జిల్లా రద్దు అంశంపై ఫోకస్‌.. | Sakshi
Sakshi News home page

జిల్లా రద్దు అంశంపై ఫోకస్‌..

Published Mon, May 6 2024 6:20 AM

-

సాక్షి, కామారెడ్డి : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా ఒకప్పుడు బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ సత్తా చాటింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికలలో దాదాపు క్లీన్‌ స్వీప్‌ చేసింది. 2014 పార్లమెంట్‌ ఎన్నికలలో నిజామాబాద్‌, జహీరాబాద్‌ స్థానాలను కై వసం చేసుకుంది. 2019లో నిజామాబాద్‌ను కోల్పోయినా జహీరాబాద్‌లో మాత్రం గులాబీ జెండానే ఎగిరింది. 2023 అసెంబ్లీ ఎన్నికలతో పరిస్థితిలో మార్పు వచ్చింది. ఎన్నికల సమయంలోనే కొందరు నేతలు కారుదిగినా.. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయాక గయారాంలు ఎక్కువయ్యారు. పదవులు అనుభవించినవారూ పార్టీని వీడుతుండడంతో శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికల్లో గెలవడం ద్వారా సత్తా చాటాలని, పోయిన పట్టును తిరిగి సాధించుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆరాటపడుతోంది. అయితే ప్రజల నుంచి అనుకున్న స్థాయిలో మద్దతు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చేపట్టిన బస్సు యాత్ర ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. సోమవారం నిజామాబాద్‌లో, మంగళవారం కామారెడ్డిలో జరిగే కేసీఆర్‌ బస్సు యాత్ర, రోడ్‌షోలపై ఆ పార్టీ నేతలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కేసీఆర్‌ రాకతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వస్తుందని భావిస్తున్నారు.

బీబీ పాటిల్‌ టార్గెట్‌గా..

రెండుసార్లు కారు గుర్తుమీద పోటీ చేసి విజయం సాధించిన బీబీ పాటిల్‌.. బీజేపీ గూటికి చేరారు. దీంతో బీఆర్‌ఎస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండుసార్లు ఎంపీగా గెలిపించుకుంటే కష్టకాలంలో పార్టీని వీడివెళ్లడాన్ని బీఆర్‌ఎస్‌ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకత్వం బీబీ పాటిల్‌ను టార్గెట్‌గా చేసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్‌, జాజాల సురేందర్‌, హన్మంత్‌ సింధేలు బీబీ పాటిల్‌పై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. పదేళ్లపాటు ఎంపీగా ఉన్న పాటిల్‌ చేసిందేమీ లేదని, కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహం చేశాడని ఆరోపిస్తున్నారు. బీబీ పాటిల్‌ ఓటమే లక్ష్యంగా చెమటోడుస్తున్నారు.

జన సమీకరణకు కసరత్తు

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. సోమవారం నిజామాబాద్‌లో నిర్వహించే రోడ్‌షోలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు మంగళవారం కామారెడ్డిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి బీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో జనాన్ని సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే సమావేశాలు నిర్వహించి ఏ గ్రామం, ఏ పట్టణం నుంచి ఎంత మందిని తరలించాలన్న దానిపై నేతలకు టార్గెట్లు ఇచ్చారు. జన సమీకరణకు ఆయా గ్రామాలు, వార్డులకు ఇన్‌చార్జీలను నియమించారు. జిల్లా కేంద్రంలో భారీ జన సమీకరణతో క్యాడర్‌లో జోష్‌ తేవడంతో పాటు ఓటర్లలోనూ ఆలోచన తీసుకురావాలని బీఆర్‌ఎస్‌ నేతలు యత్నిస్తున్నారు.

కామారెడ్డి జిల్లా రద్దవుతుందన్న అంశంపై బీఆర్‌ఎస్‌ నేతలు ఫోకస్‌ చేస్తున్నారు. జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సమయంలో జిల్లా రద్దవుతుందన్న అంశాన్ని ఫోకస్‌ చేయడం ద్వారా జనం మద్దుతు పొందడానికి బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు. బస్సు యాత్రలో స్థానిక అంశాలపై కేసీఆర్‌తో మాట్లాడించడం ద్వారా శ్రేణుల్లో జోష్‌ తీసుకురావాలని ఆ పార్టీ నాయకత్వం యోచిస్తోంది.

నేడు నిజామాబాద్‌లో..

రేపు కామారెడ్డిలో బస్సు యాత్ర

రోడ్‌ షోలకు ప్లాన్‌ చేసిన

బీఆర్‌ఎస్‌ నేతలు

భారీ జన సమీకరణతో శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం

Advertisement
Advertisement