శ్రీనివాసా.. శ్రీచిద్విలాసా | Sakshi
Sakshi News home page

శ్రీనివాసా.. శ్రీచిద్విలాసా

Published Sun, May 5 2024 8:15 AM

శ్రీనివాసా.. శ్రీచిద్విలాసా

భక్తులతో పోటెత్తిన వాడపల్లి

ఒక్కరోజే రూ. 37.04 లక్షల ఆదాయం

ఆత్రేయపురం: శ్రీనివాసా... శ్రీ వేంకటేశా అంటూ భక్తులు తన్మయత్వం చెందారు.. ఆ వాడపల్లి స్వామివారిని చూసి భక్తిపారవశ్యంతో ఓలలాడారు.. కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారితో పాటు ఆలయ ఆవరణలో వేంచేసి ఉన్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారి కల్యాణోత్సవాలు తిలకించే, ఏడు వారాల నోము ఆచరిస్తున్న భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. వీరికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా డిప్యూటీ కమిషనర్‌, ఆలయ ఈఓ భూపతిరాజు కిశోర్‌కుమార్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేక దర్శనం, అన్నప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ ప్రసాదం విక్రయం, ఆన్‌లైన్‌ ద్వారా సుమారు రూ.37,04,739 ఆదాయం సమకూరింది. ఆలయం వద్ద ఏర్పాటైన అన్నసమారాధనలో వేలాది భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా పందిళ్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఎస్సై శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

మందపల్లిలో తైలాభిషేకాలు

కొత్తపేట: మందపల్లిలో మందేశ్వరస్వామి దేవస్థానానికి రూ. 2,06,872 ఆదాయం సమకూరిందని సహాయ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి కె.విజయలక్ష్మి తెలిపారు. తైలాభి షేకాల ద్వారా రూ.1,73,050, అన్న ప్రసాదం విరాళాలుగా రూ.33,822 వచ్చిందన్నారు.

Advertisement
Advertisement