
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్–19 కేసుల సంఖ్య 35 వేలు దాటిపోవడంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. వారాంతపు రోజుల్లో లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే శని, ఆదివారాల నుంచి అమలయ్యే ఈ నిబంధనలు ఈ నెలాఖరు వరకు అమల్లో ఉంటాయని రాష్ట్ర అదనపు చీఫ్ సెక్రటరీ(హోం, సమాచార) అవనీశ్ అవస్థి పేర్కొన్నారు. ముఖ్యంగా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జనసమ్మర్థం ఉండే మార్కెట్లు, కార్యాలయాలను ఈ రెండు రోజుల్లో మూసివేసి ఉంచుతామన్నారు.
బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేస్తాయని తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని మార్కెట్లు పనిచేస్తాయన్నారు. వచ్చే శని, ఆదివారాల్లో అన్ని రకాల దుకాణాల వద్ద ప్రత్యేక పారిశుధ్య, శానిటైజేషన్ కార్యక్రమాలను చేపట్టాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. దీంతోపాటు, ప్రభుత్వం ప్రకటించిన విధంగా శుక్రవారం రాత్రి నుంచి సోమవారం వరకు 55 గంటలపాటు ఆంక్షలు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి.