‘నల్లసూరీడు’పై నజర్‌ | Sakshi
Sakshi News home page

‘నల్లసూరీడు’పై నజర్‌

Published Mon, May 6 2024 6:25 AM

‘నల్లసూరీడు’పై నజర్‌

మూడు దశాబ్దాలుగా స్పష్టతలేని ఆదాయపు పన్ను మాఫీ

మోక్షం లభించని కొత్తగనుల ఏర్పాటు, యువతకు ఉద్యోగాల కల్పన

అనుబంధ పరిశ్రమల ఏర్పాటుపై రాజకీయ నేతల హామీలు

గోదావరిఖని: పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో సింగరేణి కార్మికుల ఓట్లే కీలకం. దీంతో వారిని మచ్చిక చేసుకుని తమ పార్టీ అభ్యర్థిని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో ప్రధాన రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి.

రెండు జిల్లాలు.. రెండు లక్షల ఓట్లు..

● పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధి విస్తరించిన మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో సుమారు రెండు లక్షలకుపైగా ఓట్లు ఉన్నాయి.

● రామగుండం రీజియన్‌లో రామగుండం, మంథని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఆర్జీ–1,2,3, ఏపీఏ ఏరియాల్లో సుమారు 12వేలకు పైగా పర్మినెంట్‌, 8వేలకుపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

● బెల్లంపల్లి రీజియన్‌లోని మంచిర్యాల, చెన్నూ రు, బెల్లంపల్లి నియోజవర్గాల్లో బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్‌ ఏరియాల్లో 16వేలకుపైగా పర్మినెంట్‌ కార్మికులు, మరో 7వేలకుపైగా కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు.

● వీరి కుటుంబాలతో సహా ఒక్కో ఇంటికి నలుగురు చొప్పున లెక్కించినా సుమారు రెండులక్షలకుపైగా ఓట్లు ఉంటాయని నాయకులు అంచనా వేస్తున్నారు.

● దీంతో వీరి ఓట్లపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించారు.

● ఉదయం బొగ్గుగనులపై గేట్‌ మీటింగ్‌లు నిర్వహిస్తూ, సాయంత్రం కార్మిక వాడల్లో పర్యటిస్తూ ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

● మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన నేతల తాకిడి ఈప్రాంతాల్లో పెరుగుతోంది.

● ఈనెల 3న మాజీ సీఎం కేసీఆర్‌ పర్యటించారు. 6న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

నలుగుతున్న ఆదాయపు పన్ను మాఫీ..

సింగరేణి కార్మికులను సైనికులతో సమానంగా గుర్తిస్తామని అన్ని పార్టీలు ప్రకటిస్తున్నాయి. తాము గెలిచిన వెంటనే ఆదాయపు పన్ను మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నాయి. అయితే, గెలిచాక పార్లమెంట్‌లో కొద్దిరోజులు పోరాటం చేయడం, ఆ తర్వాత హామీ అటకెక్కించడం సర్వసాధారణంగా మారింది. ఇలా దశాబ్దాలుగా ఈ అంశం నలుగుతోంది.

నూతన భూగర్భగనులు..

తాము గెలిస్తే సింగరేణి సంస్థకు పూర్వవైభవం తీసుకురావడంతోపాటు కార్మికుల సంఖ్య పెంచేందుకు కొత్తగా భూగర్భ గనులు తవ్విస్తామని ప్రధాన రాజకీయ పార్టీలు హామీ ఇస్తున్నాయి. కార్మికులతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హైపవర్‌ కమిటీ వేతనాలు అమలు చేస్తామని అంటున్నాయి.

స్కిల్‌ ట్రైనింగ్‌ సెంటర్లపై దృష్టి

అందరికీ ఉద్యోగావకాశాలు కల్పించకపోయినా.. నిరుద్యోగులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించేలా చూస్తామని పలు పార్టీల నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లాలో ఒక ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయగా, రామగుండం నియోజవర్గంలోని గోదావరిఖనిలో మరో స్కిల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ప్రారంభించేందుకు సింగరేణి సిద్ధమవుతోంది.

జాడలేని మారుపేర్ల మార్పు..

సుమారు 20ఏళ్లుగా నలుగుతున్న మారుపేర్ల మార్పుపై గత పాలకులు హామీలు ఇచ్చినా సింగరేణి ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో 400మందికి పైగా కార్మిక కుటుంబాల డిపెండెంట్‌ కేసులు కార్పొరేట్‌ కార్యాలయంలో నాలుగేళ్లుగా ముందుకు కదలడంలేదు. దీనిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కనీసం ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారిన ఈ సమస్యలకు గెలిచిన పార్టీలు పరిష్కారం చూపాలని కార్మికులు, వారి కుటుంబాలు కోరుతున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement