రాహుల్‌.. ఓ జోకర్‌! | KCR Fires On Rahul Gandhi And Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 1 2018 2:00 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

KCR Fires On Rahul Gandhi And Chandrababu Naidu - Sakshi

ములుగు సభలో ప్రసంగిస్తున్న కేసీఆర్‌

సాక్షి నెట్‌వర్క్‌: ‘రాహుల్‌గాంధీ నిన్న తెలంగాణ ప్రాజెక్టులపై కారుకూతలు కూసి పోయిండు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చూసి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ది కమీషన్ల ప్రభుత్వమని సొల్లు ఆరోపణలు చేస్తూ జోకర్‌లా వ్యవహరించిండు. కమీషన్ల కక్కుర్తి చరిత్ర కాంగ్రెస్‌ పార్టీకే ఉంది. రాహుల్‌దే కమీషన్ల బతుకు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక నిధులు మింగింది ఆయన కుటుంబమే’అని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిప్పులు చెరిగారు. రాహుల్‌ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించబోమన్నారు. ‘ఉప్పిడుండి, ఉపాసముండి అటుకులు తినుకుంటూ పేగులు తెగేదాక కోట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నోళ్లం.. మమ్ముల అంటే సహించం’అని హెచ్చరించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లా మంథని, పెద్దపల్లిల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రసంగించారు. ‘ఈ చిల్లర కాంగ్రెస్‌ నాయకులు కిరికిరి రాజకీయాలు చేస్తరు. వాళ్లకు మెదడు తక్కువ. పంచాయితీ ఎక్కువ. మన నీళ్లు.. వాళ్ల నీళ్లు.. వీళ్ల నీళ్లు ఉండయి. గోదావరిలో బోలెడు నీళ్లున్నయి. కొన్ని వందల టీఎంసీల నీళ్లు తీసుకుంటున్నం. తెలంగాణంలో ఏ ఇంచైనా నాదే. బెత్తెడు జాగ గూడ నాదే. అంత కూడా పారాలె.. అందరు బతకాలె. కిరికిరి మాటలు నమ్మొద్దు. కాంగ్రెస్‌ దద్దమ్మలు, ఢిల్లీ బానిసలు కలిసి ప్రాజెక్టులను పిచ్చిపిచ్చిగా డిజైన్‌ చేసి తెలంగాణకు నీళ్లు రాకుండా చేసిండ్రు. మన నీటి వాటా మనం దక్కించుకునేందుకు ప్రాజెక్టుల రీడిజైన్‌ చేసినం. ఏనాడూ రైతులు, ప్రజా సంక్షేమం గురించి ఆలోచించని రాహుల్‌గాంధీ.. రైక గాంధీ.. తోక గాంధీ.. పచ్చి అబద్ధాలు చెప్తే తెలంగాణ సమాజం ఊరుకోదు’అని అన్నారు. 58 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణలో పూర్తిగా జీవన విధ్వంసానికి పాల్పడ్డాయని కేసీఆర్‌ ఆరోపించారు. ఇప్పుడు ఈ 2 పార్టీలు అక్రమంగా పొత్తులు పెట్టుకుని సిగ్గు లేకుండా ఓట్లడిగేందుకు వస్తున్నాయని విమర్శించారు. టీడీపీ, కాంగ్రెస్‌లు హిమాలయాలకు వెళ్లి ఏమైనా ఆకుపసరు తాగి పునీతమయ్యాయా అని ప్రశ్నించారు.  

కాంగ్రెస్, బీజేపీ రెండూ దరిద్రంగొట్టే... 
‘దేశంలో చాలా అరాచకం నడస్తంది. కాంగ్రెస్, బీజేపీ రెండూ దరిద్రంగొట్టే. ఈళ్లు ఎన్నడూ ప్రజలకు మేలు చేయలె. నిరంకుశత్వం చెలాయిస్తా ఉన్నరు. ప్రధాని మోదీ మొన్న నిజామాబాద్‌లో పచ్చి అబద్దాలు మాట్లాడిండు. దేశాన్ని పాలించే వ్యక్తి గింత అల్పకంగా.. గింత తప్పుగా మాట్లాడొచ్చా? గింత దరిద్రపుగొట్టు రాజకీయాలు ఉంటయా? ఆయన మాటలకు నేను అప్పుడే స్పందించిన. నువ్వు ఆడనే ఉండు, హెలికాప్టర్‌లో గంటలో నీ దగ్గరకు వస్త. నిజమాబాద్‌ గడ్డ మీదనే నీ సంగతి.. నా సంగతి చూసుకుందమని అంటే, ఉండలె.. దాటి పోయిండు’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. కేంద్ర పార్టీలు అనే అహకారంతో అవాకులు, చెవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. అంతర్జాతీయ సమస్యలు పక్కనపెట్టి.. కిరికిరి పెట్టి పెత్తందారీతనం చెలాయిస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో ఇక్కడి వాళ్లే అధికారంలో ఉన్నా.. పోడు భూముల సమస్య పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కేసీఆర్‌ పట్టుబడితే మొండిపట్టే. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ సహా ఇతర జిల్లాల్లో ఉన్న పోడు భూముల సమస్యను అ«ధికారంలోకి వచ్చిన ఐదారు నెలల్లో పరిష్కరించి హక్కులు కల్పిస్తా. కాంగ్రెస్‌ బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసుకుని రాహుల్, మోదీల నిషా దించాలె. ఇందుకోసం ప్రజలు సిద్ధంగా ఉండాలె. 17 మంది ఎంపీలను గెల్చుకొని ఢిల్లీలో చక్రం తిప్పుదం’అని పిలుపునిచ్చారు. 

శుక్రవారం భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభకు హాజరైన ప్రజలు 
 
రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా నిలిపినం...  
‘ప్రస్తుతం తెలంగాణను సొంత వనరులు పెంచుకోవడంలో, తలసరి ఆదాయంలో, విద్యుత్‌ సరఫరా, తలసరి విద్యుత్‌ వినియోగంలో నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపినం. ఇక పాలన మరింత చేరువ చేసేందుకు కొత్త జిల్లాలు, 3,500 గిరిజన గూడేలను గ్రామ పంచాయతీలుగా చేసినం. గిరిజన గూడేలు, తండాల్లో స్వయంపాలనకు అవకాశం కల్పించినం’అని కేసీఆర్‌ వివరించారు. వచ్చే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ములుగు జిల్లాను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని ప్రత్యేక గిరిజన జిల్లాగా ఏర్పాటు చేయవచ్చనే విషయంపై ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడినట్టు తెలిపారు. డిసెంబర్‌ 12న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత జనవరి 24వ తేదీన తానే స్వయంగా వచ్చి జిల్లాను ప్రారంభించి ములుగు ప్రజలకు బహుమానంగా ఇస్తానని చెప్పారు. దీంతోపాటే మంల్లంపల్లిని మండలంగా చేస్తామని పేర్కొన్నారు. కోలిండియా కంటే గొప్ప చరిత్ర ఉన్న సింగరేణి ద్వారా బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇల్లెందులో కొత్త భూగర్భ గనిని ప్రారంభిస్తామని, కొత్తగూడెంలో మైనింగ్‌ విశ్వవిద్యాలయాన్ని, విమానాలు దిగేందుకు ఏర్‌డ్రోమ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 

భూపాలపల్లి సభలో మాట్లాడుతున్న కేసీఆర్‌, చిత్రంలో మధుసూదనా చారి

తికమక లేదు... 
ఈ ఎన్నికల్లో పెద్ద తికమక లేదని.. ఓ వైపు టీడీపీ, కాంగ్రెస్‌ కూటమి, మరోవైపు తెలంగాణ కోసం పోరాడి, రాష్ట్రం తెచ్చి, ప్రజల దీవెనతో నాలుగేండ్లు పాలించిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఉందని కేసీఆర్‌ పేర్కొన్నారు. పోటీ ఈ రెండు పార్టీల మధ్యనే ఉందని.. మధ్యలో వేరేవాళ్లున్నా.. వాళ్లు లెక్కలోకే రారని స్పష్టంచేశారు. విషయాలన్నీ ప్రజల కళ్ల ముందున్నాయని.. కరెంట్‌ సరఫరా కాంగ్రెస్, టీడీపీ హయాంలో ఎలా ఉందో, ఇప్పడెలా ఉందో ఆలోచించాలని కోరారు. పేదరికం పోవాలని దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, పింఛన్లు, సన్నబియ్యం, కేసీఆర్‌ కిట్, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేస్తున్నామన్నారు. బీజేపీ పాలిస్తున్న 19 రాష్ట్రాల్లో ఎక్కడైనా రూ.1000 పింఛన్, కళ్యాణలక్ష్మి, నిరంతర విద్యుత్‌ సరఫరా చేశారా అని ప్రశ్నించారు. ప్రజలు అన్ని విషయాలూ ఆలోచించి ఓటేయాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement