
వికారాబాద్: ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక స్కూల్ భవనం పైనుంచి దూకి ప్రాణాపాయం నుంచి బయటపడిన బాలిక ఘటనను మరువకముందే.. ఇదే స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థినులను బూతులు తిడుతూ, కొడుతున్న వీడియో కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా కొత్తగడిలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో నెల రోజుల కిందట ఓ పదో తరగతి విద్యార్థిని స్కూల్ బిల్డింగ్ పైనుంచి కిందికి దూకింది.
తీవ్ర గాయాలపాలైన బాలిక కాలు విరగగా ప్రాణాలతో బయటపడింది. ఇందుకు స్కూల్ సిబ్బంది వేధింపులే కారణమని బాధితురాలు తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ఘటనను మరువక ముందే.. ముగ్గురు బాలికలను తన చాంబర్‌కు పిలిపించుకున్న ప్రిన్సిపల్ వారిని అసభ్యకరంగా తిడుతూ, ఇష్టానుసారం కొడుతున్న వీడియో వైరల్‌గా మారింది.
జుట్టు ఎందుకు విరబోసుకున్నావ్.. యూనిఫామ్ ఎందుకు వేసుకోలేదు.. బయటకు ఎందుకు వెళ్లావ్ అంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ దాడి చేస్తున్న దృశ్యాలను చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెన్త్ బాలిక ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని మండిపడుతున్నారు.
— Telugu Scribe (@TeluguScribe) April 1, 2025