'ది ఇండియన్ స్టోరీ' సినిమా రివ్యూ | Sakshi
Sakshi News home page

The Indian Story Review: 'ది ఇండియన్ స్టోరీ' మూవీ రివ్యూ

Published Fri, May 3 2024 4:35 PM

The Indian Story Movie Review And Rating Telugu

ఈ వారం థియేటర్లలోకి ఐదుకి పైగా సినిమాలు వచ్చాయి. వీటిలో 'ఆ ఒక్కటి అడక్కు', 'ప్రసన్నవదనం' చిత్రాలు ఉన్నంతలో కాస్త అంచనాలతో రిలీజయ్యాయి. వీటితోపాటు వచ్చిన మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ 'ది ఇండియన్ స్టోరీ'. రాజ్ భీమ్ రెడ్డి, జరా ఖాన్ హీరో హీరోయిన్. రాజ్ భీమ్ రెడ్డి నిర్మించారు. సమాజంలో మత సామరస్యం ఉండాలనే కాన్సెప్ట్‌తో దర్శకుడు ఆర్. రాజశేఖర్ రెడ్డి తీశారు. ఇంతకీ మూవీ ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.

కథేంటి?

మత విద్వేషాలు రగిలే రాష్ట్రంలో హిందూ వర్గానికి శ్రీరామ్ (రామరాజు), ముస్లిం వర్గానికి కబీర్ ఖాన్ (ముక్తార్ ఖాన్) నాయకత్వం వహిస్తుంటారు. ఒకరిపై మరొకరు ప్రతీకార దాడులు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి టైంలో వైజాగ్ నుంచి రెహమాన్ (రాజ్ భీమ్ రెడ్డి) వస్తాడు. ఇతడి దగ్గర బంగారు బిస్కెట్లు ఉంటాయి. అవి అమ్మడానికి స్నేహితుడు ఫేకు (చమ్మక్ చంద్ర) సాయం తీసుకుంటాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో కత్తిపోట్లకు ఎదురెళ్లి కబీర్ ఖాన్‌ని రెహమాన్ కాపాడతాడు. అనంతరం కబీర్ వర్గంలో ఓ నాయకుడిగా మారతాడు. కబీర్ కూతురు డాక్టర్ ఆయేషా (జరా ఖాన్)తో ప్రేమలో పడతారు. ఓ సంఘటన వల్ల రెహమాన్‌పై కబీర్ దాడి చేస్తాు. అసలు దీనికి కారణమేంటి? శ్రీరామ్, కబీర్ గతమేంటి? మతం పేరుతో ఈ ఇద్దరు.. ప్రజల మధ్య ఎలా చిచ్చు పెడుతున్నారు? చివరకి ఏమైందనేదే సినిమా.

(ఇదీ చదవండి: ‘శబరి’ మూవీ రివ్యూ)

ఎలా ఉందంటే?

మతాలు వేరైనా మనుషులంతా ఒక్కటే అని చెప్పే సినిమా ఇది. మతం పేరుతో జరుగుతున్న దాడుల గురించి ప్రజలకు కనువిప్పు కలగజేసే మూవీ ఇది.  హీరో, చమ్మక్ చంద్ర క్యారెక్టర్స్ మధ్య మంచి కామెడీతో ఈ సినిమా సరదాగా మొదలవుతుంది. ఆ తర్వాత ముస్తాఫా, రవి, రహీం హత్యలతో ఒక వర్గంపై మరో వర్గం దాడులు చేసుకుంటున్న టైమ్ లో ముస్లిం లీగ్ పార్టీ పేరుతో కబీర్ ఖాన్, శక్తి సేన పార్టీ పేరుతో శ్రీరామ్ రాజకీయ రంగంలోకి దిగుతారు.  ఇక్కడి నుంచి మతం పేరుతో జరిగే రాజకీయ క్రీడను దర్శకుడు ఆర్ రాజశేఖర్ రెడ్డి ఇంట్రెస్టింగ్‌గా తీశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ఫస్టాఫ్‌లో వచ్చిన సందేహాలకు సెకండాఫ్‌లో ఒక్కొక్కటిగా సమాధానం దొరుకుతుంది. క్లైమాక్స్ ఆసక్తికరంగా అనిపిస్తుంది.

హీరోగా రాజ్ భీమ్ రెడ్డి ఆకట్టుకున్నాడు. హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ఎమోషన్ ఉంటుంది. ఫైట్లు బాగానే తీశారు. హీరోయిన్ జరా ఖాన్ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. శ్రీరామ్‌గా రామరాజు, కబీర్ ఖాన్‌గా  ముక్తార్ ఖాన్ ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, సంగీతం, దర్శకత్వం ఇలా అందరూ తమ తమ పనికి పూర్తి న్యాయం చేశారు.

(ఇదీ చదవండి: సుహాస్ 'ప్రసన్న వదనం' రివ్యూ.. మరో హిట్‌ పడినట్టేనా?)

Rating:
Advertisement
Advertisement