగిపోతున్నప్పడు, చైనాను శిక్షించడం వల్ల అమెరికన్లకు ప్రయోజనం ఏముంటుంది? ఇక్కడ ఒక సమస్య ఉంది. దేశీయ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించి మొదటి లక్ష్యాన్ని సాధించడమే... చైనాను దెబ్బ తీయడమనే రెండో లక్ష్యం కంటే కష్టమైన విషయం. చైనా భౌగోళిక ఆర్థిక విస్తరణను అదుపు చేసే వ్యూహాలు ఇప్పటికిప్పుడు రూపొందినవి కాదు. గడచిన రెండు దశాబ్దాలుగా అమెరికాలో వీటి గురించి పుంఖాను పుంఖాలుగా పుస్తకాలు, పరిశోధన పత్రాలు ప్రచురితమయ్యాయి. ఇవి ఎలా ఉండబోతున్నాయో, వీటిని ఎదుర్కోవడానికి ఎలా సన్నద్ధం కావాలో చైనా ప్రభుత్వానికి మంచి అవగాహనే ఉంది. మరి, ట్రేడ్‌ వార్‌ పర్యవసానాలు ఎదుర్కొనేందుకు అమెరికా ఎంతవరకు సన్నద్ధంగా ఉందనేది ప్రశ్న. కర్మాగారాల స్థాపనకు కనీసం రెండేళ్లు పడుతుంది. ట్రంప్‌ నిరుద్యోగ మద్దతుదారులు అందాకా ఓర్పుతో ఉండగలరా? స్వల్పకాలంలో కష్టాలు, దీర్ఘకాలంలో లాభాలు అనే సూత్రం రాజకీయంగా కుదిరేది కాదు. ట్రంప్‌ స్వదేశంలోనే మద్దతు కోల్పేతే ఆయన విధానాలకు అంతర్జాతీయంగా స్పందన ఎలా ఉంటుంది?దేశాల స్పందనట్యారిఫ్‌ సంక్షోభం అనంతర కాలంలో ప్రపంచ దేశాలు అమెరికా మీద విశ్వాసం కోల్పోతాయి. ఒకవేళ అమెరికా అధ్యక్షుడు తన విధానాలు, (వివాదాస్పద) మాటలు వెనక్కు తీసుకున్నా, ఆయన ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాధిపతులు విశ్వాసంలోకి తీసుకోరు! కెనడా, మెక్సికో, డెన్మార్క్, దక్షిణా ఫ్రికాలను ట్రంప్‌ బాహాటంగానే టార్గెట్‌ చేసి మాట్లాడారు. బ్రెజిల్, కొలంబియా, జర్మనీ, ఫ్రాన్స్‌,సింగపూర్, నమీబియా, ఆస్ట్రేలియా వంటి దేశాల అధినేతలు యూఎస్‌ అధ్యక్షుడిపై బహిరంగ విమర్శలకు వెనుకాడటం లేదు. యూరోపియన్‌ యూనియన్‌ ఈ విషయంలో ఒక్కతాటి మీద లేకున్నా, మెజారిటీ సభ్యదేశాలు అమెరికాను నమ్మే స్థితిలో లేవు. ఈయూ అటు చైనాతోనూ, ఇటు ఇండియా తోనూ వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తుంది. బలహీన ప్రధాని నేతృత్వంలోని జపాన్‌ మాత్రం అమెరికాను ప్రాధేయపడుతున్నట్లు వ్యవహరిస్తోంది. ఏమైనా, అది కూడా చైనాతో వాణిజ్య సంబంధాలు స్థిరీకరించుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇండియా మౌనం వెనుక...ఇక ఇండియా నాయకత్వం అమెరికా ట్రేడ్‌ పాలసీ పట్ల ఆచితూచి వ్యవహరిస్తోంది. చైనాతో అమీతుమీకి ట్రంప్‌ సిద్ధపడటం ఇండియాకు ఆనందంగా ఉంది. మరోవంక, అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందానికి చర్చలు జరుపుతోంది. అమెరికా నుంచి రక్షణ సామగ్రి, ఇతరత్రా దిగుమతులు పెంచు కునేందుకు సిద్ధపడుతోంది. అయినా కూడా, ట్రంప్‌ మొదటి విడత పదవీకాలంలో ఆయనతో వ్యవహరించినంత సంతోషంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ దఫా ఉన్నారా? ట్రంప్‌ ఆయనకు చురకలు వేస్తూ మాట్లాడుతున్నారు. అంతగా స్నేహపూర్వకం కాని ధోరణిలో ఇండియా పేరు పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఎంతో సెల్ఫ్‌ ఇమేజ్, ఇగో ఉన్న మోదీ ఈ అవమానాలకు లోలోపల కుమిలిపోయే ఉంటారు!ఉభయ దేశాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సుస్థిరపరచుకోవాలని ఇండియా భావిస్తోంది. అయినా సరే, ఏ భారతీయ నాయకుడూ జపాన్, ఇటలీ మాదిరిగా ట్రంప్‌ ముందు సాగిలపడేందుకు సిద్ధంగా లేరు. బహుశా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటున్న నేపథ్యంలో మోదీ మౌనం పాటిస్తూ ఉండొచ్చు. దీంతో, గ్లోబల్‌ సౌత్‌ (పేద దేశాలు) తరఫున మాట్లాడేందుకు ఇతరులకు అవకాశం లభించింది. ట్రేడ్‌ ట్యారిఫ్‌లను వ్యతిరేకిస్తూ వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు చైనా సంఘీభావం ప్రకటిస్తోంది. ఇండియా కూడా కలిసి రావాలని ఆహ్వానిస్తోంది. బ్రెజిల్, దక్షిణాఫ్రికా నాయకులు కూడా ఇతర వర్ధమాన దేశాలకు సంఘీభావం ప్రకటించాయి. ‘గ్లోబల్‌ సౌత్‌’ ఇండియా ‘వాయిస్‌’ కోసం ఎదురు చూస్తోంది.సంజయ బారు వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్, విధాన విశ్లేషకుడు(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

Chinese Freight Forwarder Advises American Clients on Donald Trump Reciprocal Tariffs4
ఇలా చేస్తే టారిఫ్ ఎఫెక్ట్ ఉండదు!

ఓ వైపు అమెరికా.. మరోవైపు చైనా.. నువ్వా నేనా అన్నట్లుగా సుంకాలను పెంచుకుంటూ పోతున్నాయి. ఈ విషయం ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్లు, రెండు దేశాలు ప్రవర్తిస్తున్నాయి. చైనా వస్తువులపై అమెరికా 145 శాతం వరకు సుంకాలు విధించడంతో.. చైనా కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా అమెరికాపై విధిస్తున్న సుంకాలను 125 శాతానికి పెంచింది.అమెరికా విధిస్తున్న సుంకాల భారీ నుంచి తప్పించుకోవడం ఎలా అని చాలామంది తలలు పట్టుకుంటున్నారు. దీనికి ఓ మార్గం కూడా ఉంది. సుంకాల భారీ నుంచి తప్పించుకోవాలంటే.. ఇక స్మగ్లింగ్ చేయాలేమో అనే మీకు రావొచ్చు. అలాంటి సాహసాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఎలా తప్పించుకోవాలో క్లారిటీగా వెల్లడించే ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.చైనా వస్తువులను అమెరికాకు ఎగుమతి చేస్తే 145 శాతం సుంకాలను కట్టాల్సి ఉంటుంది. ఎగుమతి అంటేనే భారీ మొత్తం. కానీ చైనాలో వస్తువు కొని మనవెంట అమెరికాకు తెచ్చుకుంటే.. దానికి ప్రత్యేకంగా టారిఫ్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ టాప్ సీక్రెట్: నెట్టింట్లో వైరల్ఉదాహరణకు ఒక అమెరికన్.. చైనాలో పర్యటించేటప్పుడు తనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వాటిని తనతో పాటు అతని దేశానికి కూడా తీసుకెళ్లవచ్చు. ఇది పూర్తిగా లీగల్.. పర్సనల్ షాపింగ్ సర్వీస్ కిందికి వస్తుంది. అయితే ఎన్ని వస్తువులు కొనాలి?, ఎన్ని వస్తువులను తనతో పాటు తీసుకెళ్లవచ్చు అనే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని పాటిస్తే.. మీపై టారిఫ్స్ ప్రభావం ఉండదు. ఇది ఒక్క అమెరికన్ ప్రజలకు మాత్రమే కాదు.. ఈ ఫార్ములాతో మీరు ఏ దేశీయులైన.. ఇతర దేశాల్లో వస్తువులను సుంకాలతో పనిలేకుండా హ్యాపీగా కొనేయొచ్చు.China is now providing tariff advice. 🤣 pic.twitter.com/esNxGshMe6— James Wood 武杰士 (@commiepommie) April 13, 2025

Sakshi Editorial On EVM Machines5
పారదర్శకతే ప్రాణం!

మన ఎన్నికల సంఘం(ఈసీ)కి ఇష్టమున్నా లేకున్నా ఈవీఎంలపై సంశయాలు తరచు తలెత్తుతూనే ఉన్నాయి. ఇక్కడే కాదు... వేరే దేశాల్లో సైతం సందేహాలు వినబడుతూనే వున్నాయి. ఆ మధ్య టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ఈవీఎంలను హ్యాక్‌ చేయటం సులభమని, దీన్ని తాను నిరూపించగలనని సవాలు విసిరారు. ఇప్పుడు ఆ వరసలో అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్‌ తులసి గబ్బార్డ్‌ సైతం నిలిచారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సమక్షంలో కేబినెట్‌ భేటీలో ఆమె ఈవీఎంల భద్రతా లోపాలపై పలు ఆధారాలు సమర్పించారు. యథావిధిగా దీనిపైనా మన ఈసీ స్పందించింది. ఆమె వ్యాఖ్యలు మన ఈవీఎంలకు వర్తించబోవని మాట్లాడింది. సమస్యంతా అక్కడేవుంది. మన దేశంలో పార్టీలు చేసే ఆరోపణలకు ఆ సంఘం నోరు మెదపదు. ఒక జాతీయ పార్టీ, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్‌ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో చేసిన ఆరోపణలకు వెనువెంటనే జవాబివ్వడానికి ఈసీకి తీరిక లేకపోయింది. పార్లమెంటులో ఈవీఎంలపై తీవ్ర దుమారం రేగాక మాత్రమే స్పందించింది. గత ఏడాది నవంబర్‌ 4న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా ఆ నెల 23న ఫలితాలు ప్రకటించారు. ఆ తర్వాతనుంచి కాంగ్రెస్, ఎన్సీపీ ఈవీఎంలపై సందేహాలు వ్యక్తం చేస్తూనే వచ్చాయి. 95 నియోజక వర్గాల్లో ఈవీఎంలూ, వీవీప్యాట్‌ స్లిప్‌లూ తనిఖీ చేసి అవి సరిపోలాయో లేదో చెప్పాలని 104 అభ్యర్థనలు వచ్చాయి. వాటిని అంగీకరిస్తే దాదాపు 755 ఈవీఎంల తనిఖీ తప్పనిసరవుతుంది. ఇందులో ఎన్సీపీనుంచి దాఖలైనవే ఎక్కువ. ఇవిగాక న్యాయస్థానాల్లో దాఖలైన ఎన్నికల పిటిషన్లు సరేసరి. హరియాణాలో సైతం ఈవీఎంలపై ఆరుచోట్ల అభ్యర్థనలొచ్చాయి. జమ్మూ కశ్మీర్‌లో ఒక స్థానం నుంచి ఈ మాదిరి వినతి వచ్చింది. ఆరోపణలొచ్చినప్పుడల్లా ఈసీ ఇచ్చే జవాబు ఒకే విధంగా ఉంటున్నది. మన ఈవీఎంలు సురక్షితమైనవి, జొరబడటానికి అసాధ్యమైనవి అన్నదే దాని వాదన. అలాగే అవి ఇంటర్నెట్‌తోసహా దేనికీ అనుసంధానించి వుండవు కనుక వైఫై, బ్లూటూత్‌ల ద్వారా ఏమార్చటం ఏమాత్రం కుదరదని కూడా చెబుతోంది. అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన సాంకేతిక సదస్సులో కంప్యూటర్‌ శాస్త్రవేత్త అలెక్స్‌ హాల్డర్‌మాన్‌ ఆనవాలు మిగల్చకుండా ఈవీఎంను హ్యాక్‌ చేయటం, ఫలితాన్ని తారుమారు చేయటం ఎంత సులభమో నిరూపించారు. వీవీ ప్యాట్‌ యంత్రాలతో అనుసంధానించివున్నా ఈవీఎంల పనితీరు ఎన్ని సంశయాలకు తావిస్తున్నదో వివరించే గణాంకాలు సదస్సులో సమర్పించారు. కార్నెగీ మెలాన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డేవిడ్‌ ఎకార్ట్‌ ఈవీఎంలో వోటేసిన వెంటనే స్క్రీన్‌పై ఎంపిక చేసుకున్న అభ్యర్థి పేరే కనబడుతున్నా వేరేవారికి వోటు పడటంవంటి ఉదంతాలను వివరించారు. ఇంటర్నెట్‌తో ఈవీఎంలను అనుసంధానించకపోయినా హ్యాక్‌ చేయటం సాధ్యమేనన్నారు. ఈవీఎంలలో గుట్టుచప్పుడు కాకుండా రిమోట్‌ యాక్సిస్‌ సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేయటంద్వారా ఇది చేయొచ్చన్నది ఆయన వాదన. అసలు ఈవీఎంల రవాణా, పంపిణీ విధానం లోపభూయిష్టంగా ఉన్నదని సమాచార హక్కు చట్టంకింద అడిగిన ప్రశ్నలకు వచ్చిన సమాధానాలు వెల్లడించాయి. తన నిర్వహణలో సమర్థవంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని, అందులో సందేహాలకు తావు లేదని ఎన్నికల సంఘం నమ్మటం తప్పేమీకాదు. ఆమాత్రం ఆత్మవిశ్వాసం ఉండటాన్ని ఎత్తిచూపించాల్సిన అవసరం లేదు. కానీ అదే విశ్వాసం అందరిలో కలగటానికి అది చేస్తున్నదేమిటన్నదే ప్రశ్న. పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే, ఆ రోజు రాత్రి, ఆ తర్వాత విడుదల చేసే పోలింగ్‌ శాతం వివరాలు ఆశ్చర్యం కలిగిస్తున్నా, వాటిల్లో ఎందువల్ల వ్యత్యాసం చోటుచేసుకుంటున్నదో సందేహాతీతంగా అది వివరించలేకపోతున్నది. నిరుడు జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు కావొచ్చు... మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కావొచ్చు పోలింగ్‌ శాతం పెరుగుదలలో తీవ్ర వ్యత్యాసం కనబడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఏపీలో పోలింగ్‌ జరిగిన రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్‌ నమోదైందని చెప్పిన ఈసీ మరో నాలుగు రోజులకల్లా దాన్ని 80.66 శాతంగా ప్రకటించింది. నాలుగురోజుల వ్యవధిలో ఈ పెరుగుదల ఏకంగా 12.5 శాతం! సంఖ్యా పరంగా 49 లక్షల వోట్లు పెరిగినట్టు లెక్క! మొదటగా అనుకున్న శాతానికీ, చివరిగా ప్రకటించిన శాతానికీ మధ్య తేడాకు కారణాలేమిటో వివరించే ప్రయత్నం ఈనాటికీ ఈసీ చేయలేదు. మహా రాష్ట్రలోనూ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ ముగిశాక 58.2 శాతం పోలింగ్‌ అని చెప్పి, ఆ తర్వాత దాన్ని 65.02కు పెంచి తీరా కౌంటింగ్‌ ముందు అది 66.05 శాతం అన్నారు. బ్యాలెట్‌ విధానంలో ఇలాంటి వ్యత్యాసాలు కనబడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు. లెక్కించేది మనుషులే గనుక పొర బడ్డారని సరిపెట్టుకోవచ్చు. కానీ ఈవీఎంల విధానంలో అలా కాదు. ఎప్పటి కప్పుడు పోలైన వోట్ల సంఖ్య తెలిసిపోతుంది. మరి ఈ తేడాల వెనకున్న మతలబేమిటో ఎందుకు చెప్పరు? ఈవీఎంల చార్జింగ్‌ అమాంతం పెరిగిపోవటంపైనా అనేక సందేహాలున్నాయి.ప్రశ్నించినప్పుడు మౌనం వహించటమే పెద్దరికమవుతుందని ఈసీ భావిస్తున్నట్టుంది. ప్రజాస్వామ్యానికి కీలకమని భావించే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కరువైతే అది చివరకు ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం పాలు చేస్తుంది. అది ఇప్పటికే ఎంతో కొంత మొదలైంది. అందుకనే బ్యాలెట్‌ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌ క్రమేపీ పుంజుకుంటున్నది. ఈవీఎంలు నమ్మదగ్గవి కాదని ప్రపంచంలో ఏమూల ఎవరు చెప్పినా ఇక్కడ భుజాలు తడుముకోవటంవల్ల ప్రయోజనం లేదు. అలాగే పారదర్శకతకు ప్రత్యామ్నాయం కూడా ఉండదు.

IPL 2025: Chennai Super Kings defeated the Lucknow Super Giants by 5 wickets6
IPL 2025: చెన్నై గెలిచిందోచ్‌...

మహేంద్ర సింగ్‌ ధోని సారథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కాస్త ఊరట... వరుసగా ఐదు పరాజయాల తర్వాత పూర్తిగా ఆట మరచినట్లు కనిపించిన జట్టు ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. ప్రత్యర్థి లక్నోను ఆ జట్టు వేదికపైనే స్పిన్‌తో కట్టడి చేసిన సీఎస్‌కే ఆ తర్వాత మరో మూడు బంతులు మిగిలి ఉండగా లక్ష్యం చేరింది. బౌలింగ్‌లో నూర్‌ అహ్మద్, రవీంద్ర జడేజా కీలకపాత్ర పోషించగా, బ్యాటింగ్‌లో శివమ్‌ దూబే రాణించాడు. అన్నింటికి మించి మరో ఐదు ఓవర్లు మిగిలి ఉండగా క్రీజ్‌లోకి వచ్చిన ధోని తడబాటు లేకుండా, దూకుడుగా ఆడి జట్టుకు అవసరమైన ‘విలువైన’ పరుగులు సాధించడం మరో సానుకూలాశం. మరోవైపు ‘హ్యాట్రిక్‌’ విజయాలతో జోరు మీద కనిపించిన లక్నో సమష్టి వైఫల్యంతో ఓటమిని ఆహా్వనించింది. లక్నో: ఐపీఎల్‌లో ఎట్టకేలకు మూడు వారాల విరామం తర్వాత చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) గెలుపు రుచి చూసింది. సోమవారం జరిగిన పోరులో సీఎస్‌కే 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కెపె్టన్‌ రిషభ్‌ పంత్‌ (49 బంతుల్లో 63; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, మిచెల్‌ మార్‌‡్ష (25 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం చెన్నై 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసింది. శివమ్‌ దూబే (37 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) గెలుపు దిశగా నడిపించగా, ఎమ్మెస్‌ ధోని (11 బంతుల్లో 26 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) చివర్లో అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 28 బంతుల్లో అభేద్యంగా 57 పరుగులు జోడించారు. పంత్‌ హాఫ్‌ సెంచరీ... తొలి ఓవర్లోనే మార్క్‌రమ్‌ (6) అవుట్‌ కాగా, టోర్నీ ప్రస్తుత టాప్‌ స్కోరర్‌ నికోలస్‌ పూరన్‌ (8) కూడా విఫలం కావడంతో లక్నోకు సరైన ఆరంభం లభించలేదు. ఖలీల్‌ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టి మార్‌‡్ష జోరు ప్రదర్శించగా, పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 42 పరుగులకు చేరింది. సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 80 స్ట్రయిక్‌రేట్‌తో 40 పరుగులే చేసిన పంత్‌ ఈ మ్యాచ్‌లో పట్టుదలగా ఆడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్‌లో మార్‌‡్షను జడేజా వెనక్కి పంపగా... ఒవర్టన్‌ ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన ఆయుశ్‌ బదోని (17 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కూడా జడేజా బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. అప్పటి వరకు మెరుగ్గానే ఆడిన పంత్‌ను చెన్నై స్పిన్నర్లు పూర్తిగా కట్టిపడేశారు. ముఖ్యంగా నూర్‌ బౌలింగ్‌లో 15 బంతులు ఆడిన పంత్‌ 10 బంతుల్లో సింగిల్‌ కూడా తీయలేకపోయాడు! అయితే ఆ తర్వాత పతిరణ ఓవర్లో 2 సిక్స్‌లు బాదడంతో 42 బంతుల్లో అతని హాఫ్‌ సెంచరీ పూర్తయింది. చివరి 3 ఓవర్లలో లక్నో 45 పరుగులు సాధించింది. కీలక భాగస్వామ్యం... 2023 సీజన్‌ నుంచి చెన్నై జట్టుతో ఉన్న ఆంధ్ర ఆటగాడు షేక్‌ రషీద్‌ (19 బంతుల్లో 27; 6 ఫోర్లు)కు తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడే అవకాశం లభించింది. కొన్ని చక్కటి షాట్లతో అతను ఆకట్టుకున్నాడు. ఆకాశ్‌దీప్‌ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అతను, శార్దుల్‌ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టడం విశేషం. అయితే అవేశ్‌ ఓవర్లో భారీ షాట్‌ ఆడే క్రమంలో అతని ఇన్నింగ్స్‌ ముగిసింది. మరో ఎండ్‌లో రచిన్‌ రవీంద్ర (22 బంతుల్లో 37; 5 ఫోర్లు) కూడా వేగంగా ఆడటంతో పవర్‌ప్లేలో చెన్నై 59 పరుగులు సాధించింది. అయితే ఆ తర్వాత తక్కువ వ్యవధిలో జట్టు రచిన్, త్రిపాఠి (9), జడేజా (7), విజయ్‌శంకర్‌ (9) వికెట్లు కోల్పోవడంతో పాటు పరుగులు రావడం కూడా కష్టంగా మారిపోయింది. విజయానికి 30 బంతుల్లో 56 పరుగులు కావాల్సిన స్థితిలో దూబే, ధోని జత కలిశారు. తాను ఆడిన తొలి బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్స్‌ బాది ధోని దూకుడు ప్రదర్శించడంలో ఒత్తిడి కాస్త తగ్గింది. చివరి 2 ఓవర్లలో 24 పరుగులు అవసరమయ్యాయి. శార్దుల్‌ వేసిన 19వ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్‌ సహా 19 పరుగులు రాబట్టి విజయాన్ని దాదాపు ఖాయం చేసుకున్న చెన్నై... మరో మూడు బంతుల్లో లాంఛనం పూర్తి చేసింది. స్కోరు వివరాలు లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (సి) త్రిపాఠి (బి) అహ్మద్‌ 6; మార్‌‡్ష (బి) జడేజా 30; పూరన్‌ (ఎల్బీ) (బి) కంబోజ్‌ 8; పంత్‌ (సి) ధోని (బి) పతిరణ 63; బదోని (స్టంప్డ్‌) ధోని (బి) జడేజా 22; సమద్‌ (రనౌట్‌) 20; మిల్లర్‌ (నాటౌట్‌) 0; శార్దుల్‌ (సి) రషీద్‌ (బి) పతిరణ 6; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1–6, 2–23, 3–73, 4–105, 5–158, 6–158, 7–166. బౌలింగ్‌: ఖలీల్‌ అహ్మద్‌ 4–0–38–1, అన్షుల్‌ కంబోజ్‌ 3–0–20–1, ఒవర్టన్‌ 2–0–24–0, జడేజా 3–0–24–2, నూర్‌ అహ్మద్‌ 4–0–13–0, పతిరణ 4–0–45–2. చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రషీద్‌ (సి) పూరన్‌ (బి) అవేశ్‌ 27; రచిన్‌ (ఎల్బీ) (బి) మార్క్‌రమ్‌ 37; రాహుల్‌ త్రిపాఠి (సి అండ్‌ బి) రవి బిష్ణోయ్‌ 9; జడేజా (సి) మార్క్‌రమ్‌ (బి) రవి బిష్ణోయ్‌ 7; శివమ్‌ దూబే (నాటౌట్‌) 43; విజయ్‌శంకర్‌ (సి) అవేశ్‌ (బి) దిగ్వేశ్‌ రాఠీ 9; ధోని (నాటౌట్‌) 26; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.3 ఓవర్లలో 5 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–52, 2–74, 3–76, 4–96, 5–111. బౌలింగ్‌: శార్దుల్‌ ఠాకూర్‌ 4–0–56–0, ఆకాశ్‌దీప్‌ 1–0–13–0, దిగ్వేశ్‌ రాఠీ 4–0–23–1, అవేశ్‌ ఖాన్‌ 3.3–0–32–1, రవి బిష్ణోయ్‌ 3–0–18–2, మార్క్‌రమ్‌ 4–0–25–1. ఐపీఎల్‌లో నేడుపంజాబ్‌ X కోల్‌కతా వేదిక: ముల్లాన్‌పూర్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Tunnel excavations increasing rapidly in country: Telangana7
సొరంగం జిందాబాద్..!

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న సొరంగం కుప్పకూలి 50 రోజులు దాటుతోంది. మొత్తం 8 మంది కార్మికులు చిక్కుకుపోగా వందల మంది సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నా ఇప్పటికీ ఆరుగురు కార్మికుల జాడ బయటపడకపోవడం సొరంగాల నిర్మాణం ఎంత రిస్క్ తో కూడుకున్న వ్యవహారమో స్పష్టం చేస్తుంది. సాగునీటి ప్రాజెక్టులతో పాటు రైలు మార్గాలు, రహదారుల కోసం ప్రపంచ వ్యాప్తంగా వీటిని నిర్మిస్తుంటారు. కొన్ని కొండ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయం లేనప్పుడు సొరంగాల నిర్మాణం అనివార్యమవుతోంది.ఈ క్రమంలోనే గత దశాబ్ద కాలంగా దేశంలో సొరంగాల నిర్మాణం ఊపందుకుంది. గత ఏడాది డిసెంబర్‌ నాటికి దేశంలో 60 కి.మీ. నిడివి గల 42 సొరంగ మార్గాల నిర్మాణం పూర్తి చేశారు. మరో 75 సొరంగ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 146 కి.మీ. నిడివి గల వీటి నిర్మాణానికి ప్రభుత్వాలు రూ.49 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు కాగల మరో 78 ప్రాజెక్టులు ప్రణాళికల స్థాయిలో ఉన్నాయి. వీటి మొత్తం నిడివి 286 కి.మీ. కావటం విశేషం. ‘ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రీసెర్చ్‌’నివేదిక ప్రకారం ప్రస్తుతం దేశంలో సొరంగ మార్గాల మొత్తం నిడివి 3,400 కి.మీ.కు చేరుకుంది. అయితే ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం నేపథ్యంలో ఇప్పుడు సొరంగాల నిర్మాణం చర్చనీయాంశమవుతోంది. దేశంలోని ప్రధాన సొరంగాలు⇒ అస్సాంలో బ్రహ్మపుత్ర నదీ గర్భంలో నేషనల్‌ హైవేస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 34 కి.మీ. భారీ సొరంగమార్గాన్ని రూ.6,000 కోట్ల వ్యయంతో నిర్మించబోతోంది. ఇందులో నాలుగు వరుసల రహదారితోపాటు ప్రత్యేకంగా రైల్వే లైన్‌ కూడా ఉండనుంది. దేశంలో ఇదే భారీ సొరంగ మార్గం కాబోతోంది. ఇది పూర్తయితే గోహ్‌పూర్‌–నుమాలిగర్‌ పట్టణాల మధ్య ప్రయాణానికి ప్రస్తుతం పడుతున్న 6.30 గంటల సమయం అరగంటకు తగ్గుతుంది. ⇒ రూ.4,965 కోట్లతో హుగ్లీ నదీ గర్భంలో నిర్మించిన కోల్‌కతా ఈస్ట్‌–వెస్ట్‌ మెట్రో కారిడార్‌ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ⇒ జమ్మూకశ్మీర్‌లో ప్రధాన ప్రాంతాలను అనుసంధానిస్తూ నిర్మిస్తున్న ఉదంపూర్‌–శ్రీనగర్‌–బారాముల్లా రైల్‌లింక్‌ ప్రాజెక్టు (యూఎస్‌బీఆర్‌ఎల్‌) ప్రపంచంలో సొరంగాలతో కూడిన కీలక మార్గాల్లో ఒకటిగా నిలుస్తోంది. 324 కి.మీ. నిడివి ఉండే ఈ మార్గంలో ఏకంగా 38 సొరంగాలు ఉండటం విశేషం. మొత్తం 324 కి.మీ. నిడివి గల ఈ మార్గంలో సొరంగాల నిడివి ఏకంగా 119 కి.మీ. కావటం గమనార్హం. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.28 వేల కోట్లు. 359 మీటర్లతో ప్రపంచంలోనే అతి ఎత్తయిన చీనాబ్‌ రైలు వంతెన ఇందులో భాగమే. ⇒ ఈ మార్గంలో ఖరి–సంబర్‌ మధ్య 12.77 కి.మీ. ఫిర్‌పంజాల్‌ పర్వత శ్రేణిలో బనిహాల్‌–ఖాజీగుండ్‌ మధ్య 11.2 కి.మీ. ఖాద్‌–అంజిఖాద్‌ మధ్య 5.09 కి.మీ. పొడవైన సొరంగాలు నిర్మించారు. ఈ సొరంగాల్లో ప్రతి 375 మీటర్లకు ఒక ఎస్కేప్‌ మార్గం ఏర్పాటుచేస్తున్నారు. ⇒ థానే – «ముంబ్రా/దివా (ముంబై శివారు) మధ్య 1915లో నిర్మించిన 1.3 కి.మీ. పొడవైన పార్సిక్‌ సొరంగం మనదేశంలో అతి పురాతనమైనది. దీన్ని గ్రేట్‌ ఇండియన్‌Œ పెనిన్సులా రైల్వే నిర్మించింది. ⇒ ఇంటర్నేషనల్‌ టన్నెలింగ్‌ అండ్‌ అండర్‌గ్రౌండ్‌ స్పేస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏటా డిసెంబర్‌ 4వ తేదీన ప్రపంచ సొరంగమార్గ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.మే 9 నుంచి 15 వరకు వరల్డ్‌ టన్నెల్‌ కాంగ్రెస్‌స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో మే 9–15 మధ్య వరల్డ్‌ టన్నెల్‌ కాంగ్రెస్‌ జరగనుంది. సొరంగ మార్గాల సుస్థిర అభివృద్ధి.. అందుకు దోహదం చేసే పద్ధతులు, కొత్త సాంకేతికత ఇతివృత్తంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రమాదం నుంచి కొత్త ఉపాయంఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదంలో సహాయక చర్యల కోసం ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు కొత్త ఆలోచన తట్టింది. హైదరాబాద్‌–శ్రీశైలం హైవే విస్తరణలో భాగంగా అమ్రాబాద్‌ అభయారణ్యం మీదుగా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించాలని తొలుత భావించారు. అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి ఇది ప్రారంభం కావాల్సి ఉంది.దాదాపు 42 కి.మీ. నిడివి ఉండే దీనికి రూ.8 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని తాత్కాలిక అంచనా. అయితే, ఎలివేటెడ్‌కు బదులు, సొరంగ మార్గం నిర్మిస్తే నిడివి కేవలం 22 కి.మీ.లకే పరిమితమై రూ.6 వేల కోట్ల ఖర్చుతో పూర్తవుతుందని అంచనా వేశారు. ఇదే కొత్త ఐడియా. ఎలివేటెడ్‌కు ప్రత్యామ్నాయ ప్రతిపాదనగా నివేదిక సిద్ధం చేశారు. కేంద్రం ఆమో దం తెలిపితే తెలంగాణలో తొలి సొరంగ మార్గం అవుతుంది. మనదేశంలో పలు సొరంగ ప్రమాదాలు 2025 ఫిబ్రవరి: ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం కుప్పకూలి ఎనిమిది మంది చిక్కుకుపోయారు. ఇప్పటివరకు ఇద్దరి శవాలు మాత్రమే వెలికితీయగలిగారు. 2025 జనవరి: అస్సాంలోని బొగ్గుగని సొరంగం కుప్పకూలి నలుగురు చనిపోయారు. 2024 డిసెంబర్‌: ఢిల్లీ–ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే సొరంగం కూలి ఒకరు మృతిచెందగా, 10 మందికి గాయాలయ్యాయి. 2023 నవంబర్‌: ఉత్తరాఖండ్‌లోని సిల్‌్కయారా రోడ్డు ప్రాజెక్టు సొరంగం కూలిపోయి 41 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. 17 రోజుల తర్వాత వీరిని కాపాడగలిగారు. 2019 సెప్టెంబర్‌: కోల్‌కతా మెట్రో రైల్‌ ప్రాజెక్టు టన్నెల్‌ నిర్మాణ సమయంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టమేమీ జరగలేదు. 2004 ఆగస్టు: ఉత్తరాంచల్‌లో తెహ్రీ హైడ్రో ప్రాజెక్టు సొరంగం నిర్మాణ సమయంలో కుప్పకూలి 29 మంది దుర్మరణం చెందారు.

Farmers Fires on Nadendla Manohar8
డబ్బులెక్కడ సార్‌?.. మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు

ఎన్టీఆర్‌జిల్లా,సాక్షి: ధాన్యం కొనుగోళ్లను పరిశీలించేందుకు వచ్చిన ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar)కు ఎన్టీఆర్‌ జిల్లా రైతులు షాకిచ్చారు.జిల్లాలోని గొల్లపూడి మార్కెట్ యార్డ్‌లో ధాన్యం కొనుగోళ్లని పరిశీలించేందుకు మంత్రి నాదెండ్ల మనోహర్ వచ్చారు. మంత్రి రాకపై సమాచారం అందుకున్న రైతులు మార్కెట్‌ యార్డ్‌కు చేరుకున్నారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని మంత్రి మనోహర్‌ని నిలదీశారు. మిల్లర్లు తమను దోచుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజులైనా డబ్బులు పడలేదని ప్రశ్నించారు.

UP Men Put on  Oscar Worthy Act at Police Station After Arrest9
యువతిని వేధించి.. ఆపై పోలీస్‌ స్టేషన్‌లో.. ‘ట్రై చేస్తే ఆస్కార్‌ అవార్డ్‌ పక్కా’

లక్నో: యువతి,యువకుడిపై అల్లరి మూకలు తెగబడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుల్ని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ క్రమంలో నిందితులు తాము అనారోగ్యంతో ఉన్నామంటూ పోలీసులకు కలరింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాలుతో కుంటుకుంటూ నడుస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఆస్కార్‌ అవార్డ్‌ వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకి ఈ ఘటన ఎక్కడ జరిగింది?ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో అల్లరి మూకలు వీరంగం సృష్టించారు. ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె స్నేహితుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడి అనంతరం బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.అదిగో అప్పుడే నిందితులు తమలోని నటులను బయటపెట్టారు. ఫిర్యాదు దారులే తమపై దాడి చేశారంటూ పోలీసుల వద్ద మొరపెట్టుకున్నారు. బలహీన స్థితిలో ఉన్నామంటూ నటించేందుకు ప్రయత్నించారు. కాలుతో కుంటుకుంటూ నడుస్తూ, యాక్టింగ్‌ చేస్తున్న దృశ్యాలు చూసిన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వచ్చేస్తుంది కావాలంటే ట్రై చేయండి అంటూ ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆస్కార్‌ అవార్డ్‌ రేంజ్‌ యాక్టింగ్‌తో పోలీస్‌ స్టేషన్‌లో అల్లరిమూకలు చేసిన స్టంట్‌ మీరూ చూసేయండి. These men from UP's Muzaffarnagar misbehaved with a woman. They were caught by @Uppolice and took them to their acting class and were asked to perform in front of cameras.@Uppolice, you've become a joke! pic.twitter.com/vKLV3oxOM7— Congress Kerala (@INCKerala) April 14, 2025

PM Narendra Modi Fires On CM Revanth Reddy Govt10
బుల్డోజర్ల ప్రయోగంలో రేవంత్‌ సర్కారు బిజీ: ప్రధాని మోదీ

‘తెలంగాణ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేసేలా, జంతువులను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తోంది. అడవుల్ని ధ్వంసం చేస్తోంది. వాటిపై బుల్డోజర్లు ప్రయోగిస్తోంది..’ –ప్రధాని మోదీ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ పార్టీ విస్మరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. హామీలను పక్కన పెట్టి బుల్డోజర్లను ప్రయోగించడంలో రేవంత్‌ సర్కార్‌ నిమగ్నమైందని ధ్వజమెత్తారు. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే, తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అటవీ సంపదను నాశనం చేస్తోందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు నమ్మక ద్రోహానికి గురవుతున్నారని విమర్శించారు. తాము అభివృద్ధి ఎజెండాతో ముందుకెళుతూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నట్లు చెప్పారు. హరియాణాలోని హిసార్‌లో ‘మహారాజ అగ్రసేన్‌ ఇంటర్నేషనల్‌’ విమానాశ్రయాన్ని ప్రధాని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ర్యాలీలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఇటీవల వివాదం రేకెత్తిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాల విశ్వాస ఘాతుకం హరియాణాలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తాము పూర్తిగా అమలు చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. కానీ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌లలో అక్కడి ప్రభుత్వాలు విశ్వాస ఘాతుకానికి పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేసేలా, జంతువులను ప్రమాదంలో పడేసేలా వ్యవహరిస్తోంది. అడవుల్ని ధ్వంసం చేస్తోంది. వాటిపై బుల్డోజర్లు ప్రయోగిస్తోంది..’అని మోదీ ధ్వజమెత్తారు. అవినీతిలో కర్ణాటకను నంబర్‌ వన్‌గా నిలిపారు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న హిమాచల్‌నప్రదేశ్‌లోనూ అభివృద్ధి, సంక్షేమం అటకెక్కిందన్నారు. కర్ణాటకలో కరెంట్‌ నుంచి పాల దాకా, బస్సు చార్జీల నుంచి విత్తనాల వరకు ప్రతిదాని రేట్లు పెరిగాయని ప్రధాని మండిపడ్డారు. అక్కడి సీఎం అవినీతిలో దేశంలోనే నంబర్‌ వన్‌గా ఆ రాష్ట్రాన్ని నిలిపారని ఆరోపించారు. బీజేపీది అభివృద్ధి మోడల్‌ అయితే, కాంగ్రెస్‌ది అబద్ధాల మోడల్‌ అని విమర్శించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement