సునంద పుష్కర్ మృతి కేసు విచారణ ఎంత వరకు వచ్చిందో తెలపాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతి కేసు విచారణ ఎంత వరకు వచ్చిందో.. సమగ్ర నివేదిక దాఖలు చేయాలని పోలీసులను గురువారం ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మూడు రోజుల్లో ఈ నివేదికను అందజేయాలని జస్టిస్ జీఎస్ సిస్టానీ, జస్టిస్ చంద్రశేఖర్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
అయితే సీబీఐ నివేదికను కోర్టులోనే తనకు అందజేసిందని, వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి తనకు కొంత సమయం కావాలని ఢిల్లీ పోలీస్ న్యాయవాది రాహుల్ మెహ్రా కోరారు. దీంతో కోర్టు ఆగస్టు 1 తేదీ వరకు సమయం ఇచ్చింది. ఈ నివేదిక ప్రతిని సునంద పుష్కర్ మృతిపై కోర్టులో పిటిషన్ వేసిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఇవ్వాలని సూచించింది.