బారామతిలో అలాంటి పనులు పనిచేయవు: అజిత్‌ పవార్‌ | Sakshi
Sakshi News home page

బారామతిలో అలాంటి పనులు పనిచేయవు: అజిత్‌ పవార్‌

Published Mon, May 6 2024 12:19 PM

Ajit Pawar mocks nephew Rohit Pawar ahead of Supriya sule rally

మహారాష్ట్రలో కీలకమై బారామతి పార్లమెంట్‌  స్థానంలో పవార్‌ వర్సెస్‌ పవార్‌ పోటీ నెలకొంది. మూడో దశలో మే 7(మంగళవారం) బారామతిలో పోలింగ్‌ జరగనుంది. ఆదివారంతో ఇక్కడ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో పూణె జిల్లాలోని బారామతిలో నిర్వహించిన ఓ  ర్యాలీలో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ ప్రసంగించారు. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీని ‘వికాస్‌ పురుష్‌’అంటూ ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఇటీవల తన మేనల్లుడు రోహిత్‌ పవార్‌పై విమర్శలు చేశారు.  సిట్టింగ్‌ ఎంపీ, ఎన్సీపీ (శరద్‌ చంద్ర పవార్‌) అభ్యర్థి సుప్రియా సూలే తరఫున ప్రచారం చేస్తూ రోహిత్‌ పవార్‌ భావోద్వేగానికి గురైన విషయాన్ని ప్రస్తావించారు.

‘నీ భావోద్వేగాలతో కొంతమంది ఆడుకుంటారని చెప్పాను. కానీ, అలాంటి పనులు బారామతిలో పని చేయవు. విమర్శలు చేయడానికి ప్రయత్నం చేయను. అభివృద్ధి కోసం నిరంతరం పని చేయటానికే నా తొలి ప్రాధన్యం. ఇప్పటివరకు చాలా ప్రచార ర్యాలీలో పాల్గొన్నా. కానీ, ఇంత పెద్దసంఖ్యలో అభిమానులు, జనాలను చూడలేదు. 

ఇదంతా చూస్తే.. మన గెలుపు ఖాయమని అర్థమవుతోంది.   రాజకీయాలు నేర్పింది నేనే అని చెప్పే రోహిత్‌.. ఇప్పడు నాపై విమర్శలు చేస్తున్నాడు. అయినా నేను వాటిని పట్టించుకోను. అభివృద్ధి కోసం పనిచేయటమే నా తొలి ప్రాధాన్యం’ అని అజిత్‌ పవార్‌ అన్నారు. 

అదేవిధంగా ‘ప్రధాని మోదీ భారత దేశానికి వికాస్‌ పురుష్‌. ఈ లోక్‌సభ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. బారామతి గత 15ఏళ్లగా ఎటువంటి నిధులు పొందలేదు. కానీ, ప్రస్తుతం 2499 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు నిధలు అనుమతులు పొందాయి’ అని అజిత్‌ పవార్‌ వెల్లడించారు. 

ఇక.. ఇటీవల సుప్రియా సూలేకు మద్దతుగా ఓ ర్యాలీలో పాల్గొన్న రోహిత్‌ ప్రవార్‌ ప్రసంగిస్తూ  తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ‘‘పార్టీ రెండుగా చీలినప్పుడు నేను పార్టీ కార్యకర్తలతో కలిసి శరద్‌ పవార్‌ను కలిశాను. మేము, కుటుంబం అండగా ఉంటామని తెలిపాను’’ అని ఒకింత భావోద్వేగంతో మాట్లాడారు.

Advertisement
Advertisement