
లెసైన్స్‌లు తప్పనిసరి
లెసైన్స్ లేని విద్యార్థులు పాఠశాలలకు ద్విచక్ర వాహనాల్లో వచ్చేందుకు అనుమతించరాదని ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
ప్యారిస్:లెసైన్స్ లేని విద్యార్థులు పాఠశాలలకు ద్విచక్ర వాహనాల్లో వచ్చేందుకు అనుమతించరాదని ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యా శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అందులోనూ చదువుకునే విద్యార్థులు లెసైన్స్ పొందకుండానే వాహనాలను నడిపి ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు అధికంగా ఉన్నాయి. అలాంటి ప్రమాదాలను నివారించేందుకుగాను, పాఠశాలల విద్యార్థులు భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, పాఠశాల విద్యాశాఖ పలు విధాలైన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా పాఠశాల విద్యాశాఖ తరపున పాఠశాలలకు ఉత్తర్వులు పంపించింది.
అందులో రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు (16 నుంచి 18 వయస్సు వరకు) డ్రైవింగ్ లెసైన్స్ లేకుంటే, ద్విచక్ర వాహనాల్లో పాఠశాలలకు వచ్చేందుకు అనుమతించకూడదని స్పష్టం చేశారు. దీనిని అదుపు చేసేందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల వాహన, లెసైన్స్ ఆధారాలను సరి చూసిన తర్వాతనే ఆ వాహనాన్ని నడిపేందుకు అనుమతించాలన్నారు . లెసైన్స్ లేనిపక్షంలో ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకుని, సదరు విద్యార్థి తల్లిదండ్రులను పిలిపించి, కఠినంగా హెచ్చరించి వారికి ఆ వాహనాన్ని అప్పగించాలి. ఈ ఉత్తర్వులను అలక్ష్యం చేసిన పక్షంలో పాఠశాలకు బైకులపై వచ్చే విద్యార్థులకు ప్రమాదాలు జరిగినట్లైతే దానికి ఆయా పాఠశాలలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించారు.
అదేవిధంగా విద్యార్థులకు ట్రాఫిక్ విధులను తప్పక పాటించే విధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయమై ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కొందరు మాట్లాడుతూ ఇదివరకు సొంత వాహనాలపై పాఠశాలలకు వచ్చే విద్యార్థుల లెసైన్స్‌ను పరిశీలించాలని ఉత్తర్వులు వచ్చినట్లు తెలిపారు. వాటిని పీఈటీ ఉపాధ్యాయుల ద్వారా సరి చూస్తున్నాము. లెసైన్స్ పొందని విద్యార్థులు డ్రైవింగ్ చేసేందుకు నిషేధం విధించినట్టు తెలిపారు. ఇక మీద విద్యార్థులు ఏ వాహనంలో వచ్చినప్పటికీ ఆయా వాహనాలకు సంబంధించిన దస్తావేజులను, విద్యార్థుల లెసైన్స్‌ను పరిశీలిస్తామని తెలిపారు.